అనంతపురం జిల్లాలో రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు 28 మండలాల్లో 789 కిలోమీటర్లు, 176 గ్రామాల ద్వారా ఎ.పి.రైతుసంఘం, ఎ.పి. వ్యవసాయ కార్మిక సంఘం, ఎ.పి. కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ''రైతు కూలీ రక్షణ పాదయాత్ర'' నిర్వహించాయి. 182 గ్రామ సభల్లో సుమారు 17,500 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ యాత్ర సందర్భంగా 76 సచివాలయాలు, 16 తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేసి, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. 263 గ్రామాల్లో కరపత్రాల పంపిణీ జరిగింది.
రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ పాదయాత్ర గుర్తించింది. వాటి ఆధరాంగా డిమాండ్లను రూపొందించి ప్రభుత్వం ముందు వుంచింది. అందులో ముఖ్యంగా పంట నష్టపోయిన రైతుకు పంట పెట్టుబడి ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాలని, ఈ ఖరీఫ్‌లో బ్యాంకులో తీసుకున్న రూ.4,500 కోట్ల అప్పులను మాఫీ చేయాలని, డ్రిప్, స్పింక్లర్లకు గత ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీ విధానాన్ని కొనసాగించాలని, వాస్తవ సాగు ఆధారంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పరిహారం వారికే చెల్లించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు సంవత్సరానికి రెండు వందల రోజులు, రోజు కూలీ రూ. 600లు ఇవ్వాలని, పట్టణాల్లో కూడ ఉపాధి పనులు కలిపించాలని, పాడిరైతులకు లీటర్‌కు రూ.4 బోనస్ హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది రైతు, కూలీలు డిసెంబర్ 18న కలెక్టర్ ఆఫీసు వద్ద మహా ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ సహాయం కోత
వైసిపి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందనే ఆశతో గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆ పార్టీకి ఓట్లు వేసారు. రెండున్నర సంవత్సరాల పాలన రైతుల ఆశలను నీరుగార్చింది. ప్రభుత్వం ఈ కాలంలో రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా ఏ పథకం పెట్టనప్పటికి గతం నుండి జిల్లా రైతులకు అందుతున్న ఇన్‌పుట్ సబ్సిడీ, డ్రిప్, స్పింక్లర్లకు ఇస్తున్న రాయితీ, పండ్ల తోటల రైతులకు పెట్టుబడి సహాయం, సబ్సిడీతో వ్యవసాయ పరికరాల పంపిణీ నిలిపివేసింది. కేంద్రం, రాష్ట్రం కలిసి నాలుగు విడతల్లో ఇస్తున్న రూ.13,500 రైతు భరోసా సర్వ రోగ నివారిణి లాగా ప్రచారం చేసుకుంటుంది. రైతులను ఆదుకోవడంలో రైతు భరోసా కేంద్రాలు అద్భుతాలు చేస్తున్నాయనే ప్రచారమే తప్ప ఆచరణలో పెద్దగా ఉపయోగపడలేదు. గ్రామాల్లో అధికార సిబ్బంది పెరిగినప్పటికి పంటల నమోదు, వ్యవసాయ సలహాలు ఇవ్వడంలో మార్పు రాలేదు. కొన్ని గ్రామాల్లో రాజకీయ జోక్యం పెద్దఎత్తున కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.
కష్టాల సుడిగుండంలో రైతులు
అతివృష్టి, అనావృష్టి వల్ల ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో అన్నిరకాల పంటలు నష్టపోయాయి. 10 లక్షల 40 వేల ఎకరాల్లో సాగైన వేరుశెనగ సెప్టెంబర్ నెలలో వర్షాలు రాకపోవడంతో ఎండిపోయింది. వరి, పత్తి, పప్పుశెనగ, మిరప, మొక్కజన్న తదితర పంటలు అక్టోబర్‌లో వచ్చిన అధిక వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయాయి. ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. గత ఏడు సంవత్సరాల క్రితం వరకు గ్రామంలో నూటికి 60 శాతం పైగా పశువుల మీద ఆధారపడి వ్యవసాయం సాగేది. ప్రస్తుతం నూటికి 90 శాతం పైగా యంత్రాల మీద రైతులు ఆధారపడుతున్నారు. దీనికి అనేక కారణాలు వున్నాయి. అనంతపురం నగర శివార్లలోని 'ఎస్కార్ట్' ట్రాక్టర్ షోరూంలో ఈ సంవత్సరం ప్రతి నెల 39 వ్యవసాయ ట్రాక్టర్లు అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు తెలిపారు.
