Mar 23,2023 21:16

వేసవిలోనూ వీడని వర్షాలు
పంటలపై తీవ్ర ప్రభావం
పొగాకు, మామిడి, మొక్కజొన్న రైతులు గగ్గోలు
వడగళ్ల వానతో జీలుగుమిల్లి మండలంలో 150 ఎకరాల్లో పొగాకు బుగ్గి
వరి దిగుబడిపై ప్రభావం చూపనున్న వర్షాలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

వేసవికాలంలో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాత తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. చేతికొచ్చిన పంట కళ్లముందే దెబ్బతినడం చూసి కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇప్పటికే వ్యవసాయం భారంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ప్రకృతి వైపరీత్యాలు మరింత కుంగదీస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా జిల్లాలో అకాల వర్షాలు పడుతూనే ఉన్నాయి. గురువారం సైతం ఏలూరు జిల్లాలో నూజివీడు, లింగపాలెం, పెదవేగి, ఏలూరు, పెదపాడు, ద్వారకాతిరుమల, ముదినేపల్లి, ముసునూరు, కైకలూరు, కలిదిండి తదితర మండలాల్లో సరాసరిన 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన బుధవారం 2.1 మిల్లీమీటర్లు, మంగళవారం 6.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులు, వడగళ్ల వాన భీభత్సం సృష్టిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో పొగాకు సాగవుతోంది. పనల మీద కొంత పంట ఉండగా కోత దశలో మరికొంత ఉంది. జీలుగుమిల్లి మండలంలో వడగాళ్ల వానలకు మునగలంపల్లి గ్రామంలో దాదాపు 150 ఎకరాల్లో పంట దెబ్బతింది. వర్షాలకు పొగాకు ఆకులన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి, కౌలు నిమిత్తం రూ.20 వేలు ఖర్చు చేశారు. పంటంతా దెబ్బతినడంతో పొగాకు రైతులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పొగాకు సాగులో అత్యధికం కౌలురైతులు ఉండటంతో వారంతా లబోదిబోమంటున్నారు. మొక్కజొన్న పంట సైతం పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంది. ఈదురుగాలులకు పంట నేలకొరిగిపోవడం, పొత్తుల్లోకి వర్షపు నీరు వెళ్లడంతో పంట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. రైతులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. పంట చివరి దశకు చేరుకున్న తరుణంలో వెంటాడుతున్న వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట దెబ్బతినే పరిస్థితి నెలకొనడంతో కౌలురైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏలూరు జిల్లాలో 50 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో మామిడి సాగవుతోంది. వర్షాలకు, గాలులకు పిందె దశలో ఉన్న పంటంతా రాలిపోతుంది. వర్షాలకు పూత దెబ్బతింటున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో మామిడి రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అంతంతమాత్రంగా ఉన్న వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలతో మరిన్ని నష్టాలను మిగులుస్తోంది. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సైతం సాగు చేసే కౌలురైతులకు అందడం లేదు. దీంతో కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వరి పంట ఈనిక, పొట్ట దశలో ఉంది. ఈ తరుణంలో కురుస్తున్న వర్షాల వల్ల 50 బస్తాల దిగుబడి వచ్చే పొలం సైతం 40 బస్తాలు రావడం గగనంగా మారనుంది. ఈనిక దశలో కంకులపైన ఉండే సొంపు వర్షాలకు రాలిపోతుంది. సొంపు రాలిపోతే కంకులు పూరిస్థాయిలో పాలుపోసుకునే అవకాశం ఉండదు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతేకాకుండా దోమపోటు ఇబ్బంది ఉండనే ఉంది. రెండు జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. దాదాపు 75 శాతం సాగు కౌలురైతుల చేతుల్లోనే ఉంది. ఎకరాకు రూ.40 వేలు వరకూ పెట్టుబడి పెట్టారు. దిగుబడి తగ్గితే రైతులకు పెట్టుబడులు రావడం కూడా గగనంగా మారనుంది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
వర్షాలకు 12 ఎకరాల్లో పొగాకు దెబ్బతింది
సింహాద్రి శ్రీనివాసరావు, పాములవారిగూడెం
'మాది జీలుగుమిల్లి మండలం పాములవారిగూడెం. 12 ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాను. ఇటీవల కురిసిన వడగళ్ల వానకు పొగాకు పంటంతా దెబ్బతింది. ఎకరాకు కౌలుతో కలుపుకుని రూ.లక్షా 20 వేలు వరకూ పెట్టుబడి పెట్టాను. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆదుకుని పొగాకు రైతులకు న్యాయం చేయాలి.