ప్రజాశక్తి - రంపచోడవరం
ఆన్‌లైన్ మోసాలపై అన్ని మండలాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శరత్ చంద్ర అన్నారు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో ఏడు మండలాలకు చెందిన వెలుగు ఎపిఎంలు, డిపిఎంలు, ఎఫ్‌పిఒలు, మహిళా సంఘాల లీడర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ చంద్ర మాట్లాడుతూ ప్రతి మనిషికీ ఏదో ఒక బ్యాంకులోనైనా అకౌంట్లు తప్పకుండా ఉండాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల డబ్బులు అర్హులైన లబ్ధిదారులకు ఆయా అకౌంట్లలో జమ అవుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రవర్తన పాటించాలని, వడ్డీలకు అప్పులు తీసుకోకుండా సంపాదించిన డబ్బులో కొంత పొదుపు చేసుకుంటే భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఏజెన్సీలోని జీరో అకౌంట్ కలిగిన వారికి పిఆర్ కోడ్ లేకపోతే ఏర్పాటు చేయాలని కోరారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతితో నడుస్తున్న బ్యాంకుల ద్వారా మాత్రమే రుణాలు తీసుకోవాలని సూచించారు. పలు బ్యాంకు పథకాలపై శరత్ చంద్ర వివరించారు.
వెలుగు ఎపిడి ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత ప్రతి మనిషికీ చాలా ముఖ్యమైనదన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రవితేజ మాట్లాడుతూ ఏజెన్సీలోని వివిధ రకాల వ్యాపారాలు చేయడానికి రుణాల కోసం దరఖాస్తులు వస్తే ఆ జాబితాను తమకు సమర్పిస్తే సంబంధిత బ్యాంకు మేనేజర్లతో మాట్లాడుతామని చెప్పారు. ఏ బ్యాంకు లోనైనా అకౌంటుదారుని సివిల్ స్కోర్‌ను బట్టి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రీజనల్ బ్యాంకు నోడల్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ అకౌంటుదారునికి ఎవరైనా ఫోన్ చేసి మీకు ఓపిటి వస్తుందని, దానిని చెప్పమని అడిగితే చెప్పొద్దని, చెబితే అకౌంట్లో డబ్బులు గల్లంతవుతాయని తెలిపారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన మోసాలు ఏమైనా జరిగితే ఆయా బ్యాంకులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్న పరిశ్రమల ప్రాజెక్ట్ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు. డిపిఎంలు పరమేశ్వరరావు, అపర్ణ, యాంకర్ పర్సన్ రామరాజు, సిఎఫ్‌ఎల్‌లు చిట్టితల్లి, ప్రకాష్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజ్ కిషోర్, ఏపీఎంలు అప్పారావు, మధు, జేమ్స్, ఆదినారాయణ, శ్యాం కుమార్, వెలుగు సీసీలు, ఎఫ్‌పిఓలు, మహిళా సంఘాల లీడర్లు పాల్గొన్నారు.










