తెలుగువారు సినిమాను ఎంతో ప్రేమిస్తారు గనకే దేశం లోనే మొదటగా ఇక్కడే థియేటర్లు తెర్చుకున్నాయి. హిందీ పరిశ్రమ కూడా దీంతో విశ్వాసం తెచ్చుకుందంటున్నారు. వీటిని సంయమనంతో చర్చించుకుని సహేతుకమైన పరిష్కారానికి రావలసి వుంటుంది. పరిశ్రమపై ఆధారపడిన కళాకారులు, కార్మికుల శ్రేయస్సు, నిర్మాతలు పంపిణీదారులు ప్రదర్శనశాలల ప్రయోజనాలు, ప్రేక్షకులకు అందుబాటు అన్నిటినీ మించి మంచి సినిమాలు రావడం అందరి లక్ష్యం కావాలి. అదే సమయంలో దేశంలో సినిమా రంగం పైన, రచయితలు దర్శకుల భావప్రకటనా స్వేచ్ఛ పైన దాడుల గురించి చర్చ జరిగితే ప్రయోజనకరంగా ఉంటుంది.
కరోనా నేపథ్యంలో మీడియా మనుగడ సవాళ్లను ఎదుర్కొంటున్నట్టే థియేటర్లకూ ఓటీటీకి మధ్య సినిమా రంగం చిక్కిపోయిన తీరును గతవారం శీర్షికలో చెప్పుకున్నాం. దానికి తగినట్టే ఈ వారమంతా సినిమా రాజకీయాలతో మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోయాయి. అయితే అటు సినిమాలపరంగా గానీ ఇటు రాజకీయంగా గాని వాస్తవాల లోతుల్లోకి పోకుండా కేవలం వివాదం పెంచుకోవడానికి, స్వప్రయోజనాలు సాధించుకోవడానికి వేర్వేరు శక్తులు, వ్యక్తులు పోటీ పడటం వల్ల ఈ చర్చ దారి తప్పింది.
సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం వెబ్ పోర్టల్ రూపొందిస్తుందని ఆగష్టు 31న జీవో 782 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదలచేసింది. హోంశాఖ కార్యదర్శి విశ్వజిత్ పేరిట విడుదలైన ఈ జీవో లో పోర్టల్‌ను టీవీ చలన చిత్ర అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుందని పేర్కొంటూ ఎవరెవరు సభ్యులుగా వుంటారో వెల్లడించారు. ఈవార్త సెప్టెంబరు 9,10 తేదీలలో మీడియాలో వచ్చింది. ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా వుండగా ఈ సినిమా టికెట్ల వ్యవహారంలో తల దూర్చడమేమిటని వెంటనే విమర్శలు మొదలైనాయి. కొందరు దర్శక నిర్మాతలు కొన్ని సందేహాలు వ్యక్తంచేశారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఇది పూర్తిగా పొరబాటనీ, అప్పుల పాలైన జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల డబ్బును ఈ వెబ్‌పోర్టల్ ద్వారా ముందు తన ఖాతాలో వేసుకుని మరిన్ని అప్పులు తెచ్చుకోవడానికి పూచీకత్తుగా వాడుకుంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారికి అనుకూలమైనవిగా పేరొందిన ఛానళ్లు చర్చలు నడిపాయి. అపహాస్యం చేశాయి. ఈ పూర్వరంగంలో మంత్రి పేర్ని నాని పరిశ్రమ ప్రముఖులైన చిరంజీవి, నాగార్జున రాజమౌళి, దిల్ రాజు వంటి వారు ముఖ్యమంత్రి జగన్‌తో కొంతకాలం కిందట జరిపిన చర్చలలో చేసిన సూచన ప్రకారమే ఈ ఆన్‌లైన్ యోచన చేసినట్టు వెల్లడించారు. 2003 నుంచి ఇప్పటి వరకూ ఆన్‌లైన్ కోసం కేంద్రం రాసిన లేఖలు, రాష్ట్రంలో జరిగిన కసరత్తుల వివరాలు తేదీలతో సహా వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా గేలి చేయడంపై ఆగ్రహించారు.
