Jan 03,2021 11:22

society 

మనందరికీ నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లాలంటే రైతన్న పంట పండిస్తేనే.. ఆ రైతు బాగుంటేనే దేశం బాగుండేది.. మనం బాగుండేది. ఆ విషయాన్ని రావినూతల సహకారం సంఘం గుర్తించింది. అందుకనుగుణంగా ఆ గ్రామంలో రైతు సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టింది ఆ సొసైటీ. దీనివల్ల గ్రామ ప్రజలూ లబ్ది పొందుతున్నారు. అంతేకాదు పక్క గ్రామాల రైతులు, ప్రజలు ఈ సొసైటీ నుండే తమకు అవసరమైన ఎరువులు, రుణాలు, నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. ఆ సొసైటీ ఇప్పుడు రాష్ట్రంలోనే ఉత్తమైనదిగా నిలిచింది.
        ప్రకాశం జిల్లా, కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో రైతులే ఎక్కువ మంది ఉంటారు. వారు బాగుంటే ఊరంతా బాగుంటుందని ఆ గ్రామం భావించింది. అందుకోసం గ్రామంలో కో-ఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నిధులను పంట పెట్టుబడికే కాదు. రకరకాల దుకాణాలను నడుపుతూ ఊరిని అభివృద్ధి పథంలో నడిపి జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్నారు. పత్తికి తెల్లదోమ సోకి రైతాంగం తీవ్రంగా నష్టపోయినా.. మిర్చికి బొబ్బర తెగులు వచ్చి నష్టపోయినా.. వర్షాలు లేక శనగ, కూరగాయల, పొగాకు రైతులు నష్టాల పాలైనా.. వ్యవసాయం సంక్షోభంలో పడి, పెట్టుబడులు లేకపోయినా.. రైతుల వెన్నుతట్టి, నేనున్నానంటూ రైతులకు సకాలంలో రుణాలిస్తుంది ఆ సంస్థ. తక్కువ ధరలకే ఎరువులు, పురుగుమందులు అందిస్తూ నేడు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొసైటీ సంపాదించుకుంది. రావినూతలలోని 'సహకార వ్యవసాయ పరపతి సంఘం' వ్యవసాయంలో రైతులకు విశిష్ట సేవలు అందిస్తోంది. దీంతోపాటు రావినూతల ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకూ అవసరమైన నిత్యావసర సరుకులు, వస్త్రాలు, మొదలైన వాటిని సరసమైన ధరలకు విక్రయిస్తోంది. బ్యాంకు, సూపర్‌మార్కెట్‌, నాలుగు చౌకధరల దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎనలేని సేవలందిస్తున్న ఈ సొసైటీ ఇప్పటిది కాదు. బ్రిటీష్‌ కాలంలో స్థాపించబడింది. నేటికీ ప్రజాసేవలో ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీగా ఈ సొసైటీ గుర్తింపు పొందింది.

                                                           ఇలా ప్రారంభమైంది..

ravi nootala lakshmi narayana
Ravi nootala lakshmi narayana

       రావినూతలలో సుమారు రెండువేల ఇళ్లున్నాయి. వెయ్యి మంది వరకూ రైతులే ఉన్నారు. ఈ గ్రామంలోని ఈ సొసైటీని 1928, డిసెంబర్‌ 11వ తేదీన ప్రారంభించారు. అంతకుముందు 1927, నవంబర్‌ 18వ తేదీన రావినూతల గ్రామ కో-ఆపరేటివ్‌ సొసైటీగా రిజిష్టరు చేయించారు. వ్యవసాయం పట్ల రైతుల్లో మంచి అవగాహన కలిగించి, మంచి దిగుబడులు సాధించేందుకు, రైతులను ఐక్యపరచేందుకు గ్రామంలోని కొంతమంది విద్యావంతులు నడుం బిగించి ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. రావినూతల పక్కనే ఉన్న కుర్రవాని పాలెంను కూడా కలుపుకొని, సొసైటీ ఏర్పాటయ్యింది. మొదటి అధ్యక్షులుగా రావినూతల గ్రామ కరణం అయిన రావినూతల లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టారు. 1972 నాటికి సొసైటీలో 501 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ 3,952కు చేరింది. రైతులకు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి, అటు రైతులకీ ఇటు వ్యవసాయాభివృద్ధికీ ఎనలేని సేవలందిస్తోంది.

