కౌలురైతులకు దక్కని భరోసా
ధాన్యం కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు
అటకెక్కిన డెల్టా ఆధునికీకరణ
ధర లేక, మేత ధర పెరుగుదలతో ఆక్వా రైతులు గగ్గోలు
ధర హెచ్చుతగ్గులతో ఆయిల్‌పామ్ రైతులు కుదేలు
పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు సన్నాహాలపై ఆందోళన
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పడం మినహా అన్నదాత ఆక్రందనలు పట్టించుకునే పాలకులే లేకుండా పోయారు. ప్రభుత్వాలు మారినా రైతన్నలను కష్టాలు మాత్రం వీడటం లేదు. రైతుభరోసా నుంచి బీమా, పంట నష్టపరిహారం ఏఒక్కటీ వాస్తవ సాగుదారుడైన కౌలురైతుకు అందడం లేదు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్నదాతకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు.. ఇస్తున్న మద్దతు ధరకు పొంతన లేకుండాపోయింది. రోజురోజుకీ కష్టాలు పెరగడంతో సాగుదారులు వ్యవసాయం నుంచి తప్పుకునే గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి.
అందరికీ అన్నం పెట్టే అన్నదాత కంట్లో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. రెండు జిల్లాల్లో దాదాపు 39 లక్షల జనాభా ఉంది. 80 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నారు. రెండు జిల్లాల్లోనూ ఖరీఫ్‌లో 5.50 లక్షలు, రబీలో 4.60 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, మరో లక్షా 20 వేల ఎకరాల్లో పామాయిల్, దాదాపు 40 వేల ఎకరాల్లో పొగాకు, 50 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో మామిడి, ప్రత్తి, కొబ్బరి, మిరప వంటి అనేక పంటలు పండుతున్నాయి. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. గడిచిన ఏడాదిలో జిల్లా రైతాంగం పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఏడాది ఆరంభం జనవరిలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలవరం, భీమడోలు, నిడమర్రు వంటి అనేక మండలాల్లో యూరియా దొరక్క రైతులు క్యూలో నిలబడాల్సిన దుస్థితి రావడంతో ఆందోళనకు దిగడం సైతం జరిగింది. రెండు జిల్లాల్లోనూ మూడు లక్షల మంది వరకూ కౌలురైతులు ఉండగా, అధికారులు నిర్థేశించుకున్న కౌలుకార్డుల లక్ష్యం లక్షా 36 వేలు మాత్రమే. బ్యాంకు రుణాలు సైతం కౌలురైతులకు అంతంతమాత్రంగానే అందిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం అందించే బీమా, దెబ్బతిన్న పంటల పరిహారం సైతం రైతులకు అందలేదు. 2021 ఖరీఫ్‌లో దెబ్బతిన్న 35,152 ఎకరాలకు సంబంధించిన పంట నష్టపరిహారం రూ.20.53 కోట్లు 2022లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ పరిహారంలో ఒక్కశాతం కూడా కౌలురైతులకు అందలేదు.
వరి రైతుల ఇబ్బందులు తారాస్థాయికి చేరాయి. ఇ-క్రాప్ ఆధారంగా ధాన్యం కొనుగోలు విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది. కౌలుకార్డులు ఇవ్వకపోడంతో ఇ-క్రాప్‌లో భూయజమానుల పేర్లే నమోదు చేశారు. దీంతో ధాన్యం సొమ్ము భూయజమానుల ఖాతాలోనే పడుతోంది. దీంతో కౌలురైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది రబీ ధాన్యం విక్రయాలను రైతులు మే నెలాఖరుకు పూర్తి చేశారు. 21 రోజుల్లో జమ చేయాల్సిన ధాన్యం సొమ్ము నవంబర్ వరకూ కూడా పూర్తిస్థాయిలో జమచేయని పరిస్థితి నెలకొంది. రెండు జిల్లాల్లోనూ రబీలో రూ.1752 కోట్లు విలువ చేసే ధాన్యం విక్రయిస్తే జూన్ నెలాఖరుకు జమైన సొమ్ము రూ.412 కోట్లు మాత్రమే. మూడు లక్షలు దాటిన ధాన్యం సొమ్మును నిలుపుదల చేసి రైతులను ముప్పుతిప్పలు పెట్టింది. ఖరీఫ్‌లో తెచ్చిన నూతన ధాన్యం కొనుగోలు విధానం అత్యంత దారుణంగా మారింది. సంచులు లేక, సర్వర్లు పని చేయక, లారీలు లేక, తేమశాతం పేరుతో మిల్లర్ల కోత, తూకం తగ్గిందని రైతుల నుంచి మిల్లర్ల డబ్బు వసూలుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిసెంబర్ పూర్తవుతున్నా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఇప్పటికీ పూర్తికాని పరిస్థితి ఉంది. గడిచిన రబీలో ఎండు తెగులుతో ఉంగుటూరు నియోజవర్గంలో వరిపంట దెబ్బతింది. ఎకరాకు 25 బస్తాల దిగుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందలేదు. జులైలో కురిసిన వర్షాలకు ఎర్రకాలువ పొంగడంతో తాడేపల్లిగూడెం మండలంలోని పొలాలు నీటమునిగి రైతులు నష్టపోయారు.
