ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో చిన్న, మధ్యతరహా రైతులు పెద్ద వ్యాపారుల దాడి నుంచి తమను తాము రక్షించుకోడానికి పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఈ పోరాటాలలో ప్రతి చోటా రైతులకు హాని కలిగిస్తున్న వారెవరో, ఆ విధానాలేమిటో బహిర్గతం అవుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు మద్దతిచ్చే నియమాలు ప్రపంచ బడా వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని ఉద్యమాల సందర్భంగా నిగ్గు తేలుతున్నాయి. సమస్యలు రెండు రకాలుగా ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) నియమాలు కాగా రెండు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టిఎ). డబ్ల్యుటిఒ వచ్చాక వ్యవసాయ అంశాలను అంతర్జాతీయ వాణిజ్యంతో అనుసంధానించింది. డబ్ల్యుటిఒ రాక మునుపు పరిస్థితి ఈ విధంగా లేదు. అమెరికా, యూరోపియన్ దేశాల స్వలాభం ఆధారంగా డబ్ల్యుటిఒ కార్యకలాపాలు రూపుదిద్దు కుంటున్నాయి. భారతదేశంలో సగటు వ్యవసాయ కమతం పరిమాణం కంటే అమెరికా, యూరప్ దేశాల్లో కమతాల పరిమాణం చాలా చాలా ఎక్కువ. సాగు, పాడి, అనుబంధ రంగాలపై ఆధిపత్యం, ప్రయోజనాల కోసం పెద్ద పెద్ద అగ్రి బిజినెస్ కంపెనీలు భూమిని ఇంకా ఇంకా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. డబ్ల్యుటిఒ వచ్చాక అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లోని చిన్న రైతులు (భారత్‌లో చిన్న రైతుల సంఖ్య చాలా ఎక్కువ), ధనిక దేశాల్లోని వ్యవసాయ రంగంతో అత్యంత అసమాన, అన్యాయమైన పోటీలోకి నెట్టబడ్డారు. మూడు అంశాలు ఈ అన్యాయాన్ని మరింతగా దిగజార్చాయి. ఒకటి, ధనిక దేశాల్లో రైతులకు ఇచ్చే సబ్సిడీలకు, తృతీయ ప్రపంచ దేశాల్లో ఇచ్చే సబ్సిడీలకు మధ్య అస్సలు పోలికే లేదు. రెండు, పెద్ద వ్యవసాయాన్ని పెంచేందుకు అమెరికాలో బడా వ్యవసాయ, వ్యాపార సంస్థలు తగినన్ని వనరులను సమీకరించే క్రమంలో తమ దేశంలోని చిన్న రైతులను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టాయి. చిన్న రైతుల జీవనోపాధి, ఆహార భద్రత, పర్యావరణంపై హానికర ప్రభావాన్ని విస్మరించాయి.
అమెరికా, యూరప్ దేశాల ఆధిపత్యం కారణంగా ఆ దేశాలు వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీల వర్గీకరణ జరుగుతోంది. ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇచ్చే రాయితీలపై మాత్రం అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. అదే జరిగితే పేద దేశాల్లో జీవనోపాధి, ఆహార భద్రత ఎలా రక్షించబడుతుంది? ధనిక దేశాల్లో భారీ యాంత్రిక శక్తి కేంద్రీకరణ వలన వ్యవసాయోత్పత్తులను పేద దేశాల్లోకి ఇబ్బడి ముబ్బడిగా చొప్పిస్తున్నాయి. ఈ చర్య అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని చిన్న రైతులను నాశనం చేస్తుంది. భారీ రాయితీల వలన ధనిక దేశాల ఉత్పత్తులకు చౌక ధరలు సాధ్యమే. చౌక వస్తువుల దిగుమతులతో పేద దేశాల్లో అన్యాయమైన పోటీకి మరింత ఎక్కువ ఆస్కారం నెలకొంది. మరోవైపు పేద దేశాల్లో ఇచ్చే సబ్సిడీలను తగ్గించడానికి డబ్ల్యుటిఒ ద్వారా నియమావళిని ప్రవేశపెట్టే ప్రమాదం వచ్చి పడింది. దీని వలన పేద దేశాల్లోని వినియోగదారులు తమ ఆహార రాయితీలను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తన నిబంధనలతో మేధోసంపత్తి హక్కులను వాణిజ్యంతో అనుసంధానిస్తోంది. మొక్కలు, పంటలతో సహా జీవాలన్నింటికీ పేటెంట్లు వర్తిస్తాయి. ఇది రైతులకు విత్తనాల లభ్యతను, విత్తనాలపై హక్కులను పరిమితం చేస్తుంది. పెద్ద కంపెనీలు విక్రయించే పేటెంట్ విత్తనాలను రైతులు విధిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అసమానతలను, అన్యాయాన్ని తెచ్చిపెట్టిందని 'మానవ వనరుల అభివృద్ధి' (హెచ్‌ఆర్‌డి) విభాగం...వాణిజ్య సంబంధిత అంశంపై ప్రచురించిన ప్రత్యేక నివేదికల్లో పేర్కొంది. ఆర్థిక బదిలీలలో ఎక్కువ తిరోగమన, తక్కువ సమర్ధవంతమైన వ్యవస్థ రూపుదిద్దుకుందని ఆ రిపోర్టు వెల్లడించింది. పారిశ్రామిక దేశాలు డబ్బును ఎక్కువ వృధా చేసి ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తున్నాయంది. ఇది అన్యాయమైన వాణిజ్యానికి గణనీయంగా దోహదపడిందని హెచ్‌ఆర్‌డి తెలిపింది.
వ్యవసాయంలో ప్రస్తుత నియమాల చట్రంలో ఉన్న సమస్య ఏంటంటే...డబ్ల్యుటిఒ అన్యాయమైన వాణిజ్య పరిస్థితులను చట్టబద్ధత పేరుతో సంస్థాగతం చేస్తోంది. సబ్సిడీలు ఎల్లప్పుడూ కాదంటోంది. అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రం ఆ నియమం వర్తించదని అంటోంది. డబ్ల్యుటిఒ విధించిన కొత్త నిబంధనలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు అస్థిరత, హానికరమైన ప్రభావాల నుంచి కోలుకోలేదు. అంతలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడం మొదలైంది. దాంతో అంతర్జాతీయ వాణిజ్యం నష్టాల ప్రభావాన్ని ఇంకా పెంచింది. ఒప్పందాల్లోని నియమాలు, దిగుమతులు, పేటెంట్ల పరంగా మరింత నష్టపరిచింది. ఒప్పందాల్లోని మినహాయింపులు ద్వైపాక్షిక, అంతర్జాతీయ చర్చా వేదికలపై ఎక్కడా కనిపించవు. ఉదాహరణకు 1990 ప్రారంభంలో అమెరికా, కెనడా, మెక్సికోలతో సంబంధం ఉన్న 'నాఫ్టా' ఒప్పందం వలన చౌకయిన మొక్కజొన్న దిగుమతులు మెక్సికోను ముంచెత్తడంతో ఆ దేశంలోని పది లక్షల మంది రైతులు మొక్కజొన్న సాగును వదిలేశారు. పెద్ద పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల అవకతవకల వలన ప్రజల ఆహార భద్రత దెబ్బతింది. ఒప్పందంలో చెప్పిన విధంగా మొక్కజొన్న రెడీమేడ్ ఉత్పత్తులు తగ్గించే బదులు పెరిగాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో ధనిక, ఆధిపత్య దేశాలు, పేద దేశాల మధ్య బలహీనమైన పోటీకి ఇంకా చాలా అవకాశాలున్నాయి. ఇవి ఆహారం, వ్యవసాయం విషయమై బడా బహుళజాతి సంస్థలపై మరింతగా ఆధారపడేలా చేస్తాయి. అమెరికా, భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఇలాంటి భయాలు వ్యక్తమయ్యాయి.
భారత ప్రభుత్వ అనేక విధానాల వెనుక అంతర్జాతీయ వాణిజ్యం, డబ్ల్యుటిఒ సంబంధిత ప్రభావం ఎలా ఉన్నదీ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం గుర్తించింది. దేశంలో పెరుగుతున్న ఆకలి, పోషకాహార లోపం, ప్రజాపంపిణీ వ్యవస్థ విస్తరణ డిమాండ్లు ముందుండగా, ఆహార సబ్సిడీని పరిమితం చేయడానికి, తగ్గించడానికి ఇటీవల మోడీ ప్రభుత్వం తెచ్చిన ఒక విధాన పత్రం ప్రభుత్వ వైఖరేంటో తెలుపుతుంది. బడుగు బలహీన ప్రజల ప్రయోజనార్ధం రైతు, వినియోగదారు, ఆహార భద్రతను కాంక్షించే సంస్థలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలి.
- భరత్ డోగ్రా / వ్యాసకర్త రచయిత, జర్నలిస్టు /










