Mar 16,2023 21:41

సాగునీటి ప్రాజెక్టులకు నామమాత్ర కేటాయింపులు
చింతలపూడికి రూ.272 కోట్లు, తాడిపూడికి రూ.22 కోట్లే
పోలవరం ప్రాజెక్టుకు రూ.5004 కోట్లు
డెల్టా ఆధునికీకరణకు రూ.12 కోట్లు విదిలింపు
ఆక్వా రైతుల విద్యుత్‌ రాయితీలపై మౌనం
కొల్లేరు రెగ్యులేటర్ల ప్రస్తావన కరువు
ఫిషింగ్‌ హార్బర్‌, ఆక్వా యూనివర్సిటీ ఊసే లేదాయే
నిర్వాసితుల హామీలకు కానరాని కేటాయింపులు
జిల్లావాసులను నిరాశపర్చిన రాష్ట్ర బడ్జెట్‌
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

2023-24 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో జిల్లాకు సరైన కేటాయింపులు లేకుండాపోయాయి. ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల గురించి ప్రస్తావన లేకుండాపోయింది. కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణం, ఫిషింగ్‌ హార్బర్‌, ఆక్వా యూనివర్సిటీ ఊసే లేకుండాపోయింది. పోలవరం నిర్వాసితుల హామీలకు సంబంధించి నిధుల వివరాలు ఎక్కడా కన్పించలేదు. మొత్తంగా బడ్జెట్‌లో జిల్లాకు మొండిచెయ్యి చూపారు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు ఒకింత ఊరటగా చెప్పొచ్చు.
రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు మొండిచెయ్యి చూపారు. దశాబ్దాల కాలంగా సాగుతున్న సాగునీటి ప్రాజెక్టు పనులకు ఈ బడ్జెట్‌లోనూ సరైన కేటాయింపులు లేకుండా పోయాయి. అరకొర కేటాయింపులతో మమ అన్పించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేవలం రూ.272 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తక్షణం పూర్తి చేయాల్సిన మెయిన్‌ కెనాల్‌కు రూ.1500 కోట్లు అవసరం. 4.80 లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టుకు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విధంగా కేటాయిస్తే మరో రెండు దశాబ్దాలు గడిచినా చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయ్యే పరిస్థితి ఉండదని చెప్పొచ్చు. చేసిన పనులకు పెండింగ్‌ బిల్లులే రూ.149 కోట్లు వరకూ ఉన్నాయి. కేటాయించిన నిధులు చేసిన పనుల చెల్లింపులకే సగం సరిపోతాయి. మిగిలే కొద్దిపాటి నిధులతో ప్రాజెక్టు పనులు ఏవిధంగా ముందుకు సాగుతాయో ప్రభుత్వమే చెప్పాలి. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును ఎప్పటికి పూర్తి చేస్తారో పాలకులే చెప్పాలి. మరో ఎత్తిపోతల పథకం తాడిపూడికి సైతం ఈ బడ్జెట్‌లో రూ.22 కోట్లు మాత్రమే కేటాయిం చారు. పిల్ల కాలువల తవ్వకాలు పూర్తయితే 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వానికి పట్టని పరిస్థితి నెలకొంది. 2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాగు నీరందించలేని దుస్థితి ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా ప్రాజెక్టు మాత్రం పూర్తి కావడం లేదు. ఈ ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోని పరిస్థితి ఉంది. ఇక కొవ్వాడకు సంబంధించి రూ.5.29 కోట్లు కేటాయించగా, ఎర్రకాలువ ప్రాజెక్టుకు రూ.8.43 లక్షలు కేటాయిం చారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,004 కోట్లు కేటాయింపు మాత్రం కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న అన్ని ఇరిగేషన్‌ పథకాలకు సంబంధించి ఈ నిధుల కేటాయింపు జరిగింది. పోలవరం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్రం నిధుల విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టు పనులతోపాటు నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం సైతం ఇవ్వని పరిస్థితి ఉంది. నిర్వాసితులకు పరిహారం అందక ప్రతియేటా విరుచుకుపడే గోదావరి వరదలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన పునరావాస ప్యాకేజీ రూ.పది లక్షలు, ఎకరాకు రూ.ఐదు లక్షలు అదనంగా ఇస్తామన్న హామీలకు సంబంధించి సైతం నిధుల కేటాయింపు ఎక్కడా కన్పించలేదు.