Sep 15,2022 23:24

సిఐ లక్షణమూర్తి, కోరాడ మధ్య వాగ్వివాదం

ప్రజాశక్తి -తగరపువలస : స్థానిక జంక్షన్‌లోని పెట్రోల్‌బంక్‌ వద్ద టిడిపి ఆధ్వర్యాన అన్న క్యాంటీన్‌ పేరుతో గురువారం మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఏర్పాటుచేశారు. అనుమతి లేకుండా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా అన్న క్యాంటీన్‌ పేరుతో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజనం వెంటనే నిలిపి వేయాలని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబుకు సిఐ కె.లక్ష్మణమూర్తి, ఎస్‌ఐ గంటా మహేష్‌ స్పష్టం చేశారు. ప్రయివేట్‌ స్థలంలో, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, పేదలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటని రాజబాబు పోలీసులను ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయకూడదని, తమ మాటను కాదని ఇక్కడ భోజనం పెడితే కేసులు పెడతామని. శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే ఉపేక్షించేది లేదని సిఐ లక్ష్మణమూర్తి తీవ్రంగా హెచ్చరించారు. దీంతో టిడిపి నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కొంతమంది ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గి ఇలా వ్యవహరించడం భావ్యంగా లేదని, కేసులకు భయపడేది లేదని కోరాడ రాజబాబు, టిడిపి రూరల్‌ మండల అధ్యక్షులు డిఎఎన్‌.రాజు ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఇక్కడ నుంచి మెయిన్‌ రోడ్డు పక్కనున్న షిరిడీ సాయిబాబా మందిరం వద్దకు మార్చుకోవాలని పోలీసులు సూచించారు. చివరకు షిరిడీ సాయిబాబా మందిరం వద్ద అన్న క్యాంటీన్‌ పేరుతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.శ్రీభరత్‌, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు సరగడ అప్పారావు, కె.దామోదరరావు, నాయకులు పిట్ట సురేష్‌, టి.సూరిబాబు, బడిగింటి నీలకంఠం, గంటా నూకరాజు, పాసి నరసింగరావు, వి.సత్య, గిడుతూరి శ్రీనివాసరావు, జి.పోలిరాజు, కె.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.