ప్రజాశక్తి - సాలూరు : స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఏటా ఆణిముత్యాలు లాంటి విద్యార్థినులను అందిస్తోంది. ప్రారంభం నుంచి అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్న పాఠశాలగా గుర్తింపు పొందింది. 2018 డిసెంబర్‌లో బాలికల పాఠశాల ఇక్కడ ప్రారంభమైంది. 6నుంచి 8వ తరగతి వరకు 320మంది విద్యార్థినిలతో ఆరంభమై దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఏటా మెరికల్లాంటి విద్యార్థినులు ప్రతిష్టాత్మక త్రిబుల్ ఐటిలకు ఎంపికవుతున్నారు. గడచిన మూడేళ్లలో 14మంది బాలికలు రాష్ట్రంలోని వేర్వేరు ఐఐఐటిలో సీట్లు సాధించుకున్నారు. ఇంతవరకు పాఠశాల నుంచి మూడు పదోతరగతి బ్యాచ్‌లు విడుదలయ్యాయి. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో స్థానిక జ్యోతిరావుపూలే పాఠశాలలో చేరడానికి జిల్లా నలుమూలల నుంచి బాలికలు పోటీ పడుతున్నారు. 2021లో 50మంది విద్యార్థినులు పదోతరగతి పరీక్షలు రాయగా వందశాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ముగ్గురు ఐఐఐటిలకు ఎంపికయ్యారు. 2021-22లో 74మంది పదోతరగతి పరీక్షలకు హాజర్వగా 73మంది ఉత్తీర్ణులయయ్యారు. వీరిలో 33మంది 500లకుపైగా మార్కులు సాధించారు. ఆరుగురు ఐఐఐటిల్లో సీట్లు సాధించారు. 2022-23లో 76మంది విద్యార్థినిలు పదోతరగతి పరీక్షలు రాయగా 72మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఇద్దరు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుల య్యారు. 37మంది 500లకు పైగా మార్కులు సాధించుకున్నారు. ఐదుగురు ఐఐఐటిలలో సీట్లు సాధించి ప్రతిభ కనబరిచారు. కర్రి షర్మిల, తెంటు యామిని, దమరుసింగు లత అనే విద్యార్ధినులు నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. కర్రి యోజిత శ్రీకాకుళం ఐఐఐటిలో, కర్రి మోనీషా ఒంగోలు త్రిపుల్ ఐటిలో సీటు సాధించారు.
జగనన్న ఆణిముత్యాలుగా ఎంపిక
ఈఏడాది పదోతరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినిలు రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలు అవార్డు సాధించుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో 585మార్కులతో సాధించిన కర్రి షర్మిల రూ.15వేల నగదు బహుమతి, బంగారు పతకాన్ని అందుకున్నారు. 581మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన తెంటు యామిని రూ.10వేల నగదు బహుమతి, రజిత పతకం సాధించారు. మహాత్మా జ్యోతి రావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల యాజమాన్యం పరిధిలో ప్రథమ స్థానంలో నిలిచిన కర్రి షర్మిలకు రూ.50వేల నగదు బహుమతి, బంగారు పతకం లభించింది. పాఠశాలకు జ్ఞాపిక లభించింది. 581మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన తెంటు యామినికి రూ.30వేల నగదు, రజిత పతకం లభించాయి. 574మార్కులు సాధించిన దమరుసింగు లతకు రూ.15వేల నగదు బహుమతి లభించింది. పాఠశాల ప్రిన్సిపల్ మూకల పెంటయ్య జ్ఞాపిక అందుకున్నారు. పదోతరగతి పరీక్షల్లో కాక సాంస్కృతిక, సైన్స్, మేథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో కూడా పాఠశాల విద్యార్ధినులు అనేక పతకాలు సాధించారు.
ఉత్తమ బోధనతోనే ఉత్తమ ఫలితాలు
మహాత్మా జ్యోతి రావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలో విద్యార్థినులకు బోధన జరుగుతుంది. పాఠశాలలో పూర్తి స్థాయిలో బోధనా సిబ్బంది వున్నారు.స్టడీ అవర్స్ నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం.
ఎం.పెంటయ్య, ప్రిన్సిపాల్,
జ్యోతి రావు పూలే పాఠశాల, సాలూరు.










