Jul 07,2023 23:53

రాస్తారోకో చేస్తున్న సిపిఐ నాయకులు, స్థానికులు

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి-చోడవరం రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం దర్జీ నగర్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రెండు వైపులా భారీ వాహనాలు నిలిచిపోయాయి. సుమారు గంటసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. స్థానికులు స్వచ్ఛందంగా అక్కడకు చేరుకొని రాస్తారోకో పాల్గొన్నారు. స్థానికులే కలుగజేసుకొని వాహనాలు ఎటు వెళ్లకుండా, వెళుతున్న వాహనదారులతో తమ ఇబ్బందులను మొరపెట్టుకుంటూ రాస్తారోకోకు సహకరించమని కోరారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ 15 రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే రోడ్డుపైనే వంటా-వార్పు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ మార్గంలో పెద్ద పెద్ద గోతులు పడి, దుమ్మి, ధూళితో అత్యంత అధ్వానంగా ఉన్నప్పటికీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు, ప్రజా ప్రతినిధులకు పట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కెయస్‌ సన్యాసిరావు, రెడ్డిపల్లి అప్పలరాజు, దేముడు బాబు, నాగరాజు, వియ్యపు రాజు, వీరాచారి, కోరిబిల్లి శంకర్రావు, కన్నబాబు, నరాలశెట్టి సత్యనారాయణ, సత్తిబాబు, జి ఫణీంద్ర, విత్తనాల పోతురాజు, ఒమ్మి సతీష్‌, రమణ, వెంకట్రావు, స్థానిక వార్డు సభ్యులు పాల్గొన్నారు.