                                                          రకరకాల వ్యాపారాలు
   ఈ సొసైటీ ద్వారా గ్రామంలో అనేక రకాల వ్యాపారాలు నిర్వహిస్తూ రైతాంగానికి ప్రజానీకానికి సొసైటీ సేవలందిస్తోంది. ఈ సొసైటీలోనే ఎరువుల దుకాణం, పురుగుమందుల దుకాణం, ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువుల దుకాణాలు, రేషన్‌షాపు, బట్టల షాపులను నిర్వహిస్తున్నారు. బయట మార్కెట్‌లో కన్నా తక్కువ ధరలకు, నాణ్యమైన వస్తువులనే ఇక్కడ విక్రయిస్తారని నానుడి. అందువలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి, కొనుగోలు చేస్తుంటారు. కొంతకాలం ఇక్కడ ఆర్‌.టి.సి. బస్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సెంటర్‌ను కూడా నిర్వహించారు. బట్టల షాపులో వస్త్రాల కొనుగోలు మీద పది శాతం అదనంగా వేసుకుని అమ్ముతారు. అందులోనూ డిసెంబరు 15 నుంచి జనవరి 15 వరకు సంక్రాంతి సందర్భంగా ఐదు శాతం తగ్గిస్తారు. గతంలో కిరాణాషాపు కూడా విడిగా నడిపారు. కేంద్రం జిఎస్‌టి విధానం పెట్టిన తర్వాత గ్రామ ప్రజలపై అదనపు భారం పడుతుందని, దానిని తీసివేశారు. సొసైటీకి సంబంధించిన బ్యాంకు నిర్వహణా రైతులకు అనుకూలంగానే ఉంటుంది. రైతులకు వెసులుబాటుగా ఉంటుందని ప్రతిరోజూ ఉదయం 8-9 గంటల మధ్య తెరుస్తారు. సాయంత్రం 4 నుంచి 8 వరకు తెరిచి ఉంచుతారు.

                                                                అవార్డులు
   రావినూతల సొసైటీ రైతాంగానికి, ప్రజలకు అందిస్తున్న సేవలకు గతంలో ఎన్నో ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. 2014లో రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీగా నాబార్డ్‌ నుండి అవార్డు అందుకుంది. ఇటీవల కాలంలో 2019-20 సంవత్సరానికి ప్రకాశం జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా ఆప్కాబ్‌ సంస్థ నుండి అవార్డు పొందింది.

                                                          ప్రముఖుల సందర్శన

silaphalakam


  రావినూతల సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించటానికి 1983లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టింది ఇక్కడే. పేదప్రజల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఆయన కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆ పథకాన్ని ఆయన తిరుపతిలో అధికారికంగా ప్రారంభించినా అంతకుముందే రావినూతన సొసైటీ రేషన్‌షాపులో పేదలకు రెండు రూపాయల బియ్యాన్ని అనధికారికంగా అందజేశారు. ఆ సందర్భంగా 'ఈ బియ్యమే పేద ప్రజల కడుపు నింపేది!' అన్న ఆయన మాటలు ఇక్కడి ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలచిపోయాయి. తరువాత 2001లో అప్పటి రాష్ట్రమంత్రి జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి, ఎం.పి. దగ్గుబాటి రామానాయుడు, కేంద్రమంత్రులుగా పనిచేసిన దగ్గుబాటి పురంధరేశ్వరి, పనబాక లక్ష్మి ఈ సొసైటీని సందర్శించి, సొసైటీ సేవలను కొనియాడారు.

ramanaidu

 

group

   

గ్రామంలో ఒక్క సొసైటీ ఉంటే ఎంత బాగా పనిచేస్తుందో రావినూతల పురపాలక సంఘం నిరూపించింది. గ్రామంలో రైతులకే కాకుండా, ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలూ పొందుతూ విరాజిల్లుతోంది. ఒక గ్రామమే ఇంత అభివృద్ధి చేస్తుంటే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం ఎంత అభివృద్ధి చేయొచ్చు. ఈ అభివృద్ధి జరగడానికి కారణం ఆ గ్రామంలోని అందరి మధ్య ఐక్యత, ఆ సొసైటీ నిర్వహిస్తున్నవారి చిత్తశుద్ధి ప్రధాన కారణం. ఇదే ఎక్కడైనా ఎవరికైనా వర్తించేది. అప్పుడే అభివృద్ధి సుసాధ్యమయ్యేది. ఇప్పటికైనా రైతు అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పనిచేసేందుకు రావినూతల గ్రామాన్ని చూసి నేర్చుకోవాలి. రైతుల కోసం, ప్రజల కోసం పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న యావత్తు సొసైటీకి జేజేలు పలకాల్సిందే !


