Feb 18,2021 06:44

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రధాని మోడీ, తన ప్రభుత్వాన్ని తాను పొగుడుకోవడానికే గంటన్నర సమయాన్ని వెచ్చించారు. కరోనా మహమ్మారిని భారతదేశం చాలా బాగా అదుపు చేసిందని ప్రపంచమంతా ప్రశంసిస్తున్నదని చెప్పారు. కానీ అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించినందువల్ల ప్రజలు పడిన ఇబ్బందుల గురించి కాని, విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ గురించిగాని చిన్నపిల్లల్లో, తల్లుల్లో పెరిగిన పోషకాహార లోపాన్ని గురించి గాని, వలస కార్మికుల పాట్లు గురించిగాని ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కోవిడ్‌ కేసుల సంఖ్యలో, మరణాల సంఖ్యలో భారత్‌ రెండవ స్థానంలో వుందన్న సంగతి కూడా ప్రస్తావించలేదు.
 

రైతుల నిరసనలు - ఆందోళన జీవులు
రైతులు చేస్తున్న పోరాటం గురించి మాట్లాడుతూ...గత ఆరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం భారతదేశ వ్యవసాయానికి, రైతులకు లాభాలు చేకూర్చిందని మోడీ అన్నారు. ఈ పోరాటంలో 200 మంది రైతులు తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోయినందుకు ఎటువంటి విచారాన్నీ వ్యక్తం చేయలేదు. పైగా, ఆయన ఈ చారిత్రక పోరాటంలో పాల్గొన్న రైతులకు వ్యతిరేకంగా వారిని 'ఆందోళన జీవులని' పరోక్ష నిందలు వేసి, నిరసనకారులను 'పరజీవులుగా', 'పరాన్నజీవులుగా' వర్గీకరించారు. సుదీర్ఘకాలం పాటు ఈ ఆందోళన జీవులు స్వాతంత్య్ర పోరాటం నడిపిన తర్వాతనే భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందింది. ఈ పోరాటం వల్లనే 'ప్రజలమైన, మనం' లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇస్తున్న మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీని కారణంగానే నేడు మోడీ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు.


ఈ స్వాతంత్య్ర పోరాటంలో లక్షల సంఖ్యలో ప్రజలు అమరులయ్యారు. కానీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ల నుంచి దేశ స్వాతంత్య్రం కోసం గానీ, ఆధునిక భారతదేశం అభివృద్ధి కోసం గానీ ఏ ఒక్కరూ త్యాగాలు చేసిన వారు లేరు. ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయోద్యమానికి దూరంగా ఉండి, కొన్ని సమయాలలో బ్రిటిష్‌ వారికి సహాయ పడిన వాస్తవం అందరికీ తెలిసిందే. బిజెపి ప్రారంభించిన నిరసనోద్యమాల నుండి మొదలుపెట్టి భారతదేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి, నిరసనకారులపై 'ఆందోళన జీవులుగా' అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనక ఒక పథకం వుంది. ఇది ప్రజలను పూర్తిగా రాజకీయ రహితం చేసే ప్రయత్నం చేయడమే. ఎటువంటి నిరసనలనూ, భిన్నాభిప్రాయాలనూ సహించని ఫాసిస్టు హిందూత్వ స్థాపన లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు తెస్తున్న ఎజెండా ఇది.


నిరసనలు రెండు విధాలు. మొదటిది మరింత మెరుగైన జీవితాల కోసం, జీవనోపాధి కోసం, దేశాభివృద్ధి కోసం జరిగేవి. ఇవి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వుంటాయి. రెండవది, ప్రజలను విభజించి, ద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసి సమాజాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో సమస్యలు సృష్టించే నిరసనలు. ఉదాహరణకు 1990వ దశకంలో బిజెపి రథయాత్ర సృష్టించిన రక్తపాతం. మత ఘర్షణలలో వేల సంఖ్యలో అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి 'ఆందోళన జీవుల' పట్ల దేశం, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి.


ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దేశం మొత్తం మీద వివిధ తరగతుల ప్రజలు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ప్రజలను విభజించడం, పాశవిక చట్టాల కింద మానవ హక్కుల కార్యకర్తలు, పౌరహక్కుల కార్యకర్తలపై నేరాలు మోపి, జైలులో నిర్భంధించడం ద్వారా ఈ బిజెపి ప్రభుత్వం ఈ పోరాటాలను అణచివేయాలని చూస్తోంది.
 

విదేశీ విధ్వంసకర భావజాలం
మన రాజ్యాంగ క్రమాన్ని సంరక్షించుకొనేందుకు చేస్తున్న ప్రజా ఉద్యమాల వెనుక 'విదేశీ హస్తం' ఉందని భారతదేశ పాలక వర్గాలు నిందిస్తున్నాయి. ప్రధాని మోడీ ఈ చారిత్రక పోరాటాలను ముఖ్యంగా రైతుల పోరాటాన్ని విదేశీ విధ్వంసకర భావజాలం నుంచి ఉద్భవించిన పోరాటంగా చెపుతున్నారు. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, వ్యవస్థలు, వాటి స్వంత హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న ప్రజలలో 'విదేశీయత' ఏదీ లేదు. ప్రధానమంత్రి మాట్లాడుతున్నది బహుశా, ఈ ప్రభుత్వం రైతుల పోరాటాన్ని అణచివేస్తున్న తీరును వ్యతిరేకిస్తూ అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న బహిరంగ నిరసన గురించి కావచ్చు. అన్నదాతలైన, మన రైతులకు జరిగిన అవమానం కంటే పెద్ద అవమానం ఇంకేదీ లేదు. వారు పండిస్తున్న ధాన్యం వల్లే, ప్రధాన మంత్రితో సహా మనందరం బతుకుతున్నాం. కానీ ఈ అన్నదాతలకు మన ప్రధాని 'ఆందోళన జీవులు', 'పరాన్నజీవులు' అని పేరు పెట్టాడు. మన 'అన్నదాతలు' పండించే ధాన్యాలను తింటూ వారినే నిందిస్తున్నవారు 'పరాన్నజీవులు'.
 

డొల్ల వాదనలు
గడిచిన ఆరేళ్ల కాలంలో తన నాయకత్వంలో, గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ రంగంలో రైతులు లాభాలు సాధిస్తున్నారని మోడీ చెప్పారు. చరణ్‌సింగ్‌ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, చరణ్‌సింగ్‌ అంచనా ప్రకారం 51 శాతంగా వున్న సన్న, చిన్నకారు రైతుల జీవితాలను మెరుగు పరిచేందుకు తన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోడీ ఉపాధి హామీ పథకాన్ని, ఎగతాళి చేశారు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఆయన ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో కుదిస్తోంది. ఆరేళ్లలో రైతుల ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గకుండా కొనసాగాయి. హరిత విప్లవం ద్వారా సంపన్న రాష్ట్రంగా మారిన పంజాబ్‌ రాష్ట్రంలో కూడా ఒక రైతు కుటుంబం సగటు నెలసరి ఆదాయం రూ.18,059 వుంటే, అదే హర్యానా రాష్ట్రంలో రూ.14,434 ఉంది. ఈ మూడు వ్యవసాయ చట్టాలనూ రద్దు చేయాలని మొత్తం రైతాంగం కోరుతోంది.
 

వ్యవసాయ సంస్కరణలు
ప్రతిపక్ష పార్టీల వారు కోరిన వ్యవసాయ సంస్కరణలనే తన ప్రభుత్వం తెచ్చిందని, కాని వారిప్పుడు వ్యతిరేకిస్తున్నారని ప్రధాని ప్రతిపక్ష పార్టీల వారిపై ఆరోపణలు చేస్తున్నారు. అవును, చాలా పార్టీలు వ్యవసాయ సంస్కరణలను కోరాయి, కానీ ఎలాంటి సంస్కరణలు? భారతదేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే, దేశంలో ఆహార భద్రతకు హామీ ఇచ్చే, దేశ ప్రజలకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించే, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే సంస్కరణలు కావాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేసింది. కానీ అందుకు భిన్నంగా, ప్రస్తుత వ్యవసాయ చట్టాలు భారతదేశ వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే విధంగా, దేశీయ, విదేశీ కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడే విధంగా, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నాయి. అందుకే సిపిఐ(ఎం) పార్లమెంట్‌ లోపల, వెలుపల కూడా ఈ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నది.
 

