Dec 13,2022 00:02

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న రోడ్డు విస్తరణ నిర్వాసితులు

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో 13 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, వారందరికీ ఒకే విధంగా పరిహారం చెల్లించాలని కోరుతూ నిర్వాసితుల సంక్షేమ సంఘం ఆద్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీహెచ్‌.అప్పారావు, సిఐటియు నాయకులు బ్రహ్మాజీ, నిర్వాసితుల సంఘం నాయకులు ఆర్‌ఆర్‌ శివశరణ, గోవిందు తులసీరావు, బొడ్డెడ శ్రీనివాసరావు, కరణం శ్రీనివాసరావు, మళ్ల చినబాబు మాట్లాడుతూ 13 గ్రామాల్లో భూముల కోల్పోయిన వారికి తక్కువ రేటు ప్రకటించారని, రోడ్డు పక్క అన్ని గ్రామాల భూములకు ఒకే రేటు ఉందని, గజానికి రూ.25 వేలుకు తగ్గకుండా అందరికీ నష్టపరిహారం సమానంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ అండ్‌ బి పరిధిలో ఉన్న దుకాణాలకు తగిన నష్ట పరిహారం ఇవ్వాలని, ఇల్లులు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు, ఆర్‌ కార్డులు ఇవ్వాలని కోరారు.
తుపాన్‌ బాధిత రైతులను ఆదుకోవాలని...
అనకాపల్లి : తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ముందు ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, శారదా నది గ్రోయిన్లు మరమ్మత్తులు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వైఎన్‌ భద్రం, రాము నాయుడు, రాజాన దొరబాబు, జి గురుబాబు, వి వెంకటరమణ, చెల్లూరి నాగరాజు, మేక సత్యనారాయణ, కె.శంకర్రావు, వి.రాజు పాల్గొన్నారు.
రహదారి మరమ్మతులు చేపట్టాలని...
అచ్యుతాపురం : అచ్యుతాపురం అనకాపల్లి ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని సిపిఎం ఎలమంచిలి నియోజకవర్గ నాయకులు బృందం సోమవారం కలెక్టరేట్‌ స్పందనలో జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కర్రి అప్పారావు, ఎస్‌ బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ రహదారిలో పెద్ద పెద్ద గోతులు పడడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే అచ్యుతాపురం మండల పరిధిలో 32 మంది ప్రమాదాలకు గురై మృత్యువాత పడ్డారని తెలిపారు. పలువురు అంగవైకల్యం చెందారని, వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని పేర్కొన్నారు.