పవన్ కళ్యాణ్ సభతో రసా'భాష'
లవ్‌స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొన్న చిరంజీవి పరిశ్రమ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదనీ, ప్రభుత్వాలు కరుణించాలని అభ్యర్థనగా మాట్లాడారు. ఆ తర్వాత రెండు రోజులకు - ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఆస్పత్రిలో వున్న కారణంగా తన బదులు-రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన పవన్‌కళ్యాణ్ ఇదే విషయమై ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. తనను దెబ్బ తీయడం కోసం వైసీపీ ఆన్‌లైన్ తీసుకొచ్చి మొత్తం పరిశ్రమను దెబ్బ తీస్తోందన్నారు. ప్రైవేటు రంగంలో తయారయ్యే సినిమాల టికెట్లపై ప్రభుత్వ పెత్తనం ఏంటని ఆక్షేపించారు. హీరోలు ఎంతో కష్టపడతారు గనక పారితోషికాలు భారీగా వుంటాయని సమర్థిస్తూ రాజకీయ నేతల అక్రమాస్తుల పైన మద్యం వ్యాపారం పైన ముందు దృష్టి పెట్టాలన్నారు. తనతో వకీల్ సాబ్ తీసిన దిల్ రాజును ఉద్దేశించి మీరూ మీరు ఒకే కులం గనక ప్రభుత్వానికి చెప్పండని ఎకసెక్కం చేశారు. ప్రభుత్వాన్ని సమర్థించే మోహన్‌బాబు వీటిని మాట్లాడాలన్నారు. చిరంజీవి వంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రాధేయపడవద్దని చెప్పాలన్నారు. సంబంధిత మంత్రిని సన్నాసి అంటూ తీసిపారేశారు. మీడియా పైనా, 'మా' ఎన్నికల పైన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై విశాఖలో జరిగిన కత్తి దాడి, వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు, లక్ష కోట్ల ఆరోపణలు ప్రస్తావిస్తూ సాగిన ఆయన సుదీర్ఘ ప్రసంగం తీవ్ర వివాదానికి దారితీసింది. సినిమా వేదికపై జనసేన అధినేతలా మాట్లాడటం, కులాల ప్రస్తావన, మంత్రిని సన్నాసి చేయడం వంటివి ఇందుకు కారణమైనాయి.
పరిశ్రమ చర్చలు, పవన్ రాజకీయాలు
మంత్రి పేర్ని నాని అదే స్థాయిలో స్పందిస్తూ పరిశ్రమ పెద్దల కోరిక మేరకు జరుగుతున్న కసరత్తుపై పవన్ దాడి చేయడాన్ని ఖండించారు. తను సన్నాసినైతే ఆయన సన్నాసిన్నర అంటూ కులాల ప్రస్తావనలూ కొనసాగించారు. ప్రభుత్వ విధానం వల్ల ఎ.పి లో సినిమాల ప్రదర్శనలు నష్టపోతున్నాయనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఎ.పి లో 1100 పైన వున్న థియేటర్లలో 800 పైన నడుస్తున్నాయనీ, తెలంగాణలో 600 పైచిలుకులో 400 పైన మాత్రమే చిత్రాలు ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. వసూళ్లు కూడా వకీల్‌సాబ్‌కూ, తాజాగా విడుదలైన లవ్‌స్టోరీకి ఎ.పి లోనే ఎక్కువ వాటా వచ్చిందన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా పవన్ వ్యాఖ్యలతో విడగొట్టుకుంటూ వ్యక్తిగత స్పందనలకూ తమకూ సంబంధం లేదని ఇద్దరు ముఖ్యమంత్రులు సానుకూల చర్యలు తీసుకుంటున్నారని ప్రకటన చేసింది. పవన్ రాజకీయ విమర్శలూ హిందూ ఆలయాల కూల్చివేత వంటి అంశాలతో ట్వీట్లు కొనసాగించారు. కుక్కలను వదిలినట్టు వీరిని వదిలారని ఆయన అంటే...