
ప్రజాశక్తి-రామచంద్రపురం ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలకు వంట పాత్రలు, లైబ్రరీ పుస్తకాలు, టాయిలెట్ పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చడం పిల్లలకు మరింత పోషకాహారం అందించేందుకు కొత్త వంట పాత్రలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు చక్కటి వాతావరణంలో చదువుకునే విధంగా వారికి కావలసిన పుస్తకాలు అందిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లను మెరుగుపరిచే విధంగా టాయిలెట్ పరికరాలు అందిస్తున్నామన్నారు. మొత్తం 84 పాఠశాలకు రూ.8 లక్షల వంట పాత్రలు, రూ.3 లక్షల విలువైన పుస్తకాలు, రూ.2 లక్షల టాయిలెట్ పరికరాలు ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎంపిపి అంబటి భవాని మాట్లాడుతూ అంగన్వాడీల్లో పని చేస్తున్న భోజనం తయారు చేసే ఆయాలు మరింత రుచిగా ఆహారం తయారు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పురపాలక సంఘం చైర్‌పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, వైస్ ఎంపిపి నరాల రాజ్యలక్ష్మి, ఎంపిడిఒ కీర్తి స్పందన, డిప్యూటీ డిఇఒ ఫణి, ఎంఇఒలు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.