నగదు చేతిలో వుంటేనే యంత్రాల సేద్యం సాధ్యమవుతుంది. పెరిగిన డీజల్ ధరలు, అధిక వర్షాల వల్ల యంత్రాలకు ముందస్తు బాడుగలు చెల్లించాల్సి రావడంతో పాటు బాడుగల రేట్లు భారీగా పెరిగాయి. ఉదాహరణకు వరిపంట కోయడానికి గత సంవత్సరం గంటకు రూ. 2,500 వుండగా, ఈ సంవత్సరం రూ.4,500 వరకు పెరిగాయి. ఇలాగే ఇతర పంటలకు ఉపయోగించే యంత్రాల ఖర్చులు కూడా రెండింతలు అయ్యాయి. మిరప సాగులో కొంత మెరుగైన పరిస్థితి వుండడంతో సాగు పెరిగింది. గత నాలుగు సంవత్సరాల క్రితం ఎకరాకు రూ.50-65 వేలు ఖర్చు అవుతుండగా, పెరిగిన విత్తనాలు, మందుల ధరల వల్ల ఈ సంవత్సరం ఎకరాకు రూ.90 వేల నుండి లక్షల రూపాయలు ఖర్చు అయింది. మిరప సాగు చేస్తున్న రైతుల్లో 56 శాతం మంది కౌలు రైతులు వున్నారు. ఎకరాకు కౌలు రూ. 30 నుండి రూ. 45 వేల వరకు వుండడమే కాక చాలా గ్రామాల్లో ముందస్తు కౌలు చెల్లించే పద్ధతి వుంది.
అతి తక్కువ భూగర్భ జలాలు వున్న ఈ జిల్లాలో బిందు, తుంపర సేద్యాన్ని అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వాలు ఐదు ఎకరాలు వున్న పేద రైతులకు ఎస్.సి, ఎస్.టి లకైతే వంద శాతం, బి.సి లకు 90 శాతం, ఓ.సి లకు 75 శాతం సబ్సిడీతో డ్రిప్, స్పింక్లర్లు ఇచ్చేవారు. గత ఆరు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం సగటున 42 వేల ఎకరాల్లో హర్టికల్చర్ సాగు పెరిగింది. ప్రస్తుత వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ఈ సబ్సిడీ విధానాన్ని రద్దుచేసింది. సబ్సిడీ కింద ప్రభుత్వం సహాయం చేసినపుడు ఎకరం డ్రిప్‌కు రూ.7,500 ఖర్చు కాగా, ప్రస్తుతం ఎకరానికి ఏకంగా రూ.65,000 పైగా ఖర్చవుతుంది.
అధిక వర్షాలకు తోడు నాశిరకం విత్తనాల వల్ల పత్తి, మొక్కజన్న, మిరప రైతులు నష్టపోయారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా వరి, పత్తి, మొక్కజన్న సేకరిస్తామని ప్రకటనలే తప్ప ఇప్పటి వరకు కేంద్రాలు ప్రారంభం కాలేదు. గత సంవత్సరం ప్రభుత్వ కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరగలేదు. యల్లనూరు మండలానికి చెందిన చింతకాయ మంద, సింగవరం, తిమ్మాంపల్లి గ్రామాల్లో గత సంవత్సరం కొనుగోలుచేసిన మొక్కజన్న పంట డబ్బులు రూ.7.50 లక్షలు ఇప్పటికి విడుదల కాలేదు. పప్పుశెనగ బకాయిల కోసం ఉరవకొండలో రైతులు ఆందోళన చేసారు.