మంత్రి వరాహం అన్నారు. ఆ దశలో నటుడు పోసాని కృష్ణమురళి మరింత వికృతమైన భాషలోనూ వ్యక్తిగత ఆరోపణలతోనూ ముందుకు రావడం, పవన్ అభిమానులు ఆయనపై దాడి చేయడంతో చర్చ ఎక్కడికో పోయింది. మరోవైపున మంగళగిరిలో జనసేన విస్త్రుత సమావేశంలో పవన్ తాను కొందరు నిర్మాతలు అడిగితే మాట్లాడానని వివరణ ఇచ్చి సరిపెట్టారు. విశాఖలో తనను ఎంఎల్‌ఎ గా గెలిపించి వుంటే ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడేవాణ్నన్నారు. ప్రధాని మోడీ శక్తివంతుడైనా తనంటే ఎంతో అభిమానం అయినా ప్రజల కోసం ఆయనతో పోట్లాట పెట్టుకున్నానని కాని తనకు మద్దతు రాలేదని ఆరోపించారు. తను ఇక రాజకీయం చేస్తాననీ, వ్యూహం మారుస్తానని ప్రకటించారు. తెలుగుదేశంతో తిరిగి దగ్గర కావడమే కొత్త వ్యూహమని పలువురు అన్నారు గాని బద్వేల్ ఉప ఎన్నిక గురించి పవన్ బిజెపి తో చర్చలు జరపడం కొసమెరుపుగా నిలిచింది. అదే సమయంలో నిర్మాతల బృందం మంత్రి పేర్ని నానిని కలిసింది. మీడియా గోష్టిలో మంత్రి ఎదురుదాడి కొనసాగిస్తూ పెద్దల కోరిక మేరకు ఆన్‌లైన్ విధానం ఆలోచించినట్టు చెప్పారు. వకీల్‌సాబ్ విషయంలో కొంత వివాదం వచ్చినా ఆన్‌లైన్ తాము కోరిన విధానమని దిల్ రాజు చెప్పారు.
సమస్య మూలాలూ, అనుభవాలు
ఆన్‌లైన్ ద్వారా టికెట్ల ధర అదుపు, అమ్మకం వివరాలు పారదర్శకంగా వుండటం, నిర్మాతకు వారి వాటా ప్రభుత్వానికి వినోద పన్ను సక్రమంగా చేరడం, బ్లాక్ నిరోధం, అవకతవకలు అరికట్టవచ్చుననేది ప్రధానాంశం. ఎ.పి ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ల ధరలు మరీ తక్కువగా వున్నాయనీ వాటిని పెంచి ఆన్‌లైన్ పెడితే మంచిదేనని నిర్మాతలు అంటున్నారు. అయితే వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు ఇచ్చేయాలి గాని తన దగ్గర పెట్టుకుని ఆలస్యంగా విడుదల చేస్తామంటే తట్టుకోవడం కష్టమని వారి వాదనగా వుంది. 'బుక్ మై షో' వంటి ప్రైవేటు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎవరి వాటా సొమ్ము వారికి పోయినట్టే ఇకముందూ వుంటుందని పూర్తి వివరాలు తర్వాత అర్ధమవుతాయని ప్రభుత్వం అంటున్నది. టికెట్ల ధర పెంపుపైనా పరిశీలనకు హామీనిస్తున్నది. తెలంగాణలో 2017 లోనే ప్రభుత్వ ఆన్‌లైన్ ప్రారంభమైనా థియేటర్లు దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి కాదు. అందరికీ వర్తింపచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2019లో ప్రతిపాదించింది. కేరళలో నిర్మాతల మండలి స్వయంగా వెబ్‌పోర్టల్ నడుపుతున్నది. తమిళనాడు ప్రభుత్వం ఒక యాప్ అందుబాటులోకి తెచ్చింది.
