'ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నదే చావడానికి, కాకపోతే ఇప్పుడా ఇంకొన్ని రోజుల్లోనా అన్నదే''. అంతేకాదు ''సంపద సృష్టికర్తలు కార్పొరేట్లు కాబట్టి వారిని దేశం గుర్తించి, గౌరవించాలి'' అని మొదటి సారి పదవీకాలం ముగిసేటప్పుడు ప్రధాని మోడీ విస్పష్టంగా చెప్పారు. దేశ ప్రజలకు ఆ మాటలకు అర్థం అప్పుడు తెలియలేదు. కరోనా విజృంభించిన నేపథ్యంలో లాక్‌డౌన్ కాలంలో 14.40 కోట్ల మంది ప్రజలు తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ప్రాణ భయంతో భౌతికంగా గుమికూడలేని పరిస్థితులు. ఈ నిస్సహాయతను తమకు అనుకూలంగా మలచుకొని ''ఇప్పుడు కాకపోతే, ఇక ముందు కుదరదు'' అన్నారు కేంద్ర పాలకులు. అంటే ప్రజలు తెప్పరిల్లి, చైతన్యవంతులు కాకముందే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అయినకాడికి అమ్మివేయడం, విలీనం చేయడం, మూసివేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోగుట్టు విప్పారు.
చమురు కంపెనీలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ముఖేష్ అంబానీకి, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఆహార ధాన్యాల గిడ్డంగులు, బొగ్గు గనులు, అడవులు గౌతమ్ ఆదానీకి ధారాదత్తం చేస్తున్నారు. కరోనా, ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల దుష్ఫలితాల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ -24 శాతానికి కంగిపోయిన తరుణంలోనే ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరులలో 6 నుంచి 4వ స్థానానికి ఎగబాకాడు. అతని వ్యక్తిగత అస్థి రూ.2,77,700 కోట్ల నుంచి రూ.6,58,400 కోట్లకు పెరిగింది. అతనికి ప్రతీ గంటకు రూ.90 కోట్ల సంపద పోగుబడుతున్నది. గౌతమ్ ఆదానీ ఆస్తులు రూ.2,81,152 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో దేశంలో ప్రతీ ఏటా 3.50 కోట్ల మంది పిల్లలు పుడుతున్నారు. వారిలో 70 లక్షల మంది మొదటి పుట్టినరోజు జరుపుకోకుండానే పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారు. ఎంతటి అమానవీయ పరిస్థితి.
2004 నుంచి ఇప్పటి వరకు పదిహేడేళ్లలో ప్రభుత్వ రంగ కంపెనీలు, సేవా సంస్థలు దేశ ఖజానాకు రూ.32,99,085 కోట్లను పన్నులు, డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో ప్రభుత్వ రంగ సంస్థలకు విస్తరణకు అవకాశం ఇవ్వకుండా, కాంట్రాక్టులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేసినా 2019-20 లోనే రూ.1,43,000 కోట్ల నికర లాభలార్జించాయి. ఈ ఆరేళ్ల బిజెపి పాలనలో కార్పొరేట్లకు ఇచ్చిన పన్ను రాయితీలు రూ.6 లక్షల కోట్లు. ప్రజలు నష్టపోయింది ప్రభుత్వ రంగ సంస్థల వల్ల కాదు. కార్పొరేట్ల వలన అని మనకు అర్థమవుతుంది. కరోనా కాలంలో కుబేరులపై పన్నులు పెంచాల్సి ఉండగా, 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. ఫలితంగా దేశం రూ.1.45 లక్షల కోట్లు నష్టపోయింది. కానీ ఆదాయపన్ను తగ్గించాలని మధ్య తరగతి ఎంతగా ప్రాధేయ పడినా కేంద్రం కనికరించలేదు.
ప్రభుత్వం వ్యాపారం చేయదు. ఆ పని ప్రయివేటు రంగం చూసుకుంటుందని బాహాటంగానే కేంద్ర పాలకులు చెబుతున్నారు. 100 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ నుంచి పీఎస్‌యూలు ఉపసంహరిస్తున్నారు. తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరించే పనిలో ఉన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగంతో స్థాపించుకున్న స్టీల్‌ప్లాంట్ ...ఎప్పుడూ 200 శాతం లాభాలార్జించేది. అలాంటి సంస్థకు స్వంత గనులు కేటాయించకుండా నష్టాల పాల్జేసి, రూ.2 లక్షల కోట్ల ఆస్తులున్న ఉక్కు ఫ్యాక్టరీని రూ.4889 కోట్లకు కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ విధానాన్ని ప్రజల సంపదను ఆశ్రిత పెట్టుబడిదారులకు దోచిపెట్టడం కాక దేశభక్తి అందామా? భారతీయ రైల్వేలు ఆసియా ఖండంలోనే అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ. పాసెంజర్ రైళ్లలో ప్రజలు చౌకగా ప్రయాణిస్తూ తమ జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్ల ద్వారా వేల కోట్ల రూపాయల లాభాలార్జిస్తున్నది. పాసెంజర్ రైళ్ల నష్టాలు చూపించి రైళ్లను ప్రయివేటీకరిస్తున్నారు. అంతేగాక... నాలుగు వ్యూహాత్మక రంగాలను మినహా అన్నింటిని వదిలించుకుంటామని ప్రధాని మోడీ ప్రకటించారు. వీటిలో కూడా రూ.1.75 లక్షల కోట్ల రూపాయల విలువ గల పబ్లిక్‌సెక్టార్ యూనిట్ల (పీఎస్‌యూఎస్) ఉపసంహరణ జరిగింది. 2020-21 లక్ష్యం రూ.2.10లక్షల కోట్లు.
ఇలావుండగా, దేశ సంపద, సహజ వనరులు తరిగిపోతున్నాయి. అవి ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీ వంటి కొద్ది మంది కార్పొరేట్ల ఆధీనంలోకి పంపించబడుతున్నాయి. 70 కోట్ల మంది ఆధారపడిన వ్యవసాయాన్ని సైతం వారికి అప్పగించడానికే మూడు వ్యవసాయ చట్టాలు, నూతన విద్యుత్ విధానం తెచ్చింది కేంద్రం. ప్రభుత్వ విధానాలు పూర్తిగా అమలైతే ఆహార ధాన్యాల ధరలు, నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. మార్కెట్ శక్తులే నేడు పెట్రోల్, డీజిల్ ధర లను నియంత్రించినట్టుగా అన్నింటినీ అవే శాసిస్తాయి.
'వాళ్ళు కలలను దొంగిలిస్తున్నారు-నేనెలా ప్రశాంతంగా నిద్రపోగలను, వాళ్ళు భారత దేశాన్ని అమ్మేస్తున్నారు-నేనెలా నిశ్శబ్దంగా ఉండగలను? అవును శపథం చేస్తున్నాను-నేనీ దేశాన్ని అమ్మనివ్వను' అని 2014 ఎన్నికల కాలంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టమని దేశ ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. ప్రజలు దానికి అనుగుణంగా తీర్పు నిచ్చారు. ఇప్పుడు అదే పిలుపును దేశాభిమానులు ఇస్తున్నారు. స్పందించాల్సింది మళ్లీ ప్రజలే.
- బి. నరసింహారావు