కౌలురైతుల కడగండ్లు
జిల్లాలో అనధికార లెక్కల ప్రకారం 46 శాతం సాగుభూమిని కౌలుదార్లు సాగుచేస్తున్నారు. ఈ కౌలుదార్లలో ఎక్కువమంది ఎకరం, రెండు ఎకరాలు స్వంత భూమి వున్నవారు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు. కొన్ని ప్రాంతాల్లో భూ యజమానులే కౌలుదార్లకు పంట పెట్టుబడికి వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. నూటికి రెండు రూపాయలు కనీస వడ్డీ అమలవుతుంది. కౌలుదార్ల పేర్లు ఎక్కడా రికార్డుల్లో నమోదు కావడంలేదు. అందువల్ల పంట నష్టపరిహారం, పంటల బీమా లాంటి ప్రభుత్వ సహాయాలు వీరికి అందడంలేదు. కౌలురైతు ముప్పేట దాడికి గురౌతుంటే భూ యజమానులు కౌలు, వడ్డీ, పంట పరిహారం పొందుతున్నారు.
కూలీల వెతలు
'రైతు కంటె కూలీ బతుకు బాగుంది' అనేది సాధారణంగా రైతుల నోటెంట వెంటనే వస్తున్న మాట. ఇందుకు రైతు శ్రమతో పాటు పెట్టుబడి నష్టపోతుండడం ఒక కారణం కాగా, సీజన్‌లో కూలీ రేట్లు పెరగడం, కూలీలు పని వున్న ప్రాంతాలకు వెళ్లడం మరో కారణం. వాస్తవంగా కూలీల ఆర్థిక, సామాజిక పరిస్థితి చాలా దుర్భరంగా మారింది. యంత్రాలు రావడంతో కూలీలకు అన్ని రకాల పనులు పెద్ద ఎత్తున తగ్గాయి. సీజన్, రైతు అవసరాన్ని బట్టి కూలీ రేట్లు మారుతున్నాయి. వర్షం వచ్చిన రోజుల్లో పత్తి తీయడానికి పెద్దవడుగూరు, పామిడి మండలాల్లో రోజుకు రూ.400 ఇవ్వగా, శెట్టూరు, కుందిర్పి మండలాల్లో కలుపు తీయడానికి రోజుకు రూ.150 - 200 ఇస్తున్నారు. మహిళా కూలీలకు కలుపులు తీసే పని మాత్రమే కొద్దిమేరకు వుంది. స్వంత గ్రామాల్లో పనులు తగ్గిపోతుండడంతో పక్క గ్రామాలకు వలసలు పోతున్నారు. ఈ కూలీలను సరఫరా చేసేందుకు దళారీలు ఏర్పడ్డారు. కూలీలు ఆటోల్లో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురౌతున్న సంఘటనలు పెరుగుతున్నాయి.
స్వంత ఊరిలో పని కంటే పక్క ఊరి పనికి పోవడానికి కూలీలు ఇష్టపడుతున్న ధోరణి పెరుగుతున్నది. దీనికి సామాజిక సమస్య ఒక కారణమైతే, ఏ రోజు కూలీ ఆ రోజు వస్తుండడం మరో కారణం. చాలాకాలంగా అనంతపురం లోని వివిధ గ్రామాల నుండి కర్నాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు వలసలు పోవడం జరుగుతుంది. అయితే కర్నూలు జిల్లా నుండి పత్తి, మిరప పంటల్లో పని చేయడానికి అనంతపురానికి కూలీలు వస్తున్నారు. నివాసాలు, సౌకర్యాలు, పిల్లల చదువులు, మహిళల రక్షణ లాంటి అనేక సమస్యలను వలస కూలీలు ఎదుర్కొంటున్నారు.
