Nov 08,2023 23:03

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలు అటకెక్కాయి. సూక్ష్మ సేద్యానికి పూర్తిగా ప్రోత్సాహం కరువైంది. మరోవైపు వైఎస్‌ఆర్‌ యంత్ర సేవ పథకం మొక్కుబడిగా సాగుతోంది. బిందు సేద్యంకి సంబంధించిన పరికరాల రాయితీలకు 2019 అనంతరం మంగళం పలికింది. ఫలితంగా బిందు, తుంపర సేద్య విధానాలు పూర్తిగా పడకేశాయి. సన్న, చిన్నకారు రైతులది సూక్ష్మ వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకుంది. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి రైతులకు గతంలో 90 శాతం రాయితీపై సూక్ష్మ వ్యవసాయ పరికరాలు అందించారు. గత ప్రభుత్వ హయాంలో అందించిన పరికరాలకు సంబంధిత కంపెనీలకు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లిస్తే గానీ కొత్తగా సూక్ష్మ వ్యవసాయ పరికరాలు ఇవ్వలేమని కంపెనీలు చేతులెత్తేశాయి.
ఊరటనివ్వని ప్రభుత్వ పథకాలు
ప్రభత్వ పథకాలు తమకు ఊరట కల్పించడటం లేదని రైతులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికోసారి పిఎం కిసాన్‌, రైతు భరోసా పేరుతో రూ.13,500 మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. లీటరు పెట్రోల్‌ రూ.111కి చేరింది. డీజిల్‌ ధర రూ.99 దాటిపోయింది. రైతులపై అదనపు భారం ట్రాక్టర్‌తో దుక్కి దున్నించడానికి పనిని బట్టి గంటకు అద్దె తీసుకుంటున్నారు. కల్టీవేటర్‌కు, డిస్క్‌లతో దున్నితే, రోటోవేటర్‌, ప్లవ్‌ వేసేందుకు ఛార్జీలు పెరిగిపోయాయి. ఒక ఎకరానికి సాగు చేసేందుకు రైతుకు కేవలం టాక్టర్‌ దున్నడానికి అదనంగా రెండు వేలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎకరం భూమి దున్ని సాగు చేసేందుకు రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. నిత్యం డీజిల్‌ ధరలు పెరగడంతో టాక్టర్ల ఛార్జీలు పెరిగాయని రైతులు వాపోతున్నారు. గడిచిన వానాకాలం, రబీతో పోలిస్తే ప్రస్తుతం పంటల సాగుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. సొంత భూమి కలిగిన రైతుకు ఎకరా వరి సాగుకు రూ.30 వేలు పెట్టుబడి ఖర్చు కాగా కౌలు రైతులకు మరో రూ.10 వేలు అదనపు ఖర్చు పెరుగుతోంది. ఆరుగాలం కష్టం చేసినా ఆదాయం రాకపోగా నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవదేన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం
జిల్లాలో ప్రతిఏటా సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019 ఖరీఫ్‌ లక్ష్యం 5.60 లక్షల ఎకరాలు కాగా ప్రస్తుతం 5.01లక్షల ఎకరాలకు చేరింది. కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే 6590 ఎకరాలు సాగుకు దూరంగా ఉన్నాయని అధికారుల గణాంకాలే చెబుతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 95.35 మి.మి కాగా 673.7మి.మి మాత్రమే కురిసింది. దీంతో 29.3 లోటు వర్షపాతం నమోదైంది. మరోవైపు గోదావరి నదిలో డ్రెడ్జింగ్‌, కాల్వల ఆధునీకరణకు నోచుకోవటం లేదు. ఫలితంగా రిజర్వాయరు సామర్ద్యం తగ్గిపోవటం తోపాటు కాల్వల ద్వారా శివారు పంటలకే నీరందించలేని పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు జిఎస్‌టి భారంగా గోరుచుట్టుపై రోకలి పోటులా మారింది. క్రిమిసంహారక మందులపై 18 శాతం యంత్ర పరికరాలపై 12 నుంచి 18 శాతం, ఎరువులపై పన్నును 5 శాతం చొప్పున వసూలు జరుగుతోంది. ఎరువులు, పురుగు మందుల లావాదేవీలు ప్రతి ఏటా రూ. 100 నుంచి. రూ.150 కోట్ల వరకూ జరుగుతుంటాయి. వ్యవసాయ ఉపకరణాలను ఏడాదికి రూ.110 కోట్ల వరకూ కొనుగోలు చేస్తుంటారు. వీటిపై కేంద్రం ఆధిక శాతం జిఎస్‌టి విధించడం వలన ఏడాదికి జిల్లాలోని రైతులకు సుమారు రూ.50 కోట్లు మేర భారం పడుతోంది.