
ప్రజాశక్తి- అనకాపల్లి : అనకాపల్లి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీ డాక్టర్ బివి.సత్యవతి అన్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ఆదివారం అనకాపల్లి రైల్వే స్టేషన్ పనులను ప్రధాని మోడీ, రైల్వే మంత్రి వైష్ణవతో కలిసి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంపీతో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లేపల్లి సుభద్ర, కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, రైల్వే అధికారులు తిలకించారు. అనంతరం ఎంపీ సత్యవతి మాట్లాడుతూ తాను ఎంపీగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, బొజ్జన్న కొండ, కేంద్రీయ విశ్వ విద్యాలయానికి నిధులు తెచ్చినట్టు తెలిపారు. అమృత్ భారత్‌లో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో ఫుడ్ కోర్టులు, పార్కులు అభివద్ధి చేసి పర్యాటక హంగులతో పాటు వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్‌లో భాగంగా ఏటికొప్పాక బొమ్మల విక్రయ స్టాల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్సీ రఘువర్మ, సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ అధికారి శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, డాక్టర్ కే విష్ణు మూర్తి, రైల్వే సలహా మండలి సభ్యులు శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.