ఎంత పెద్ద హీరోలైనా సినిమాలు వారంలోనే వందలాది థియేటర్లలో విడుదలై వసూళ్లు రాబట్టాలి గాని గతంలో వలె యాభై రోజలు, వంద రోజులు ఆడే పరిస్థితి ఇప్పుడు లేదు. కరోనాతో థియేటర్లు నెలల తరబడి నడవలేదు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆక్యుపెన్సీ చర్చలోనే వుంది. పైరసీ బెడద అంతకుముందే వుంది. 'ఓటిటి-ఆన్ ద టాప్' పేరుతో వచ్చిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటివి సినిమాలు కొన్ని కోట్లు లాభం ఇచ్చి కొనేస్తున్నాయి. తెలుగు లోనూ 'ఆహా' వంటివి వచ్చాయి. చిన్న నిర్మాతలు, భిన్న దర్శకులు ఓటీటీని ఇష్టపడుతున్నారు. యాభై కోట్ల పైనే (ఒకరిద్దరికి వంద కోట్లు కూడా) హీరోల పారితోషికాలిచ్చి భారీ ఖర్చుతో తీసిన నిర్మాతలు థియేటర్లు ప్రధానంగా వుండాలని కోరుతున్నారు. మొదటి రెండు మూడు రోజులు ఎన్ని షోలైనా టికెట్లు ఎన్ని వందల రూపాయలైనా చూసేవారుంటే ప్రభుత్వం ఎందుకు అభ్యంతర పెట్టాలన్నది పవన్ వంటి వారి ప్రశ్న. అది ప్రేక్షకులను దోచుకోవడమేనని వైసీపీ నేతలు, మంత్రుల విమర్శ. మద్యం ఆన్‌లైన్ పెట్టేబదులు సినిమాలకు ఎందుకని సవాలు ప్రధానంగా వినిపించింది (దసరా తర్వాత మద్యం దుకాణాలు ఆన్‌లైన్ కావచ్చని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది). పవన్ కళ్యాణ్ అసందర్భ ప్రసంగం ఒకటైతే పాలకపక్షం ప్రతిస్పందనా అలాగే వుండటంతో కులాల గురించి జుగుప్సాకరంగా చర్చ జరిగింది.
మంచి సినిమాలు, సృజన స్వేచ్ఛ
తెలుగువారు సినిమాను ఎంతో ప్రేమిస్తారు గనకే దేశం లోనే మొదటగా ఇక్కడే థియేటర్లు తెర్చుకున్నాయి. హిందీ పరిశ్రమ కూడా దీంతో విశ్వాసం తెచ్చుకుందంటున్నారు. వీటిని సంయమనంతో చర్చించుకుని సహేతుకమైన పరిష్కారానికి రావలసి వుంటుంది. పరిశ్రమపై ఆధారపడిన కళాకారులు, కార్మికుల శ్రేయస్సు, నిర్మాతలు పంపిణీదారులు ప్రదర్శనశాలల ప్రయోజనాలు, ప్రేక్షకులకు అందుబాటు అన్నిటినీ మించి మంచి సినిమాలు రావడం అందరి లక్ష్యం కావాలి. అదే సమయంలో దేశంలో సినిమా రంగం పైన, రచయితలు దర్శకుల భావప్రకటనా స్వేచ్ఛ పైన దాడుల గురించి చర్చ జరిగితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే షూటింగుల దశ లోనే దాడులు థియేటర్ల విధ్వంసం, బెదిరింపులు, ఒకసారి సెన్సార్ అయినా కేంద్రం రీసెన్సార్ అధికారానికి చట్టం చేయడం వంటి సమస్యలు చాలా తీవ్రమైనవి. కనక టికెట్లు వసూళ్లతో పాటు భావాలు, సృజనాత్మకత గురించి కూడా చర్చ జరగాలి. అన్ని దాడులను అడ్డుకోవాలి.
తెలకపల్లి రవి











