May 09,2023 22:23

ఇంకా వీడని ధాన్యం కొనుగోలు సమస్యలు
కైకరంలో సంచుల కోసం రైతుల పడిగాపులు
లారీలు కావాలంటే ముందుగా సొమ్ము చెల్లించాల్సిందే
అధికారుల ప్రణాళికా లోపంతో రైతులకు కష్టాలు
25 రోజులైనా అపరిష్కృతంగానే సమస్యలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ధాన్యం కొనుగోలు సమస్యలు ఇప్పటికీ కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ అన్నదాత అక్రందనలు మిన్నంటుతూనే ఉన్నాయి. సంచుల కోసం రైతుభరోసా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతూనే ఉన్నారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించి 25 రోజులు దాటినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ధాన్యం కొనుగోలులో ప్రణాళికాలోపంతో రైతులకు ప్రభుత్వం ఎనలేని కష్టాలు సృష్టించింది. రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఏలూరు జిల్లావ్యాప్తంగా రబీలో 79 వేల ఎకరాల్లోనే రైతులు వరి సాగు చేశారు. ఏలూరు జిల్లాలో నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు మండలాల్లోనే అత్యధికంగా వరి సాగు జరిగింది. 3.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ ధాన్యం కొనుగోలు చేయడంలో కూడా అధికారులు విఫలమయ్యారు. సంచులు, లారీల కోసం ఇప్పటికీ రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ధాన్యం కొనుగోలు టార్గెట్‌ తక్కువగా నిర్ణయించి సంచులు ఇవ్వకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. సంచుల నుంచి ధాన్యం కొనుగోలు టార్గెట్ల వరకూ రైతుల నుంచి ఒత్తిడి వచ్చే వరకూ ఎటువంటి నిర్ణయాలూ తీసుకోకుండా కాలయాపన సాగించారు. దీంతో అనేక ఇబ్బందులు రైతులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 2.13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 9.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి 6.45 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రణాళికలు సరిగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది.
సంచుల కోసం పడిగాపులే..
ధాన్యం కొనుగోలు ప్రారంభించి 25 రోజులు దాటినా రైతులను ఇప్పటికీ సంచుల కొరత వేధిస్తూనే ఉంది. సంచుల కోసం కైకరం రైతుభరోసా కేంద్రంలో మంగళవారం రైతులు పడిగాపులు పడ్డారు. ఎట్టకేలకు కొంతమందికి సంచులివ్వగా, ఇంకా 50 వేలకు పైగా సంచులు అవసరం ఉందని రైతులు చెబుతున్నారు. సంచులు తీసుకెళ్లిన రైతులు ధాన్యం పట్టినా లారీలు మాత్రం రావడం లేదు. లారీ కావాలంటే ముందుగా కిరాయి నిమిత్తం రూ.18 వేలకుపైగా చెల్లించాలని చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలతో నానా ఇబ్బందులు పడ్డ రైతులు ఇక కష్టాలు భరించలేక లారీలకు ముందస్తుగా సొమ్ము చెల్లించి ధాన్యం తరలిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని రైతుభరోసా కేంద్రాల్లో టార్గెట్‌ పూర్తయిందంటూ సంచులు ఇవ్వని పరిస్థితి ఉంది. అధికారులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి సంబంధం లేని పరిస్థితి నెలకొంది. చివరి బస్తా కొనుగోలు చేసేవరకూ ఈ కష్టాలు వీడవా అంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. రబీ ధాన్యం కొనుగోలులో రైతులు పడ్డ కష్టాలు చూసి అంతా తీవ్ర ఆవేదనకు గురైనా ప్రభుత్వం నుంచి పెద్దగా చలనం లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గడిచిన ఖరీఫ్‌లోనూ ఇవే కష్టాలు పునరావృతమైనప్పటికీ రబీలో సమస్యలు లేకుండా ప్రణాళికలు రూపొందించడంలో తీవ్రలోపం కన్పించింది. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ తీరు మారకపోతే రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడనుంది.