బోనిలో తడిసిన 300 ఎకరాల ధాన్యం
అకాల వర్షాలతో నష్టంపై రైతుల ఆవేదన
ప్రజాశక్తి అనందపురం: అల్పపీడన ప్రభావంతో మండలంలోని శుక్రవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి యంతాలతో కోత కోసి ఆరబెట్టిన దాదాపు 300 ఎకరాలకు చెందిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిపోయాయి. మండలంలోని 1796 ఎకరాలలో వరి సాగు చేయగా, దాదాపు సగం వరకు కోతలు పూర్తయ్యాయి. బోని గ్రామంలో వరి కోత యంత్రాలతో సుమారు 300 ఎకరాలలో కోసని ధాన్యాన్ని పొలాల్లోనూ, గ్రామంలోని కమ్యూనిటీ హాల్ వద్ద టార్పాలిన్లు వేసి ఆరబెట్టారు. గడచిన వారం రోజుల్లో కోసిన ధాన్యమంతా ఇలా ఆరుబయటే టార్పలిన్లపై ఆరబెట్టే ఉన్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం నుండి తడిసిన ధాన్యంలో చేరి నీటిని బయటకు తోడి ఆరబెట్టే పనుల్లో రైతులు నిమగమయ్యారు. గ్రామానికి చెందిన బోని శివశంకర్ రెండు ఎకరాలు, బోనీ అప్పలరాజు మూడెకరాలు, బోని గోవిందకు చెందిన రెండెకరాలు, కనకల దుర్గారావుకు చెందిన ఆరెకరాలు, బోని నరసింహులు, కనకల నర్సింగరావులకు చెందిన చెరో ఎకరంలో ధాన్యం ఇలా తడిసిపోయాయి. పంట చేతికి వచ్చిందన్న సంతోషం లేకుండా వర్షం తెచ్చిన ఇక్కట్లపై రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా ధాన్యం తడిసి, అవస్థలు పడుతున్న రైతులకు, కనీసం ధాన్యం నాణ్యతచెడిపోకుండా వుండేందుకు అవసరమైన సూచనలు ఇచ్చేందుకైనా అధికారులు కానరాకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అనేకమంది రైతులు పాత, చిరిగిన టార్పాలిన్లు వాడడం వల్లే నష్టం ఎక్కువగా జరిగిందని, రైతులందరికీ రాయితీపై టార్పాలిన్లు ఇవ్వాలని రైతన్నలు కోరుతున్నారు.










