ప్రజాశక్తి- అనంతగిరి:గిరిజన చట్టాలు, హక్కులను ఉల్లంఘిస్తూ రెవెన్యూ అధికారుల అండదండలతో తహసిల్దార్ కార్యాలయం సమీపాన వైఎస్‌ఆర్ వీధిలోని ప్రభుత్వ భూమిలో గిరిజన నేతురుడు సాయి అక్రమంగా కట్టడాలు చేపడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. మండల రెవిన్యూ అధికారుల అండ దండలతో పనులు జోరుగా సాగుతున్నాయి తహసిల్దార్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో గిరిజనేతరుడు అక్రమంగా ఆక్రమించుకొని పునాది నుండి శ్లాబ్ వేశాడు. డెక్కింగ్ పనులు గత మూడు రోజుల నుండి జరుగుతున్నప్పటికీ సంబంధిత రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పనులు మరింత వేగవంతంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు. స్థానిక గిరిజనులు ఇల్లు కట్టుకునేందుకు స్థలాలు కేటాయించాలని అధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించినా పట్టించుకునే నాధుడే లేరని వారు వాపోయారు. గిరిజన ప్రాంతంలో అనేక చట్టాలు ఉన్నా గిరిజనేతరులకు ఏ మాత్రం పట్టించుకోలేదని పలువురు గిరిజనులు, వివిధం సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అక్రమ కట్టడం తక్షణమే కూల్చి వేయాలని పలువురు కోరుతున్నారు.










