May 02,2023 21:17

రుద్రవరం మండలంలో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు టి.రామచంద్రుడు

అన్నదాతను ఆదుకోవాలి : రైతు సంఘం
ప్రజాశక్తి - రుద్రవరం

       గత మూడు రోజులుగా కురుస్తున్న అకాలవర్షాలతో నష్టపోయిన అన్నదాతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా సహా కార్యదర్శి టి.రామచంద్రుడు డిమాండ్‌ చేశారు. మంగళవారం రుద్రవరం మండలంలోని కె.కొత్తూరు, కోటకొండ, ఎల్లా వత్తుల, డి.కొట్టాల, చిన్న కంబలూరు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు జిల్లాలో వరి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, మామిడి పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చి అప్పులు చెల్లిస్తామనుకున్న రైతుల ఆశలు అడియాసలు అయ్యాయని అన్నారు. రుద్రవరం మండలంలో వరి పంట నేలకొరిగి కోత కోసుకోవడానికి అనుకూలంగా లేకుండా తడిసిపోయిందని, కోత కోసిన పొలాల్లో కుప్పలుగా పెట్టిన ధాన్యం కుప్పల కిందికి నీళ్లు వచ్చి దెబ్బతిందన్నారు. రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యం కుప్పలపై అధిక గాలి వల్ల టార్పాలిన్‌ పట్టలు లేచిపోయి తడిసిపోయాయని, అలాగే ఉంచిన మొక్కజొన్న వేడి ఎక్కువ కావడంతో రంగు మారి, వాసన వస్తుందన్నారు. వీటిని వ్యాపారస్తులు కొనటానికి ముందుకు రావడం లేదని, గత్యంతరం లేక చాలామంది రైతులు తక్కువ ధరకు అమ్ముకొని పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మరి కొంతమంది రైతులు తడిసిన ధాన్యాన్ని తమిళనాడు రాష్ట్రంలోని మార్కెట్లకు తీసుకుపోయి చార్జీలకు సరిపడా డబ్బులు రాక తీవ్రంగా నష్టపోయారన్నారు. అలాగే ఉద్యాన పంటలైన అరటి, బొప్పాయి, మామిడి తోటలు తీవ్ర గాలి, వర్షం కారణంగా చెట్లు పూర్తిగా పడిపోయి, పూత, పింద, కాయలు రాలి నష్టపోయారని అన్నారు. వరుసగా వస్తున్న నష్టాల వల్ల చేసిన అప్పులు చెల్లించలేమని తీవ్ర ఆవేదనలో రైతులు ఉన్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని అన్ని మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని, నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పంటల బీమా వర్తింపచేయాలని కోరారు. తడిసి రంగు మారిన ధాన్యాన్ని, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.