హెచ్చుతగ్గులతో పామాయిల్ రైతులు కుదేలు
ఏలూరు జిల్లాలోని దాదాపు 22 మండలాల్లో లక్షా 20 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. గడిచిన ఏడాది డిసెంబర్‌లో టన్ను పామాయిల్ ధర రూ.23 వేలు పలికింది. దీంతో కౌలురైతులు పామాయిల్ సాగువైపు మొగ్గుచూపారు. ఎకరాకు గతంలో కౌలు రూ.50 వేలు ఉండగా ధర బాగుండటంతో రూ.లక్ష నుంచి రూ.లక్షా 20 వేలు వరకూ కౌలు పెరిగింది. పంట చేతికొచ్చేసరికి మార్చి, ఏప్రిల్‌లో టన్ను ధర రూ.13 వేలకు పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పామాయిల్ సాగు విస్తరణలో మొక్కల అందజేతలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో మొక్కకు రూ.600కుపైగా చెల్లించి బ్లాకులో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.
మొక్కజొన్న రైతులు గగ్గోలు
జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. 50 వేల ఎకరాల్లో కమర్షియల్, మరో 50 వేల ఎకరాల్లో సీడ్స్ సాగవుతోంది. గత ఏప్రిల్‌లో మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారుల ఇష్టారాజ్యంగా మారింది. అప్పటి వరకూ క్వింటా ధర రూ.2300 ఉండగా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రూ.2100కు పడిపోయింది. సీడ్స్ సాగుకు సంబంధించి కంపెనీలు రైతులకు అగ్రిమెంట్లు రాయపోవడంతో దిగుబడులు రాకపోయినా రైతులకు నష్టపరిహారం అందలేదు. దీంతో రైతులు మొక్కజొన్న సాగులో తీవ్ర నష్టాలను చవిచూశారు. పొగాకు, చెరకుకు సంబంధించి సరైన ధర లభించకపోవడంతో రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు.
అటకెక్కిన ఆధునికీకరణ
జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పూర్తిగా అటకెక్కింది. ఈ ఏడాది సైతం రెండు జిల్లాల్లోనూ ఆధునికీకరణ పనులు సాగలేదు. ఈ ఏడాది 40 పనులకు సంబంధించి రూ.150 కోట్లు విలువ చేసే ఆధునికీకరణ పనులకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. గడిచిన రబీలోనూ ఆధునికీకరణ పనులు లేక సాగు నీరు కోసం రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కాళ్ల, పాలకోడేరు, ఆచంట, నిడమర్రు వంటి అనేక మండలాల్లో రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఆధునికీకరణ పనులు పూర్తిగా అటకెక్కాయి.
పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల గుబులు
జిల్లాలోని మెట్ట ప్రాంతంలో దాదాపు లక్ష వరకూ వ్యవసాయ మోటార్లు ఉన్నాయి. పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బెదిరించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని మీటర్ల బిగింపునకు ఏర్పాట్లు చేస్తోంది. వేసవిలో విద్యుత్ కోతలతో మెట్ట రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొక్కజొన్న, పొగాకు, వేరుశెనగ, చెరకు, మిర్చి రైతులు సాగునీరుకోసం నలిగిపోయారు. దీంతో జీలుగుమిల్లి, లింగపాలెం, కొయ్యలగూడెం వంటి అనేక మండలాల్లో రైతులు సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలకు దిగారు.
ఆక్వా రైతు విలవిల
రెండు జిల్లాల్లోనూ దాదాపు రెండు లక్షల ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. దీనిలో 90 వేల ఎకరాల్లో చేపల సాగు, మిగిలింది రొయ్యల సాగు ఉంది. ఈ ఏడాదిలో ఆక్వా మేత ధరలు విపరీతంగా పెరిగాయి. రొయ్య ధర మాత్రం భారీగా పడిపోయింది. వంద కౌంట్ ధర రూ.130కు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. దీంతో సరైన ధర ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఆక్వారైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో వందకౌంట్ ధర రూ.240గా నిర్ణయించి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా ఆక్వా కంపెనీలు అమలు చేయలేదు. ప్రభుత్వం సైతం పట్టించుకోలేదు. ప్రస్తుతం వందకౌంట్ ధర రూ.210గా ఉంది. గడిచిన వేసవిలో విద్యుత్ కోతలతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీజిల్ ఖర్చు తడిసిమోపెడైంది. ధరలు భారీగా పెరిగిపోవడం, పంటకు సరైన ధర లేకపోవడంతో ఆక్వా రైతులు ఈఏడాది తీవ్ర నష్టాలను చవిచూశారు.