ఉపాధి హామీ పథకం
గత రెండు సంవత్సరాల కరోనా సమయంలో ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలను కాపాడడంలో కీలకంగా పనిచేసింది. వ్యవసాయ కూలీలకు వరంలాగా ఉపయోగపడాల్సిన ఈ పథకం కేంద్రప్రభుత్వ విధానాల వల్ల క్రమంగా బలహీనపడుతున్నది. ఈ పథకం నిధులను వేరువేరు పథకాలకు మళ్లించడం, మెటీరియల్ కాంపొనెంట్ క్రమంగా పెరగడం, యంత్రాలతో పని చేయించడం, తప్పుడు లెక్కలు రాయడం, సగటు కూలీ చాలా తక్కువగా రావడం, అవినీతి, సకాలంలో బిల్లులు రాకపోవడం లాంటి అనేక సమస్యల వలయంలో ఈ పథకం కూరుకుపోయింది. గత సంవత్సరం చేసిన పనులకు ఇప్పటికి రూ. 53 కోట్ల రూపాయలు జిల్లాలో బకాయిలు వున్నాయి. భూమిపై యాజమాన్యపు హక్కు వుండి ఇతరుల చేత సాగు చేయించుకుంటున్న ధనిక రైతులు, మధ్యతరగతి రైతులు ఈ పథకాన్ని గురించి తప్పుడు ప్రచారం చేయడం, దీనికి పాలకులు, అధికారులు పరోక్షంగా వంత పాడుతున్న పరిస్థితి పెరిగింది. దీని ప్రభావం వివిధ సెక్షన్లపై బలంగా వుంది.
ప్రభుత్వ స్పందన
నవంబర్ 20న పాదయాత్ర ప్రారంభించగా నవంబర్ 28న జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఇన్‌చార్జి మంత్రి బత్స సత్యనారాయణ ప్రకటించారు. నష్టపోయిన రైతుల పేర్లు సేకరించి సచివాలయం దగ్గర 24 గంటల్లో ప్రదర్శిస్తామని డిసెంబర్ 2న కలెక్టర్ ప్రకటించారు. రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల అనేక గ్రామాల్లో పర్యటనలు చేసారు. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. డ్రిప్, స్పింక్లర్లు జనవరి నుండి మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఉద్యాన శాఖ ముఖ్య కార్యదర్శి అనంతపురం వచ్చి ప్రకటించారు. పాదయాత్ర మహాధర్నా రోజున (డిసెంబర్ 18వ తేదీ) జిల్లా పరిషత్ అత్యవసర సమావేశం జరిపి మనం పెట్టిన డిమాండ్లు, వేరుశెనగ పంట నష్టపరిహారంపై పెద్దఎత్తున చర్చ జరిగింది. నష్టం అంచనాల్లో వున్న వ్యత్యాసాన్ని వారంలోపు సవరించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని తీర్మానించారు.
సంక్షోభాల సుడిగుండంలో వున్న ఈ వ్యవసాయ రంగమే జిల్లా ప్రధాన ఆర్థిక వనరు. ఈ రంగాన్ని కాపాడుకోకుండా జిల్లా ప్రజలను కాపాడుతామనే ప్రకటనల వల్ల ప్రయోజనం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి రైతు, కూలీలను ఆదుకోవాలి. ఎంతటి మొండి ప్రభుత్వాన్నైనా ప్రజా ఉద్యమాలు కదిలిస్తాయన్నది ఢిల్లీ రైతు ఉద్యమం నేర్పుతున్న పాఠం. జిల్లా రైతు, కూలీల రక్షణ కోసం సాగిన ఈ పాదయాత్ర ప్రారంభం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టంగా పరిష్కార చర్యలు చేపట్టే వరకు వివిధ దశల్లో ఈ పోరాటం ప్రజా మద్దతుతో కొనసాగుతుంది.

రాంభూపాల్
/ వ్యాసకర్త : ఎ.పి. రైతు సంఘం
అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు /










