Jul 14,2023 22:26

మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి
మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలి
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) జిల్లా సమావేశం
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

అన్నదాతలను విస్మరిస్తే ఆహార సంక్షోభం తప్పదని, ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) జిల్లా సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ నెల 21న ఏలూరులో నిర్వహిస్తున్న జిల్లా సదస్సును, 30న విజయవాడలో రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. స్థానిక ఐఎఫ్‌టియు జిల్లా కార్యాలయంలో సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) జిల్లా సమావేశాన్ని ఎఐకెఎంఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి పి.శ్రీనివాస్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో వివిధ రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని రైతాంగ సమస్యలపై చర్చించి కార్యాచరణ కార్యక్రమాలు రూపొందించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి ధర్ముల సురేష్‌, అఖిల భారత ప్రగతిశీల రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌కె.గౌస్‌, బికెఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, రైతుకూలీ సంఘం (ఎపి) జిల్లా కార్యదర్శి ఎస్‌కె.భాషా, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్‌రావు, ఎపి కౌలురైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ కె.అప్పారావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సిరికొండ రామారావు, ఎఐకెఎంఎస్‌ జిల్లా నేత వెట్టి సుబ్బన్న, అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం జిల్లా అధ్యక్షులు గెడ్డాల ముత్యాలరావు మాట్లాడారు. ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిందని విమర్శించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేరళ తరహాలో రుణ విమోచన చట్టం తీసుకొచ్చి రైతులను ఆదుకుని ఆత్మహత్యలను నివారించాలని కోరారు. కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లు నుండి వ్యవసాయాన్ని మినహాయించి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే విధానానికి స్వస్తి పలకాలన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని, అన్నదాతలను ప్రభుత్వాలు విస్మరిస్తే దేశంలో ఆహార సంక్షోభం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.
21న ఏలూరులో ఎస్‌కెఎం జిల్లా సదస్సు
ఈ నెల 21న ఏలూరులోని కొత్త బస్టాండ్‌ సమీపంలోని సిఐటియు జిల్లా కార్యాలయ హాలులో సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) జిల్లా సదస్సు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సదస్సులో వివిధ రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక సంఘాల ప్రతినిధులు, రైతాంగం పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.