Feb 17,2023 00:02

మందుల గదిని పరిశీలిస్తున్న ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం నాయకులు

ఎంపిపి కారం లక్ష్మి
ప్రజాశక్తి-విఆర్‌.పురం

మండలంలోని మారుమూల ప్రాంతమైన జీడిగుప్ప ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఎంపిపి కారం లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఎంపిపి లక్ష్మి సిపిఎం నాయకులతో కలి జీడిగుప్ప ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రోజారమణితో మాట్లాడి సమస్యలను, రోగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి మలేరియా కేసులు ఎక్కువ వస్తున్నాయని, మందులు లేక రోగులను రిఫర్‌ చేయాల్సి వస్తుందని వైద్యాధికారి తెలిపారు. డెంగీ కిట్లు కూడా అందుబాటులో లేవన్నారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ గ్రామాల్లో జ్వరాలు, జలుబులు లాంటి కేసులు ఎక్కువగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యాధికారి, సిబ్బంది ఉండగానే సరిపోదని, అన్ని మందులు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా అన్ని రకాల మందులు అందుబాటు ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, ఆసుపత్రి సిబ్బంది ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.