Jun 20,2021 07:06

   మూలవిరాట్టు తోనే మొదలుపెడితే బ్రాండ్‌ మోడీ 'బ్యాడ్‌ మోడీ'గా మారినట్టు చాలాసార్లు రుజువైంది. ఆయన ఆమోదయోగ్యత గతంలో ఎన్నడూ లేనంత దిగువకు పడిపోయినట్టు కూడా సర్వే సంస్థలు వెల్లడించాయి. అకాలీదళ్‌ నిష్క్రమణతో పంజాబ్‌లో ఒంటరిపాటు మిగిలింది. మిత్రపార్టీలుగా వున్న వాటిని చీల్చడంతో బిజెపిపై వాటి విశ్వాసం మరింత సన్నగిల్లే పరిస్థితి. బిజెపి పాలించే అతి పెద్ద రాష్ట్రమైన యు.పి 2022లో ఎన్నికలకు వెళ్లవలసి వుండగా యోగి ప్రభుత్వం పరిస్థితి చుక్కెదురుగా వుంది. దక్షిణాదిలో బిజెపి కి వున్న ఒకే రాష్ట్రం కర్ణాటక లో యెడ్యూరప్ప పరిస్థితీ అంతే అయింది. ఎంతో చిన్నదైన లక్షద్వీప్‌లో కూడా బిజెపి విధానం ప్రతిఘటన పాలైంది. ఎ.పి లో ఆలయాల వివాదం పనిచేయక ఇప్పుడు టిప్పు సుల్తాన్‌ను పట్టుకున్నారు.
    ఒకవైపున మలి విడత కరోనా మరణాల తాకిడి తగ్గిందని వార్తలు... మరోవైపు మూడో విడతపై భయసందేహాల మధ్య కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవనగతులు తలకిందులైనాయి. ధరల పెరుగుదలకు తోడు ప్రభుత్వాల ఉపేక్ష ప్రజల పాలిట పెనుశాపంగా మారింది. మరోవైపున ఈ దెబ్బతో రాజకీయ వ్యవస్థ కూడా కల్లోలితమవుతున్నది. నిరంతర ప్రవచనాలతో ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణ తగ్గినట్టు ఎప్పటికప్పుడు సర్వేలు, ఎన్నికలు కూడా విదితం చేస్తున్నాయి. నష్ట నివారణ చర్యలతో ప్రతిష్టను కాపాడుకోవడానికి ఆయనతో పాటు, ఆడించే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా నానా పాట్లు పడుతున్నది. అదే సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు, పాలక పార్టీలు ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవడానికి... ఎన్నికలు వచ్చే చోట్ల మళ్లీ బతికి బట్టకట్టడానికి తలకిందులవుతున్నాయి. విజయాలు సాధించిన వారికీ ప్రతిబంధకాలు తప్పడం లేదు. ఢిల్లీ నుంచి గల్లీ దాక ప్రతి చోటా దర్శనమిస్తున్న సత్యమిది. తమకు ఎదురు లేదని విర్రవీగిన నేతలు, పార్టీలు, అవకాశవాద విన్యాసాలతో అడుగుజారిన నేతలు రకరకాల రాజకీయ వైరుధ్యాలలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
 