కనీస మద్దతు ధర
'మద్దతు ధర ప్రస్తుతం ఉంది, గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని' ప్రధానమంత్రి అన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను మొట్టమొదట అమలు చేసేది తన ప్రభుత్వమేనని ఆయన అన్నాడు. స్వామినాథన్‌ కమిషన్‌ సీ2కు తోడు మరో 50 శాతం మద్దతు ధరను సిఫార్సు చేసింది. ఈ ప్రభుత్వం ఇస్తున్నది ఏ2కు అదనంగా 50 శాతం. ఈ రెండింటి మధ్య ఉండేదే ప్రధానమైన తేడా. ఏ2లో వాస్తవ ఖర్చు మాత్రమే ఉంటుంది. సీ2లో వాస్తవ ఖర్చుతోపాటు భూమి కౌలు విలువ, స్థిరపెట్టుబడి విలువలపై వడ్డీ అదనంగా ఉంటుంది. అందు వలన కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన ఇతర సూచనలతో పాటు కనీస మద్దతు ధరపై చేసిన సిఫార్సులను తుంగలో తొక్కింది. 2019 సాధారణ ఎన్నికల్లో సిపిఐ(ఎం) ఎన్నికల మ్యానిఫెస్టోలో 'వ్యవసాయ సంస్కరణలపై', రైతులందరికీ తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు అమ్ముకునేందుకు చట్టబద్ధమైన హక్కును ఇవ్వాలని మొదటి డిమాండ్‌గా పెట్టింది. 2017 నుంచి సిపిఐ(ఎం) పార్లమెంట్‌ సభ్యులు ఈ డిమాండ్‌ను లేవనెత్తుతున్నారు, కానీ నేటికీ కేంద్ర ప్రభుత్వం అటువంటి చట్టాన్ని తీసుకొనిరాలేదు. తరువాత, కనీస మద్దతు ధర అన్ని వ్యవసాయ పంటలకు రైతులందరికీ వర్తింపజేయాలి. కానీ ప్రస్తుతం కనీస మద్దతు ధర కేవలం ఆరు పంటలకే వర్తిస్తుంది. సమర్థవంతమైన సేకరణ యంత్రాంగం లేకుండా కనీస మద్దతు ధర అనేది అర్థం లేని విషయం. కాబట్టి, ప్రభుత్వ, ప్రయివేట్‌ సేకరణ వ్యవస్థను దేశ వ్యాప్తంగా విస్తృతం చేయాలి.
 

తప్పుడు వాదనలు
తన అలవాటు ప్రకారం, ప్రధానమంత్రి కొన్ని తప్పుడు వాదనలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 'భారత్‌ పెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యానికే తల్లి' అని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నట్టు ప్రధాని అన్నారు. కాని, భారతదేశం యొక్క ఆధునిక లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థ గురించి నేతాజీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అదేవిధంగా 1966లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో హరిత విప్లవం తెస్తే లాల్‌బహదూర్‌ శాస్త్రి తీసుకొని వచ్చినట్టు మోడీ అన్నారు. అటువంటి అవాస్తవ ప్రకటనలతో మోడీ తప్పించుకోలేరు.


వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే వారు, భారతదేశ వ్యవసాయ రంగం, మన రైతుల (అన్నదాతల) శ్రేయస్సును సమర్థిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ప్రచారం చేస్తూ, సమర్థిస్తున్న వారంతా...కార్పొరేట్‌ కంపెనీల లాభాలు గరిష్టంగా పెంచేందుకు...భారతదేశ వ్యవసాయ రంగాన్ని, మన ఉత్పత్తులను, మన మార్కెట్లను లూటీ చేయడానికి మార్గాలను సులభతరం చేస్తున్నారు. ఈ కార్పొరేట్లు ఎవరనే విషయాన్ని కూడా మన అన్నదాతలు నిస్సందేహంగా గుర్తించారు. కాబట్టి, ఈ చారిత్రక నిరసనలు భారతదేశ వ్యవసాయ రంగాన్ని, భారత ప్రజానీకాన్ని, భారతదేశ ఆహార భద్రతలను కాపాడేందుకే అన్న విషయం స్పష్టమవుతుంది.


ఈ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. ఆ తరువాత ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలను మన రైతులతో, వారి కార్పొరేట్‌ కంపెనీలతో, ఇతర భాగస్వాములతో చర్చించాలి. ఏవైనా తాజా ప్రతిపాదనలు ఉంటే, పరిశీలన, ఆలోచనల కోసం పార్లమెంట్‌ ముందుకు తీసుకుపోయి అప్పుడు చట్టాలను చేయాలి. ఇది చాలా సహేతుకమైన ప్రతిపాదన. ప్రధానమంత్రి తన మొండి పట్టుదలను వదిలి ఈ చట్టాలను రద్దు చేయాలి.
                                                                                * సీతారాం ఏచూరి