Oct 31,2023 22:05

సిపిఎం ప్రజా రక్షణభేరి

          అనంతపురం ప్రతినిధి : దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లా అభివృద్ధి పట్ల పాలకుల అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఈ ప్రాంతాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో ఇప్పటికీ కరువు, వలసలు, రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు అధికార, ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున హామీలివ్వడం, అధికారంలోకి వస్తూనే వాటి అమలు గురించి చర్యలు చేపట్టకపోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
పడకేసిన ప్రాజెక్టులు
        వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల్లో పురోగతి పూర్తిగా పడకేసింది. హంద్రీనీవా ప్రాజెక్టును 3800 క్యూసెక్కుల నుంచి ఆరు వేల క్యూసెక్కల ప్రవాహ సామర్థ్యానికి పెంచుతామని వైసిపి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రకటించారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత జరిపిన తొలి పర్యటన 2019 అక్టోబరు 10వ తేదీన హమీనిచ్చారు. ఈ మేరకు ఆర వేల కోట్ల రూపాయలతో టెండర్లు సైతం పిలిచారు. ఇప్పటికీ పనులు మొదలవ్వలేదు. ఇక అంతకుమునుపే పురోగతిలోనున్న భైరవానితిప్ప ఎత్తిపోతల పథకాన్ని 60 రోజుల్లో పూర్తి చేస్తామని 2021 జులై 8వ తేదీన హామీనిచ్చారు. ఇందుకు సంబంధించి ఇప్పటికీ భూసేకరణయే పూర్తవలేదు. పేరూరు ఎత్తిపోతల పథకం పనుల పరిస్థితి అదే రకంగా ఉంది. ఇక తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులు 2008లో ప్రారంభమయ్యాయి. రూ.400 కోట్లతో చేపట్టిన పనుల్లో రూ.300 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. తక్కిన పనులు పూర్తవలేదు. అర్థాంతరంగా పనులు ఆగిపోవడంతో గట్లు బలహీనపడ్డాయి. ఎప్పుడు ఎక్కడ గండపడుతుందోనని అధికారులు బిక్కుబిక్కు మంటున్నారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటిని తీసుకోలేకపోతున్నారు. ఇలా అనేక సంవత్సరాలుగా ప్రధానమైన ప్రాజెక్టుల పురోగతి సాగుతోంది. బొమ్మనహల్‌ మండలం నేమకల్లులో కుదురేముఖ్‌ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2012లో ఒప్పందం జరిగితే ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇది ఏర్పాటై ఉంటే ప్రత్యక్షంగా మూడు వేల మందికి ఉపాధి లభించి ఉండేది. ఈ పాలకులు ఈ ప్రాజెక్టు ఊసే ఎత్తకపోవడం గమనార్హం.
కేంద్ర ప్రాజెక్టుల పరిస్థితి మరింత అధ్వానం
        రాష్ట్ర విభజన సమయంల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తవ లేదు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చేస్తామని ప్రకటించారు. దీన్ని 2018లో ప్రారంభించారు. కాని ఇప్పటికీ అద్దె క్యాంపస్‌ల్లోనే తరగతులు నడుస్తున్నాయి. అరొకర నిధులు కేటాయింపులతోనే సరిపోతోంది. ఇక బెల్‌, నాసన్‌ పనులు పూర్తవలేదు. నత్తనడకన నడుస్తున్నాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మూడు సంవత్సరాలకు రూ.150 కోట్లు మంజూరు చేసి ఆ తరువాత నిలిపివేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ వస్తోంది.
నేటి నుంచి సిపిఎం ప్రజారక్షణ భేరి
       అసమానతల్లేని అభివృద్ధికై ప్రజారక్షణ భేరి యాత్రను సిపిఎం చేపట్టింది. అక్టోబరు 30వ తేదీన కర్నూలు జిల్లాలో యాత్ర ప్రారంభం అయ్యింది. కడప మీదుగా బుధవారం నాడు అనంతపురం జిల్లాకు చేరుకోనుంది. సాయంత్రం 4.30 గంటలకు తాడిపత్రి పట్టణానికి చేరుకోగా, 6.30 గంటలకు గుత్తి పట్టణానికి చేరుకుంటుంది. రాత్రి బస అనంతరం 2వ తేదీన ఉదయం పామిడి, అనంతపురం నగరాల్లో యాత్ర కొనసాగనుంది. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ, హిందూపురం మీదుగా రాత్రికి పుట్టపర్తికి చేరుకుంటుంది. రాత్రి బస అనంతరం నవంబర్‌ మూడవ తేదీన పుట్టపర్తి నుంచి బయలుదేరి నల్లమాడ మీదుగా కదిరి పట్టణానికి చేరుకోనుంది. ఆరోజు మధ్యాహ్నం యాత్ర అన్నమయ్య జిల్లాలలోకి ప్రవేశించనుంది. రాయలసీమ వ్యాప్తంగా సాగుతున్న ఈ యాత్రలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డిలతోపాటు అనంతపురం, సత్యసాయి జిల్లాలో సిపిఎం నాయకులు పాల్గొనననున్నారు.