ప్రజాశక్తి-పెదబయలు రూరల్: అన్ని వర్గాల ప్రజలకు సిఎం జగన్‌మోహన్ వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, టిడిపి అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ కిడారి శ్రావణ్ కుమార్ విమర్శించారు. మండలంలో గలగండ పంచాయతీ సిరసపల్లి గ్రామంలో మండల అధ్యక్షురాలు సీకరి సుకుమారి ఆధ్వర్యంలో ఆదివారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో శ్రావణ్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఇదేం కర్మ మన రాష్ట్రానికి కరపత్రాలను అందించారు. గ్రామాలలో సమస్యలను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం శ్రావణ్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందన్నారు. అన్నింటి ధరలు పెంచేసి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్.వెంకటేష్, కే.భూషణం పాల్గొన్నారు.