- పాలపర్తి ఏలియా
ప్రజాశక్తి విలేకరి, పంగులూరు

 

                                                       రైతాంగానికి భారీగా రుణాలు

ceo manne navani
                                                            మన్నె నవని, సిఇఓ


        గ్రామంలో వ్యవసాయ అభివృద్ధికి రైతాంగానికి కోట్లాది రూపాయల రుణాలు ఇస్తున్నాము. ఈ ఏడాది స్వయంశక్తి ద్వారా స్వల్పవ్యవధి వ్యక్తిగత రుణాలు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాము. ఎస్‌.హెచ్‌. గ్రూప్స్‌కు 80 లక్షలు, గోల్డ్‌ లోన్స్‌ 40 లక్షలు, డిపాజిట్‌లపై రుణాలు 55 లక్షలు, స్వల్పకాలిక రుణాలు 12 కోట్లు ఇచ్చాము. ఇఒడి లోన్లు, ఎం.టి.లోన్లు, ఎల్‌.టి.లోన్లు 10 లక్షలు ఇచ్చాము. సేవింగ్‌ డిపాజిట్‌లు 70 లక్షల రూపాయలు, ధనలక్ష్మి డిపాజిట్‌లు 13 కోట్లు, ఫిక్సిడ్‌ డిపాజిట్‌లు 80 లక్షలు, డ్వాక్రా గ్రూపు సేవింగ్స్‌ 17 లక్షలు, రికరింగ్‌ డిపాజిట్‌లు 70 లక్షలు సేకరించాం.
      ప్రస్తుతం సొసైటీలో మెంబర్ల డిపాజిట్‌లు రూ. 17,33,44,468. రుణాలు 17,88,92,707. షేర్‌ ధనం 1,26,57,227, ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ 12,50,04,254, బారోపింగ్‌ లోన్స్‌ 13,89,91,203. బ్యాంకులో ఉంచిన షేరు ధనం 1,51,82,500, వస్త్ర వ్యాపారం 50 లక్షలు, ఎరువులు 2.15 కోట్లు, పురుగుమందులు, రేషన్‌షాపులకు 15 లక్షలు, రికవరీ 98.5 శాతంగా ఉంది. ఈ సొసైటీ పరిధిలోని రైతాంగానికి రుణమాఫీ రూ. ఆరు కోట్లు వచ్చింది.

                                                                                      -  మన్నె నవని, సిఇఓ

                                           

                                                          రైతుల సహకారం వల్లే సొసైటీ అభివృద్ధి

kaarusala singaiah chowdary
                                           కారుసాల శింగయ్య చౌదరి,         సొసైటీ మాజీ అధ్యక్షులు

   ఇక్కడి రైతుల సహకారం వల్లనే సొసైటీ అభివృద్ధి చెందింది. నేను ఈ సొసైటీకి 1961 నుండి 30 ఏళ్ల పాటు అధ్యక్షులుగా పనిచేశాను. అప్పట్లో అధ్యక్షుడిగా కాక క్లర్క్‌గా పనిచేశాను. అనేకమంది సలహాలు, సూచనలతో నడిపాను. ఇప్పటికే అదే పంథాలో అభివృద్ధి చెందుతుంది. అనేక సొసైటీలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

                                                                      -  కారుసాల శింగయ్య చౌదరి, సొసైటీ మాజీ అధ్యక్షులు

 

                                                             రాజకీయాలకు అతీతంగా సేవలు

society adyakshuralu
      చేబ్రోలు శ్రీదేవి హనుమంతరావు,                             సొసైటీ అధ్యక్షురాలు


   రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రైతులకు సేవలందిస్తూ సొసైటీని అభివృద్ధి చేస్తున్నాము. 92 సంవత్సరాలుగా సొసైటీ చేస్తున్న సేవలను కొనసాగిస్తున్నాము. జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్‌ మాదాసు వెంకయ్య, మాజీ ఎం.ఎల్‌.ఎ. బాచిన చెంచు గరటయ్య, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కృష్ణచైతన్య సహకారం బాగుంది. జిల్లా సహకార బ్యాంక్‌ నుండి ఒకసారి రూ. 30 లక్షలు, ఒకసారి 2.50 కోట్లు నిధులు తీసుకొచ్చాము. ప్రస్తుతం ఉన్న వ్యాపారాలతో పాటుగా సొసైటీ ద్వారా పెట్రోలు బంక్‌, షాపింగ్‌ మాల్‌, పాల బిల్లింగ్‌ సెంటర్‌ను నిర్వహించేందుకు కృషి చేస్తాం.

                                                                 -   చేబ్రోలు శ్రీదేవి హనుమంతరావు, సొసైటీ అధ్యక్షురాలు

 

                                                                రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచింది

p.murali
 పి.మురళీ మోహన్‌రెడ్డి, అద్దంకి        సబ్‌డివిజన్‌ ఆఫీసర్‌


    సొసైటీ రాష్ట్రంలోనే పేరుగాంచింది. రాష్ట్రంలో ఇలాంటివి నాలుగైదు రైతాంగానికి విలువైన సేవలందిస్తోంది. ఇక్కడి రైతుల ఐక్యత చైతన్యం, ఇక్కడ విద్యావంతులు ఎక్కువగా ఉండటం కారణం. వ్యవసాయంపై రైతులకు మక్కువ. రకరకాల వాణిజ్య పంటలు ఇక్కడ సాగు చేస్తారు. రైతులకు ఈ సొసైటీ మంచి భరోసా.

                                                                  పి.మురళీ మోహన్‌రెడ్డి, అద్దంకి సబ్‌డివిజన్‌ ఆఫీసర్‌

 

                                                                        మాది బెస్ట్‌ సొసైటీ !

ramanjaneyulu
రామాంజనేయులు చేబ్రోలు, రైతు


     మా ఊర్లో సుమారు 20 ఏళ్లు కిరాణా షాపు నడిపారు. తక్కువ రేటుకే రేషన్‌ ఇచ్చేవారు. ఇంకా బట్టలషాపు, కూరగాయలు కూడా అమ్మేవారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఎరువులు, మిగతా వస్తువులు కొనుక్కోవడానికి ఇక్కడికే వస్తారు. మాది బెస్ట్‌ సొసైటీ. దీనిని ఎన్‌టి రామారావు ప్రారంభించారు. మా సొసైటీకి జయప్రకాశ్‌ నారాయణ పురస్కారం ఇచ్చారు.

                                                                                                -  రామాంజనేయులు చేబ్రోలు, రైతు

 

                                                                       అన్నీ ఫిక్స్‌డ్‌ రేట్లే !

anjamma
అంజమ్మ పూనాటి, గృహిణి


    సొసైటీలో నాణ్యమైన బట్టలు ఫిక్స్‌డ్‌ రేటుకే అమ్ముతారు. బేరం చేసేదేమీ లేదు. సంక్రాంతి సమయంలో డిస్కౌంట్‌ కూడా ఇస్తారు. ఈ మధ్యకాలంలో సొసైటీకి మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షురాలు ఎన్నికవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక గ్రామంలో సొసైటీని ఇంతలా అభివృద్ధి మార్గంలో నడిపించడం మాకందరికీ గర్వకారణంగా ఉంది.
                                                                                          - అంజమ్మ పూనాటి, గృహిణి

 

                                                                     అప్పుఇవ్వరు.. కానీ..

gunji anjaneyulu raitu
గుంజి ఆంజనేయులు, రైతు


   పొలానికి ఉపయోగించే ఎరువులు, మందులను మేం సొసైటీలోనే ఎన్నో ఏళ్లగా కొంటున్నాం. బెల్లం, పప్పులు కూడా అక్కడే తెచ్చుకుంటాం. కానీ సొసైటీలో ఏవీ అప్పుగా ఇవ్వరు. బయట కన్నా తక్కువకే అన్నీ ఇస్తారు. బట్టలు, కిరాణాషాపు, కూరగాయల కొట్టు మాకు చాలా ఉపయోగంగా ఉన్నాయి.
                                                                                     - గుంజి ఆంజనేయులు, రైతు