Aug 01,2022 23:15

సిఎం జగన్‌తో బొడ్డేటి కాశీ విశ్వనాథం

సిఎం జగన్‌ను కలిసి, అభిప్రాయం వ్యక్తం చేసిన విశ్వనాథం
మాజీ మంత్రులు దాడి, గంటా అనుచరునిగా గుర్తింపు
పట్టుకున్నదంతా బంగారంలా బొడ్డేటి రాజకీయ జీవితం
ప్రజాశక్తి- సీతమ్మధార

ఉత్తరాంధ్రలో విజయవంతమైన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నేతల్లో ఒకరైన, గవర సామాజిక వర్గానికి చెందిన విశాఖ వ్యాపారవేత్త బొడ్డేటి కాశీవిశ్వనాథం, అనకాపల్లి నుంచి అసెంబ్లీ, లేదా పార్లమెంట్‌ స్థానానికి వైసిపి తరపున పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతవరకు తెరవెనుక నుంచి మద్దతునిచ్చి ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన కాశీవిశ్వనాథం, ఇపుడు ప్రత్యక్షంగా తానే ప్రజాప్రాతినిధ్య పదవికి పోటీ చేసేందుకు ఆరాటపడుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విశ్వనాధం, తన మనసులోని మాటను ఆయనను వెల్లడించినట్లు సమాచారం. తనకు అవకాశమిస్తే, అందరి సమన్వయం, సహకారంతో గెలిచి వస్తానంటూ సిఎం జగన్‌ వద్ద ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్రలో ప్రముఖ రాజకీయవేత్త బొడ్డేటి కాశీ విశ్వనాథం మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు ఉంది. అంతకుముందు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సహచరునిగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం తరపున గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి పోటీ చేయగా, ఆయన వెనుకనే ఉండి రాజకీయ మంత్రాంగం నడిపి, గంటా విజయంలో కీలక భూమిక పోషించారు. తర్వాత గంటా ఎక్కడ పోటీ చేసినా, అక్కడ విశ్వనాథం కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఫ్యాన్‌ సుడిగాలిలోనూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా ఎమ్మేల్యేగా గెలుపొందడంలో కాశీవిశ్వనాథందే ముఖ్య భూమిక అంటే అతిశయోక్తికాదు. అప్పట్లో వైసిపిలో ఉన్న తైనాల విజయకుమార్‌టిడిపి కండువా కప్పుకోవడంలో బొడ్డేటిదే కీలక భూమిక. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడంతో తదనంతర పరిణామాల్లో వైసిపి ముఖ్యనేత రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి సమక్షంలో ఫ్యాన్‌ పార్టీలో చేరిన కాశీవిశ్వనాథం నేటికీ అదే పార్టీలో కొనసాగుతున్నారు.ఇటీవల జరిగిన గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం పరిధిలోని మూడు కార్పొరేట్‌ స్థానాల్లో వైసిపి విజయంలో తనదైన ముద్రవేసి సత్తాచూపారు.
అయితే కాశీ విశ్వనాథం అనకాపల్లి స్థానాన్నే ఎంచుకోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. గవర సామాజిక వర్గానికి అనకాపల్లిలో మంచి పట్టుఉండడంతోపాటు అదే సామాజిక వర్గానికి చెందిన విశ్వనాథం, గతంలో అక్కడ పనిచేసిన అనుభవం, అక్కడి రాజకీయనేతలు, కార్యకర్తలతో నేటికీ కొనసాగుతున్న సత్సంబంధాలతో తనకు అవకాశమిస్తే మంచి మెజార్టీతో గెలిచి వస్తానని సిఎం జగన్‌ వద్ద తన మనసులోని మాటను చెప్పినట్లు భోగట్టా. ప్రస్తుతం అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి బాధ్యతల్లో ఉన్న గుడివాడ అమర్‌నాథ్‌, వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి కంటే పెందుర్తిలోనే పోటీకి ఆసక్తి చూపిస్తుండడం వల్ల అనకాపల్లి స్థానాన్ని తనకు కేటాయించాలని బొడ్డేటి కోరినట్లు సమాచారం. అనకాపల్లి స్థానం నుంచి ఇప్పటివరకు విజయం సాధించిన మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు గవర కులానికి చెందిన వారేనని, అదే సామాజికి వర్గానికి చెందిన తనకు ఈసారి అవకాశం కల్పి ప్రజల్లో పట్టుండి, గెలుపు గుర్రాలకే ఈ సారి సీట్లు కేటాయిస్తామంటూ సిఎం జగన్‌, ఇటీవల కుండ బద్దలుగొట్టినట్లు స్పష్టం చేసిన నేపథ్యంతో బొడ్డేటి కాశీ విశ్వనాథం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.