Nov 07,2023 20:48

ఫొటో : కలెక్టరేట్‌లో అధికారులతో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

అన్నదాతకు ప్రభుత్వం అండ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆరుగాలం వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎన్నో కష్టనష్టాలను అనుభవించి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు అండగా నిలిచేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందజేసి వారిని ఆదుకుంటున్నారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 5వ విడత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పిఎం కిసాన్‌ నిధుల విడుదల చేసిన సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో పేద రైతులను ఆదుకునే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రైతు భరోసా నగదు వరుసగా 5వ ఏడాది వారి ఖాతాల్లో జమ చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. జగనన్న నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అధికారంలోకి వచ్చిన అనంతరం రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, ఇందులో ప్రధానంగా పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నగదు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడతలో 53.55 లక్షల మంది రైతున్నల ఖాతాల్లో రూ.2,205 కోట్ల నగదును అందజేసినట్లు వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 38,086మంది రైతులకు రూ.15.4 కోట్ల నగదు జమైందని వివరించారు. ఇందులో స్వంత భూమి కలిగిన రైతులకు 37,898మంది రైతులకు రూ.15.16 కోట్లు, కౌలు భూములు కలిగిన 176మంది రైతులకు రూ.23.80 లక్షలు దేవాదాయ భూమిలో చేసుకుంటున్న 12మంది రైతులకు రూ.1.60 లక్షలు వంతున నగదు విడుదల చేశారన్నారు. మండలాల వారీగా ఆత్మకూరు మండలంలో 7149 మంది రైతులకు రూ.2.9కోట్లు, అనంతసాగరం మండలానికి 6103 మందికి రూ.2.5కోట్లు, అనుమసముద్రంపేట మండలానికి 5687 మందికి 2.3కోట్లు, మర్రిపాడు మండలం 7739 మంది రైతులకు రూ.3.1కోట్లు, సంగం మండలానికి 4300 మంది రైతులకు రూ.1.8కోట్లు, చేజర్ల మండలానికి 7078 మందికి రూ.2.9 కోట్లు వంతున నిధులు మంజూరయ్యాయని వివరించారు. వ్యవసాయాన్ని పండుగ చేసి రానున్న దీపావళి పండుగ ముందుగానే అన్నదాతకు ముందస్తు పెట్టుబడి నిధిని అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నియోజకవర్గ రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.