                                                            కేంద్రం, బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు

    మూలవిరాట్టు తోనే మొదలుపెడితే బ్రాండ్‌ మోడీ 'బ్యాడ్‌ మోడీ'గా మారినట్టు చాలాసార్లు రుజువైంది. ఆయన ఆమోదయోగ్యత గతంలో ఎన్నడూ లేనంత దిగువకు పడిపోయినట్టు కూడా సర్వే సంస్థలు వెల్లడించాయి. దాన్ని ఏమీ చేయలేక అటు నుంచి నరుక్కు వచ్చే ఎత్తుగడ చేపట్టారు. తగ్గిపోయిన తన ఆదరణతో పోల్చి చెప్పే బదులు ఇప్పుడు ఇతర దేశాల నాయకులతో పోల్చి ఆయనకే ఎక్కువ రేటింగ్‌ అని ఊదరగొట్టడం మొదలెట్టారు. ఈ కారణంగానే మోడీ రెండేళ్లుగా వాయిదా వేస్తున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేసి కొత్త మొహాలను చేర్చుకోవడంతోనైనా ఇమేజి కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అది కూడా ఎవరిని తీసుకోవాలో ఎవరిని వదిలించుకుంటే ఏమవుతుందో తేల్చుకోలేక ఎడతెగని మంతనాలు జరుపుతున్నారు. గతంలో గొప్పగా చెప్పిన చాలా పేర్లు ఇప్పుడు అసలు వినిపించడం లేదు. అకాలీదళ్‌ నిష్క్రమణతో పంజాబ్‌లో ఒంటరిపాటు మిగిలింది. చిరాగ్‌పాశ్వాన్‌ లోక్‌జనశక్తి పార్టీలోనూ తిరుగుబాటు పేరుతో చీలిక తీసుకొచ్చారు. బీహార్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా తమకు నితీశ్‌ కుమార్‌పై తప్ప మోడీపై వ్యతిరేకత లేదని, తాను ఆయనకు హనుమాన్‌ వంటి వాడినని చిరాగ్‌ ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. జెడియు హస్తం ప్రధానమైనా బిజెపి ఆశీస్సులు కూడా ఈ పరిణామం వెనక వున్నాయని స్పష్టమైంది. మిత్రపార్టీలుగా వున్న వాటిని చీల్చడంతో బిజెపిపై వాటి విశ్వాసం మరింత సన్నగిల్లే పరిస్థితి. బిజెపి పాలించే అతి పెద్ద రాష్ట్రమైన యు.పి 2022లో ఎన్నికలకు వెళ్లవలసి వుండగా యోగి ప్రభుత్వం పరిస్థితి చుక్కెదురుగా వుంది. కరోనా వైఫల్యం, మతతత్వ వివాదాలు, దళితులపై దాడులు, స్థానిక ఎన్నికల్లో ఓటమి వంటివి వెంటాడుతున్నాయి. అయోధ్య రామమందిరం కోసం స్థలం కొనుగోలులోనూ రూ.18 కోట్ల అవినీతి కుంభకోణం పరువు తీసింది. బిజెపి అంతర్గత కలహాలు ఇందుకు తోడై పాలన స్తంభించిపోయింది. మోడీ శిష్యుడైన అరవింద్‌ కుమార్‌ శర్మను మొదట ఎంఎల్‌సి గా పంపించి ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోమని ఒత్తిడి పెడితే అది తనపై నిఘాగా భావించిన యోగి వ్యతిరేకించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కేంద్ర నాయకులను పరిశీలకులుగా పంపించి ఆయనను దారికి తెచ్చారు. ఢిల్లీలో మోడీ, షా లతో చర్చలు జరిపిన యోగి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. దక్షిణాదిలో బిజెపి కి వున్న ఒకే రాష్ట్రం కర్ణాటక లో యెడ్యూరప్ప పరిస్థితీ అంతే అయింది. కరోనా ఒకవైపు, మత వివాదాలు మరోవైపు సాగుతుండగా యెడ్యూరప్పపై బిజెపి లోనే తిరుగుబాటు బయిలుదేరింది. ఆయనను మారుస్తారనీ మార్చరని భిన్న కథనాలు చెలరేగాయి. మార్చే ధైర్యం చేయలేని బిజెపి అధిష్టానం చివరకు రాష్ట్ర బాధ్యుడైన అరుణ్‌సింగ్‌ ద్వారా ఆయనే కొనసాగుతారని చెప్పించింది. అయితే బాహాటంగా అసమ్మతి కొనసాగుతున్నందున అక్కడ ప్రశాంతత నెలకొనే అవకాశమే లేదు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ముందు ఉధృతంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ వారిని చేర్చుకుని టికెట్టు ఇవ్వగా ఇప్పుడు రివర్స్‌ ఫిరాయింపులతో వారు వెనక్కు వెళ్లడం తలవంపుల పరిస్థితిని సృష్టించింది. రాజస్థాన్‌లో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వర్గం మళ్లీ కుంపటి రాజేస్తున్నది. ఎంతో చిన్నదైన లక్షద్వీప్‌లో కూడా బిజెపి విధానం ప్రతిఘటన పాలైంది. ఎ.పి లో ఆలయాల వివాదం పనిచేయక ఇప్పుడు టిప్పు సుల్తాన్‌ను పట్టుకున్నారు. తెలంగాణలో ఈటెల రాజేందర్‌ను చేర్చుకోవడానికి చూపిన హడావుడి బిజెపి పరిస్థితికి ఒక ప్రతిబింబంగా తయారైంది. కేరళలో కేంద్ర ఏజన్సీలతో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని ఏదో చేయాలనుకుంటే ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుదీంద్రన్‌ అవినీతి ఆరోపణల్లో చిక్కారు.
      మోడీ రెండవసారి రాగానే కుట్రపూరితంగా జమ్మూకాశ్మీర్‌ ని విభజించారు. రాష్ట్రప్రతిపత్తి తగ్గించి హక్కులు హరించేేశారు. ప్రతిపక్ష నేతలందరినీ నిర్బంధంలో వుంచారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ఇంతచేసినా అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోగా ప్రధాన రాజకీయ శక్తులు 'గుప్కార్‌ అలయన్స్‌'గా ఏర్పడి కేంద్రాన్ని నిలదీశాయి. రెండేళ్లలో అనుకున్నట్టు అదుపు సాధించలేకపోయిన కేంద్రం తొలిసారి రాష్ట్రంలో పార్టీలతో మాట్లాడి, అవసరమైతే మళ్లీ రాష్ట్రప్రతిపత్తి పునరుద్ధరణకు కూడా సిద్ధం కావచ్చుననే వార్తలు వస్తున్నాయి. జరిగితే ఇది పెద్ద గుణపాఠమే అవుతుంది. సిఎఎ ను అయిదు రాష్ట్రాలలో అమలు చేయడానికి కేంద్రం పరోక్ష పద్ధతిలో ఆదేశాలిస్తే సుప్రీం కోర్టులో ఆక్షేపణ ఎదురైంది. దాంతో ఈ ఉత్తర్వులకు దానికి సంబంధం లేదని సాకులు చెప్పాల్సి వచ్చింది. సిఎఎ వ్యతిరేక ఆందోళనలో అరెస్టయిన విద్యార్థి నాయకులను కూడా ఢిల్లీ హైకోర్టు విడుదల చేస్తే అందుకు వ్యతిరేకంగా కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లింది. భావప్రకటనా స్వేచ్ఛ పైన, మత స్వేచ్ఛ పైన మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నదనే విమర్శ అంతర్జాతీయంగా కూడా కొనసాగుతూనే వుంది. ఇటీవలనే జి7 దేశాల సమా వేశం సందర్భంగా మాట్టాడిన మోడీ సోషల్‌ మీడియా సంస్థల అదుపు అవసరాన్ని చెప్పడం యాదృచ్ఛికం కాదు. బడా మీడ ియాను ఎంతగా అదుపు చేసినా సోషల్‌ మీడియాలో కేంద్రం పోకడలపై విమర్శలు పెరగడం మింగుడుపడటం లేదు. రాబోయే రోజుల్లో ఈ దాడి పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
 

