Nov 01,2023 21:18

పొట్టి శ్రీరాములు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ నాగలక్షి ్మ

ప్రజాశక్తి-విజయనగరం : అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం, కృషితో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాడనికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరెట్‌ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి, తెలుగు తల్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు రెండు నెలల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేయగా కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, దాని ఫలితంగా ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడిందన్నారు. ఆయన త్యాగాన్ని స్మరించుకునే విధంగా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారని గుర్తు చేశారు. త్యాగధనుల స్ఫూర్తితో అధికారులు ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారి కోసం తెలుగు రాష్ట్రం ఏర్పాటు చేయాలని కృషి చేసిన పొట్టి శ్రీరాములు చిర స్మరనీయులని, వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, పలు జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వాసవీ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన..
వాసవీ ఆర్యవైశ్య వెల్ఫేయిర్‌ అసోసియేషన్‌ భవనం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆలవెళ్లి శేఖర్‌ ,జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కుమ్మరిగుంట శ్రీనివాసరావు, వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు కందుల సంతోష్‌, కార్యదర్శి సముద్రాల నాగరాజు, మాచర్ల చంద్రశేఖర్‌ గుప్తా, చెన్నా బుచ్చి జనార్ధనరావు,రాంజీ, ప్రకాష్‌ పాల్గొన్నారు.