ప్రజాశక్తి- కూనవరం
దళితుడైన తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైలు నుండి షతరులతో కూడిన బెయిల్‌పై బయటకొచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు కూనవరం మండల కేంద్రంలో ఆదివారం బహిరంగ సభ ఏర్పాటు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కూనవరం మండలానికి అనంతరం బాబు రాకను వ్యతిరేకిస్తూ శనివారం మండల కేంద్రంలో అఖిలపక్షం పార్టీలు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం నిర్వసిత ప్రాంత ప్రజలను అనంతబాబు ఏనాడూ పట్టించుకోలేదని, ముంపు మండలాలకు ఏమి న్యాయం చేశారని ఇక్కడ బహిరంగ సభ పెడుతున్నారని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు గతంలో రూ.5లక్షలు ఇచ్చిన భూములకు రూ.10.50లక్షలు ఇస్తానని జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి నిర్వసితులను మోసం చేశారని గుర్తు చేశారు. కిందటి ఏడాది వచ్చిన వరదలకు ఈ ప్రాంత ప్రజలు పూర్తిగా మునిగితే ఎటువంటి సహాయం అందించలేదన్నారు. జిఒ నెంబర్ 3ను రద్దు వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే కనీసం స్పందించలేదని, దాని పునరుద్ధరించడానికి ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తి ఏ మోహం పెట్టుకొని ఇక్కడ బహిరంగ సభ పెడుతున్నాడని ప్రశ్నించారు. అధిక సంఖ్యలో జనాన్ని పోగేసి తన బలాన్ని నిరూపించుకొని తను చెప్పిన వారికే మళ్ళీ ఎమ్మెల్యే సీటు కట్టబెట్టడానికే ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. తనే వ్యక్తిని చంపానని ఒప్పుకున్న వ్యక్తికి బహిరంగ సభకు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, అఖిలపక్ష పార్టీలు, గిరిజన సంఘాల నాయకులు యడవల్లి భాస్కర్, పొడియం అప్పారావు, పాయం వెంకయ్య, నోముల రామారావు, వెంకటరమణ, రంజిత్ కుమార్, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.