                                                                  కోలుకోలేని కాంగ్రెస్‌

    బిజెపి సంగతి ఇలా వుంటే కాంగ్రెస్‌ కూడా ఎంతకూ కోలుకోలేకపోతున్నది. ఆ పార్టీ ముఖ్య నాయకులైన జితిన్‌ ప్రసాద్‌ వంటి వారు బిజెపిలో చేరడం, రాజస్థాన్‌లో సచిన్‌పైలెట్‌ కేంద్రంగా అసమ్మతి పునరావృతం కావడం, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌పై నవజోత్‌ సిద్దు తదితరుల తిరుగుబాటు వంటివి ఎడతెగని సమస్యలుగా మారాయి. జితిన్‌ ప్రసాద్‌ నిష్క్రమణ తర్వాత జి23 లేఖ రాసిన వారు మరోసారి గొంతు విప్పారు. పార్టీ పునరుజ్జీవంపై సోనియా, రాహుల్‌ నాయకత్వం తగు వ్యూహం తీసుకోలేక పోతున్నదనే విమర్శలు విజృంభించాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపికపై కూడా ఎడతెగని వాయిదాలతో గడిపేస్తున్నది. మొన్ననే ఓడిపోయిన కేరళ లోనూ పిసిసి అధ్యక్షుడు శాసనసభా నాయకుడి నిర్ణయం వివాదమైంది. మహారాష్ట్ర ఎంవిఎ కూటమిలో శివసేన, ఎన్‌సిపి లు కలసి వ్యవహరిస్తుంటే కాంగ్రెస్‌ ఒంటరిపాటుకు గురైంది. ఒక జాతీయ రాజకీయ శక్తిగా తన స్థానాన్ని వేగంగా బలహీన పర్చుకుంటున్నదనే అంచనాలు పెరుగుతున్నాయి.
 

