కల్లాల్లోనే ధాన్యం రాశులు
పొలాల్లో తడిసిన వరిచేను కుప్పలు
ధాన్యం నాణ్యత చెడుతుందని ఆవేదన
ప్రజాశక్తి -ఆనందపురం : మాండూస్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షంతో అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. అనేకచోట్ల కోసిన వరి పచ్చిచేనును కుప్పలుగా వేయడం, తడి ఆరని ధాన్యాన్ని రాశులుగా పోగులు చేసినప్పటికీ, వర్షం కొనసాగితే ధాన్యం నాణ్యత చెడిపోతుందని, చేను కుళ్లి పాడౌతుందని ఆందోళన చెందుతున్నారు. మండలంలోని బోని, సిర్లపాలెం, పేకేరు, కుసులువాడ, ఆనందపురం, పొడుగు పాలెం తదితర గ్రామాలలో వరి పంట సాగు చేశారు. బోని గ్రామంలో 15 రోజుల క్రితమే వరి కోతలు కోసారు. అప్పటినుండి ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి సరైన సౌకర్యాలు లేక కొంతమంది రైతులు దళారులకు ధాన్యాన్ని అమ్మేశారు. మిగిలిన కొంతమంది ధాన్యాన్ని నిలువ చేసుకోగా, అకాలంగా వచ్చిపడిన వర్షాలు వారిలో గుబులు పుట్టిస్తున్నాయి.
కుసలవాడ, పేకేరు, సిర్లపాలెం పొడుగుపాలెం, ఆనందపురం గ్రామాలలోవరిచేను కోసిన రైతులు మాండూస్ తుఫాన్ హెచ్చరికలతో వరి చేనును పొలాల్లోనే గాలికుప్పలు పెట్టారు. పచ్చి చేను కుప్పలు పెట్టడం వలన కుళ్లిపోయే అవకాశం ఉంటుందని, తుఫాను తగ్గిన తర్వాత మరల ఆరబెట్టి కుప్పలుగాగానీ, నూర్పులు చేయాల్సి ఉంటుందని, మాండూస్ వల్ల ఒకే పనిని పదేపదే చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. 15రోజుల ముందే బోనీ రైతులు సిద్ధం చేసిన ధాన్యం అమ్ముడు పోక కల్లాల్లోనే కుప్పలుగా దర్శనమిస్తున్నాయి.
అధికారుల పరిశీలన
బోని గ్రామాన్ని శనివారం సివిల్ సప్లై డిఎం రాజేశ్వరి, వ్యవసాయ అధికారి సంధ్యా రత్నప్రభ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ బోని అప్పలనాయుడు, పిఎసిఎస్ సభ్యులు ఎస్ నారాయణరావు పంచముఖి సందర్శించారు. కల్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించారు ముందు కోసిన రైతులు ధాన్యం తేమశాతం తక్కువగా ఉందని, ఇటీవల కోసిన రైతులు ధాన్యం పచ్చిగా ఉన్నాయని కొన్ని రోజులు ఆరబెట్టాలని రైతులకు సూచించారు
బోనిలో గొడౌన్ ఏర్పాటు చేయాలి
బోని గ్రామంలో వరి సాగు ఎక్కువగా ఉంటుందని, ధాన్యం నిల్వకు గొడౌన్ ఏర్పాటు చేయాలని పంట భీమిలి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోనీ అప్పలనాయుడు ఆధ్వర్యంలో రైతులు సివిల్ సప్లై డిఎం రాజేశ్వరికి విన్నవించారు.










