Aug 05,2022 23:16

పోస్టర్ల ద్వారా డిమాండ్‌ చేస్తున్న విదసం ప్రతినిధులు


అనంతబాబు కేసులో సిబిఐ విచారణకు
నిరభ్యంతర పిటిషన్‌ దాఖలు చేయాలి
ప్రజాశక్తి- సీతమ్మధార       
దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడైన ఎమ్మెల్యే అనంతబాబుపై సిబిఐ విచారణకు అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నిరభ్యంతర కౌంటర్‌ దాఖలు చేయాలని విదసం ఐక్యవేదిక కన్వీనర్‌ డాక్టర్‌ బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు: ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్యారోపణల కేసును సిబిఐకి అప్పగించాలని హతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు రత్నం, సత్తిబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసు జారీ చేసిన నేపధ్యంలో వెంటనే స్పందించాలని కోరారు. శుక్రవారం అంబేద్కర్‌ భవన్‌లో విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన మీడియా సమావేశంలోమాట్లాడుతూ ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రాధమిక నివేదిక నుంచే తప్పటడుగులు వేశారని ఆరోపించారు. హత్య జరిగిన మూడు రోజుల వరకు కేసు నమోదు చేయలేదన్నారు. తనపై 12 క్రిమినల్‌ కేసులు పెండింగులో ఉన్నట్లు ఎన్నికల ఆపిడివిట్‌లో స్వయంగా అనంతబాబు పేర్కొంటే, ఈ కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టులో నిందితుడు నిష్కలంకశుడని, క్షణికావేశంలో హత్య చేసినట్లు కాకినాడ ఎస్‌పి మాట్లాడడం కేసు నీరుగార్చే కుట్ర దాగి ఉందన్నారు. దీనిపై న్యాయవాదులు ముప్పాల్ల సుబ్బారావు, జాడ శ్రావణకుమార్‌ ద్వారా సుబ్రమణ్యం తండ్రి న్యాయ పోరాటం చేస్తూనే మరో వైపు విదసం ఐక్యవేదిక నేతత్వంలో నేరుగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వానిక నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సిబిఐకి అప్పగించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌ఆర్‌ వేమన, డి నిర్మల, కె.హరిబాబు, సోడదాసి సుధాకర్‌, కె.ప్రసాదరావు, కొండబాబు, శామ్యూల్‌కుమార్‌ పాల్గొన్నారు