                                                             ప్రాంతీయ పార్టీలు తీరు

   అధికారంలో వున్న, లేని ఇతర ప్రాంతీయ పార్టీలు ఏమంత మెరుగ్గా లేవు. యు.పి లో బిజెపి అంత ఇబ్బందిలో వుండగా ఎస్‌.పి, బిఎస్‌పి కీచులాటలే కొనసాగుతున్నాయి. బిఎస్‌పి 19 మంది ఎంఎల్‌ఎ లలో ఏడుగురు మాత్రమే దానితో మిగిలారు. కొందరు ఎస్‌.పి తో చేరారు. బిజెపి ని ఎదుర్కోవడంలో ఈ రెండు పార్టీలూ ఎలా వ్యవహరిస్తాయనేది ఇంకా అస్పష్టం. ఎస్‌.పి నేత అఖిలేష్‌పై దాడి కేంద్రీకరించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతి పంజాబ్‌లో అకాలీదళ్‌తో అవగాహన కుదుర్చుకున్నారు. రాజస్థాన్‌ లో కాంగ్రెస్‌కు మద్దతు కొనసాగింపుపై బేరసారాలు సాగుతున్నాయి. పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల కూడా బిఎస్‌పి గతంలో వున్న పట్టు కోల్పోయిందని ఎన్నికల వివరాలు చెబుతున్నాయి. బీహార్‌లో మూడో స్థానానికి పడిపోయి ముఖ్యమంత్రి పదవి పొందిన నితీశ్‌ బిజెపి పై పరోక్ష విమర్శలు చేస్తూనే తమ బలం పెంచుకోవడానికి కాంగ్రెస్‌ వారిపై వల వేస్తున్నారు. చాలా కాలం తర్వాత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలు నుంచి బెయిలుపై విడుదలైనారు. బెంగాల్‌లో తాజాగా మూడోసారి ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ శాంతి భద్రతల వైఫల్యంపై విమర్శలు ఎదుర్కోవడంతో పాటు కేంద్రంతో ఘర్షణ కొనసాగిస్తున్నారు. తాను గతంలో పోషించిన పాత్రను మానేస్తున్నట్టు చెప్పిన ప్రశాంత్‌ కిశోర్‌ (పి.కె) 'ఐ క్యాప్‌' టీమ్‌ తో మమత మళ్లీ కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమికి ఆమె నాయకులుగా వుంటారనే ప్రచారం సాగుతున్నా బలపర్చినవారు దాదాపు లేరు. ఈ పూర్వ రంగంలో ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్‌సిపి కురువృద్ధుడు శరద్‌పవార్‌తో సమావేశం కావడం ప్రత్యామ్నాయ వేదికకు పునాది అని మరో ప్రచారం వినిపించింది. అసలు పి.కె నే ప్రధాని మోడీకి సరైన ఢ అని కూడా కథలు వినిపిస్తున్నాయి. ఒక ప్రచార వాణిజ్య మార్కెట్‌ సంస్థ దేశ రాజకీయాలలో ప్రత్యామ్నాయాన్ని చూపిస్తుందనే కథనం వామపక్షేతర రాజకీయ పార్టీల దురవస్థను చెబుతుంది. గతంలో ప్రాంతీయ పార్టీల పోకడలను గమనించిన వారెవరైనా ఇంత తేలిగ్గా వాటి గురించి జోస్యాలు చెప్పరు. గతంలో రెండు మూడు సార్లు కూడా ఎన్నికల అనంతరమే రాజకీయ కూటములు ఏర్పడి కేంద్రంలో అధికారం చేపట్టాయి గాని మూడేళ్ల ముందే ఏర్పడిన దాఖలాలు లేవు. ఏర్పడినవి నిలబడిందీ లేదు. ఒక్కరోజులో యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ నుంచి ఎన్‌డిఎ సంధానకర్తగా మారిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వంటి వారి ఉదాహరణలున్నాయి. ఇప్పుడూ ఆయన అడగకుండానే కేంద్రానికి మద్దతు ప్రకటించారు. రాష్ట్రాలలో తమకు తిరుగులేదని భావించే నవీన్‌ పట్నాయక్‌, జగన్‌, కెసిఆర్‌ వంటివారు బిజెపి తో పోరాడటానికి సిద్ధంగా లేరు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాత్రం రాష్ట్రాల తరపున గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య వ్యాక్సిన్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ లేఖ రాయడం...తర్వాత నవీన్‌, జగన్‌లు కూడా తమ పద్ధతిలో స్పందించడం కేంద్రం దిగిరావలసిన పరిస్థితిని సృష్టించింది. బిజెపి అందులోనూ మోడీ నాయకత్వం తన మౌలిక విధానాలు మార్చుకునేది వుండదు గనక మరింతగా అడుగు జారడం అనివార్యం. ఎన్నికల ముచ్చట అవి వచ్చినప్పుడే! ఈలోగా రాష్ట్రాల హక్కుల కోసం, ప్రజాశ్రేయస్సు కోసం ఉమ్మడిగా పోరాడితేనే కేంద్రం దిగి వస్తుంది తప్ప ఎవరికివారు తమ అవకాశ వాదాలలో కూరుకుపోతే తీరం చేరడం కుదిరేపని కాదు. వామపక్షాల ఆధ్వర్యంలో ఇప్పుడు దేశవ్యాపితంగా సాగుతున్న నిరసనోద్యమం, రైతాంగం ఉమ్మడి పోరాటం వంటివి అందుకు దారిచూపిస్తాయి.
 

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి