ప్రజాశక్తి-అనకాపల్లి
పాలకవర్గాలపై జవాబుదారీతనం ఉండాలంటే అన్ని సంఘాలు విధిగా ఆడిట్లు నిర్వహించుకోవాలని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ రావు అన్నారు. స్థానిక దొడ్డి రాము నాయుడు కార్మిక కర్షక నిలయంలో శుక్రవారం గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ లేకుండానే నష్టపరిహారం అందించేదని, ప్రస్తుతం ట్యాగ్లు వేసుకున్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో గొర్రెలు మేకలకు డి వార్మింగ్ మందులు పంపిణీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గొర్రెలు మేకల పెంపకం దారుల యూనియన్ జిల్లా చైర్మన్ గంట శ్రీరామ్ మాట్లాడుతూ సంఘ సభ్యులకు 50 శాతం రాయితీపై రుణాలు అందించాలన్నారు. 100 శాతం ఎన్సీడీసీ రుణాలు చెల్లించినప్పటికీ రావలసిన నిధులు విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనుబాబు గొర్రెలు మేకల పెంపకం దారులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా వైస్ చైర్మన్ సబ్బి శ్రీనివాసరావు, డైరెక్టర్లు పినబోయిన అప్పారావు, ఉరిగిటి శివ సూర్యనారాయణ, గోకాడ దేవుడు నాయుడు, బొట్ట వరహాలు, పల్లా సత్యారావు, వేదురు అప్పారావు, పల్లా శ్రీరాములు, మొకర అప్పలనాయుడు, ముచ్చ రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.










