సాగు నుంచి విక్రయం వరకూ అన్నీ కష్టాలే - రోడ్డెక్కిన ఆక్వా రైతులు
వ్యవసాయం అంటే గతంలో ఎంతో గొప్ప.. రైతంటే అదేస్థాయిలో గౌరవం దక్కేది. అయితే పాలకుల అస్తవ్యస్త విధానాలు, ప్రకృతి కన్నెర్ర కారణంగా వ్యవసాయ అంటేనే విముఖత చూపడంతోపాటు రైతుకు రోజురోజుకీ సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా జిల్లాలో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది.
సార్వా వరి పంట మాసూళ్లు ముమ్మురంగా సాగుతున్నాయి. వరి కోతలు ప్రారంభమై సుమారు నెల రోజులైంది. గత 20 రోజులుగా మాసూళ్లు పెద్దఎత్తున సాగుతున్నాయి. అయితే ఏటా మాదిరిగానే ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిం చడంలో విఫలమైంది. మాసూళ్లు 50 శాతం దాటినా ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభ దశలోనే ఉండడం గమనార్హం. ఆర్‌బికెల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల ప్రారంభంలో ఆలస్యంతో ఇప్పటికే రైతులు నానావస్థలు పడుతున్నారు. కొంతమంది రైతులు తమ పేరిట కొనుగోలు కేంద్రాలకు తోలుకోండంటూ దళారులకు ధాన్యం అమ్మేసిన ఘటనలూ ఉన్నాయి. ఎట్టకేలకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై అక్కడకు ధాన్యం తీసుకెళ్లిన రైతులకు సవాలక్ష సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తేమశాతం నిబంధన రైతులకు ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ నానావస్థలు పడి ధాన్యం ఆరబెట్టి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే అక్కడ ఆన్‌లైన్ సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఆర్‌బికెల వద్ద ధాన్యం లోడులతో రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. దాని ఫలితమే తణుకు మండలం దువ్వలో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడం. రైతులు ఆత్మహత్యాయత్నానికి సైతం సిద్ధమయ్యారంటే ఎంత విసిగివేసారి పోయారో అర్థం చేసుకోవచ్చు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఇలాకాలోనే ఈ పరిస్థితి నెలకొనడంతో మంత్రి జోక్యం చేసుకుని ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి ధాన్యం మిల్లులకు తరలించాలని ఆదేశించడంతో కొంత సమస్య పరిష్కారమైంది. అయితే మిగిలిన ప్రాంతాల రైతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. అదే సమయంలో రైతులను గోనె సంచుల సమస్య వెంటాడుతోంది. దిగుబడికి అనుగుణంగా రైతులకు అవసరమైన గోనె సంచులు ఇవ్వకుండా ఎకరాకు కేవలం 60 సారలకు సంబంధించి సంచులే ఇవ్వడంతో మిగిలిన ధాన్యాన్ని ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. హమాలీల ఛార్జీ, రవాణా ఛార్జీలు ఎప్పటికొస్తాయో అర్థం కావడం లేదని పలువురు రైతులు చెబుతున్నారు. మొత్తంగా అష్టకష్టాలు పడి ధాన్యం పండించిన రైతుకు ఆ పంట అమ్ముకునే సమయంలోనూ ప్రభుత్వ విధానాలతో తిప్పలు తప్పడం లేదని ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి రైతులకు అనుకూల విధానాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆక్వా రైతులు రొయ్యలు వంద కౌంట్‌కు కనీసంగా రూ.240 తగ్గకుండా ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల కేంద్రమైన ఉండిలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. సమస్యను పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులపై ఉంది. అయితే దానికి భిన్నంగా అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం గమనార్హం. మొత్తంగా ఆక్వా రైతు సమస్య మాత్రం అపరిష్కృతంగానే మిగిలిపోతుంది. కారణాలేవైనా ఎగుమతులు తగ్గిన మాట వాస్తవం. అయితే ఆ పేరుతో ధర తగ్గించి కొనడం మన రొయ్య వ్యాపారులకు చాలాకాలంగా ఒక అలవాటుగా మారింది. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడమే కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం రంగంలోకి దిగి కచ్ఛితంగా ప్రభుత్వం ప్రకటించిన ధర అయినా రైతుకు దక్కేలా కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంది. లేనిపక్షంలో అటు వరి రైతులు, ఇటు ఆక్వా రైతులు సాగుకు దూరమయ్యే ప్రమాదం ఉంది.










