వివిధ అంశాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన
ప్రజాశక్తి -ఆరిలోవ తోటగరువు హైస్కూల్ విద్యార్థులకు ఆరిలోవ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరిలోవ సిఐ ఇమ్మాన్యుయేల్ రాజు, క్రైమ్ సిఐ విజరుకుమార్, క్రైమ్ ఎస్‌ఐ రుక్మాంధరరావు పాల్గొని, విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులకు దిశా యాప్ ప్రాముఖ్యతను వివరించారు. బాలికలు క్రీడలు, కరాటే, విలువిద్యలు నేర్చుకోవడం ద్వారా వ్యక్తిగత రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సౖౖెబర్ నేరాలపై అవగాహన కలిగి ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ ఒటిపి వంటివి పంపించకూడదని సూచించారు. ఆన్‌లైన్ రుణాలు తీసుకుని వారు పెట్టే వేధింపులను భరించలేక ఎందరో ఆత్మహత్యల వరకు వెళుతున్నారని, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలై చదువును నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. విద్యార్ధి దశలోనే మంచి ప్రణాళికతో చదువుపై దృష్టిపెట్టి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు సొంత ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.










