Oct 24,2023 19:48

వేగావతి నదిలోనుంచి నడుచుకుంటూ వెళ్తున్న జనం

మండలంలోని శివరాంపురం సమీపంలో వేగావతి నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం 16 ఏళ్లుగా అసంపూర్తిగా మిగిలి ఉంది. ప్రస్తుత డిప్యూటీ సిఎం రాజన్నదొర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2007లో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి ఉమ్మడి జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే రాజన్నదొర భూమి పూజ చేశారు. తర్వాత కొన్నాళ్లకు కాంట్రాక్టరు మరణించడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మూడు ప్రభుత్వాలు మారినా 8 గ్రామాల రహదారి కష్టాలు మాత్రం తీరలేదు. 16 ఏళ్లుగా వంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలి ఉంది. వేగావతి వంతెనపై శివరాంపురం సమీపంలో నిర్మించిన వంతెన అసంపూర్తిగా ఉండడంతో చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రధానంగా వర్షాకాలంలో వీరి కష్టాలు వర్ణించడానికి వీలుకాని పరిస్థితి.
ప్రజాశక్తి-సాలూరు : 
2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 2007లో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 3.10 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వంతెన స్థంభాలు నిర్మించిన తర్వాత కాంట్రాక్టరు మరణించడంతో అదే స్థితిలో ఉండి పోయింది. 2009లో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2006లో ఎమ్మెల్యేగా రాజన్నదొర కోర్టు తీర్పు ద్వారా ఎన్నికయ్యారు. రెండోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఆయనే ఎమ్మెల్యేగా పని చేశారు. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా రాజన్నదొర ఎన్నికయ్యారు. 2019 నుంచి ఆయనే నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. గడచిన ఏడాది కాలంగా ఆయన డిప్యూటీ సిఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మూడు ప్రభుత్వాల హయాంలోనూ ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్‌, టిడిపి, వైసిపి ప్రభుత్వాలు వంతెన నిర్మాణం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వంతెన నిర్మాణం చేపడతామని ప్రధాన పార్టీల అభ్యర్థులు హామీలు గుప్పిస్తున్నారు. కానీ ఓడ దాటాక బోడి మల్లన్న చందంగా పాలకులు సమస్యను విస్మరిస్తున్నారు. వర్షాకాలంలో పెద పారన్నవలస ప్రజలు అన్ని గ్రామాల కంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామస్తులు రెండు గడ్డలను దాటుకుని ఊరిలోకి చేరాలి. పెదపారన్నవలస, బోరబంద మధ్య నిర్మించిన కూరగెడ్డ వంతెన కూడా అసంపూర్తిగా మిగిలి ఉంది. కాంట్రాక్టరుకు బిల్లు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
చినపారన్నవలస, పెద పారన్నవలస, భవానీపురం, వంగపండువలస, మిర్తివలస, రొంపిల్లి గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా చిన పారన్నవలస, పెద పారన్నవలస వాసులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శివరాంపురం గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉండటంతో సమీప గ్రామాలకు చెందిన విద్యార్థులు గెడ్డలు దాటుకుంటూ వస్తుంటారు. వర్షాకాలంలో నది ఉధృతంగా ప్రవహిస్తే ఎక్కడి వారు అక్కడ నిలిచిపోవాల్సిందే. రెండు పారన్నవలస గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వర్షాకాలంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది. మరో నాలుగైదు నెలల్లో మళ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ ప్రభుత్వంలోనూ వంతెన నిర్మాణం ప్రారంభించే అవకాశం లేదు. ప్రభుత్వాలెన్ని మారినా 8 గ్రామాల రహదారి కష్టాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.