
అనగనగా.. అంటూ ఆసక్తి రేకెత్తిస్తూ చెప్పే కథల్లో అందమైన పలుకుబడి ఉంటుంది. బడిలో చెప్పే పాఠం కన్నా బామ్మ.. తాతయ్య చెప్పిన కథలే బాగా గుర్తుంటాయి. ఎందుకంటే కథలు బాల్యాన్ని ఊహల్లోకి నడిపిస్తాయి. పిల్లల్ని కూర్చున్న చోటు నుంచి ఊహా ప్రపంచంలోకి నడిపించే శక్తి కథనానికి ఉంది. ఇష్టమైన పరిసరాల్ని, జంతువుల్ని కళ్లకు కట్టే కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. పిల్లల్ని నిద్రపుచ్చేందుకు కథ చెప్పినా, మెలకువ రాగానే మరపు లేకుండా కథ మొత్తం తిరిగి చెప్తారు. కానీ, పాఠం అలా చెప్పడం కష్టమే. కథ ఆకట్టుకున్నట్టు పాఠం ఆకట్టుకునేలా చెప్పి చూడండి.. అప్పుడిక వాళ్లా పాఠం మర్చిపోరు. ఆకట్టుకునే కనికట్టే కథనం. నేడు బాలసాహిత్యంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత పెరిగింది. ఇప్పటికే తెలుగులో అనేక నీతి కథలు బాల్యాన్ని అలరిస్తున్నా.. నేటి పిల్లలకు ఆ పద్ధతుల్లో చెబితే నచ్చవు. ప్రశ్నలపై ప్రశ్నలు వేసే నేటి బాల మేధావుల ఆలోచలనకు కొత్త చిగుర్లు తొడిగే రీతిలో కొత్త కథలు రావాలి. అలాంటి కథలు రాయాల్సిన ఆవశ్యకతా బాలసాహిత్యకారులపై ఉంది. ఆ దిశగానే అనేక మంది కొత్త రచయితలు వాళ్ల ప్రయోగాలతో పిల్లల్లో సృజన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అనేక మంది.. వివిధ రూపాల్లో పిల్లల ఆసక్తిని పుస్తకాలవైపు మళ్లించే దిశగా కృషి చేస్తున్నారు. ఏప్రిల్ 2 'ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవం' సందర్భంగా బాల సాహిత్యం.. దాని ఒరవడి.. కథలు, పుస్తకాల ప్రాముఖ్యతపై ఈ వారం అట్టమీద కథ..!

కథ అంటే నీతి.. కథ ఒక రీతి.. కథ అంటే నిజాయితీ! పిల్లలను చేరదీసి కథలు చెప్పండి.. ఆ కథలే పిల్లలను వేలు పట్టి నడిపిస్తాయి. రోబోటిక్ యుగంలో ఉన్నా.. అంతరిక్షంలో కాలనీలు కట్టినా.. చందమామ కథలు చెప్పాల్సిందే! 'బాలమిత్ర' వంటి పుస్తకాలు కావాల్సిందే! ఎందుకంటే ఆ కాల్పనిక శక్తే మానవజాతిని ఇంతవరకూ నడిపించింది. పసి మనసుల్లో.. ఎందుకు, ఏమిటి, ఎలా? అన్న ప్రశ్నలను ఉదయింపజేసి.. పరిష్కారాలను ప్రసరింపజేసింది. అందుకే 'కథలు చెప్పను' అని పిల్లలను ఎప్పుడూ చిన్నబుచ్చకూడదు. సమయం లేదని సాకులూ చెప్పకండి. మీరు చెప్పలేకపోయినా.. వారికో అంశం ఇచ్చి.. కథ అల్లమని చెప్పండి.. అలా వాళ్లు చెప్పే కథలు వినండి. వారి కళ్లలోని వెలుగులు చూడండి.. ఎన్ని కలలో.. ఎన్ని కథలో..!! వినేకొద్దీ ఇంకా వినాలనిపిస్తాయి. చదివే కొద్దీ ఇంకా చదవాలనిపిస్తాయి. చెప్పేకొద్దీ ఇంకా చెప్పాలనిపిస్తాయి. జీవితాంతం చెప్పినా తరగని కథలు! పిల్లలకు దారి చూపే వెలుగు రేఖలు!

దినోత్సవం ఇలా..
బాల సాహిత్యవేత్తగా పిల్లల కోసం 168 కథలు రాసిన 'హాన్స్ క్రిస్టియన్ ఏండర్సన్' పుట్టినరోజును 1967 నుంచి ఏటా ఏప్రిల్ 2వ తేదీని ప్రపంచ వ్యాప్తంగా పిల్లల పుస్తక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1805-1875 మధ్య జీవించిన ఏండర్సన్ డెన్మార్క్‌కు చెందిన రచయిత. ఇతడు పిల్లల కోసం రాసిన కథలు అనేక సంపుటాలుగా వెలువడ్డాయి. 125 భాషల్లోకి అతడి కథలు అనువాదమై ప్రపంచ వ్వాప్తంగా ఉన్న అనేక దేశాల పిల్లలకు అందుబాటులోకి వచ్చాయి. మన తెలుగులోనూ ఆయన కథలు రెండు సంపుటాలుగా బాలానందం ప్రచురణలుగా వచ్చాయి. మనకు తెలిసిన కొన్ని పిల్లల కథల్లో ఆయన కథలూ ఉన్నాయి. వాటిని ఊట్ల కొండయ్య అనువదించారు. వాటికి బాపు బొమ్మలు వేశారు.

తెలుగు నేపథ్యం..
ఈ ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవ సందర్భంగా మన తెలుగు బాలసాహిత్యాన్ని క్లుప్తంగానైనా పరిచయం చేయాలి. నేడు మన దేశంలో, రాష్ట్రంలో జరిగిన సాంఘిక సంస్కరణోద్యమాలు, వాడుక భాష ఉద్యమాలు, విద్యారంగంలో వచ్చిన మార్పులు బాలసాహిత్య రచనకు ఊపిరి పోశాయి. 1819లో రావిపాటి గురుమూర్తి రాసిన 'విక్రమార్కుని కథలు' బాలసాహిత్యంలో మొదటి గ్రంథం. తరువాత పిల్లల కోసం సరళమైన భాషలో 1834లో 'పంచతంత్రం' ప్రచురితమైంది. అనంతరం కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, ఓలేటి పార్వతీశం, బాలాంత్రపు వెంకట్రావు, వావికొలను సుబ్బారావు, గిడుగు సీతాపతి, ఏటుకూరి వెంకటనర్సయ్య వంటి పెద్దలెందరో పిల్లల రచనలు చేశారు. న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి, ఏడిద కామేశ్వరరావు, చింతా దీక్షితులు వంటివారు పిల్లల కోసమే అమూల్యమైన బాల సాహిత్యాన్ని సృష్టించారు. 'చందమామ' వంటి పిల్లల పత్రికలు, సాహిత్య సంస్థలు బాలసాహిత్య రంగానికి ఎనలేని సేవ చేశాయి. 'చందమామ, బాలమిత్ర' వంటి పత్రికలు పిల్లల్ని, పెద్దల్ని ఒక్కటి చేశాయి.

వ్యక్తిత్వ వికాసానికి..
పిల్లల్లో వికాసానికి బాలసాహిత్యానికి మించింది లేదు. ఆ పుస్తకాల్లోని కథలు, కవితలు, పద్యాలు, గేయాలు, పాటలు, చిత్రాలు అన్నీ వ్వక్తిత్వ వికాసానికి దోహదపడేవే. సంతోషాన్ని, ఆనందాన్ని కల్గిస్తూనే లోకరీతిని పరిచయం చేస్తాయి. ఏ సమయంలో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మెలగాలో నేర్పుతాయి. సమస్యలు ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడడం, పరిష్కరించుకోవడం బోధిస్తాయి. అవసరమైన ధైర్యాన్ని, దయను, మానవీయతను పిల్లలకు అందించేవి మంచి పుస్తకాలే. మాతృభాషను రక్షించుకోవడానికి పిల్లలకు పుస్తకాలను దగ్గర చేయడం ఓ మంచి మార్గం.

ఆలోచింపజేసే కథలు..
తెనాలి రామకృష్ణ కథలు, విష్ణుశర్మ 'పంచతంత్రం', చిన్నయసూరి 'నీతి చంద్రిక', కాశీమజిలీ కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, విక్రమార్క భేతాళ కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు మొదలైనవి..

ఆంగ్లంలోనూ..
ఆంగ్లంలో బాలసాహిత్యంలో ఎన్నో సాహితీ విభాగాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఊహా సాహిత్యం లేదా ఫాంటసీ, అన్వేషకుల గాథలు, సైన్స్, సైన్స్ ఫిక్షన్, హర్రర్, క్రైమ్, పరిశోధన, సాహసగాథలు, వృత్తులు, క్రీడలకి సంబంధించిన సాహిత్యం అందుబాటులో ఉంది. ఈ రకమైన వర్గీకరణ తెలుగు బాలసాహిత్యంలో తక్కువనే చెప్పాలి.

మనస్తత్వాన్ని తెలుసుకోవాలి!
పిల్లలు కథలను బాగా ఇష్టపడతారు. ఓ గురువు వామనుడి కథ చెబితే ఓ పిల్లాడు లేచి.. వామనుడు ఒక కాలు భూమంతా పెడితే ఇక మనుషులెక్కడ నిలబడ్డారు? అని ప్రశ్నించాడట! దానికి మరో పిల్లాడు ఆయన వేళ్ల మధ్య ఉండి ఉంటారని చెప్పడంతో హమ్మయ్యా అనుకున్నాడట కథకుడు. ఇప్పటి పిల్లలు అంత గడుగ్గాయిలు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని వాళ్లకు బాలసాహిత్యం నూరిపోయాలి. ఇది వైజ్ఞానిక యుగం. దీని ప్రభావం మన నిత్య జీవితంపై విశేషంగా పడుతోంది. రైళ్ళు, బస్సులు, కార్లు, సైకిళ్ళు మొదలైన ప్రయాణ సాధనాలు లేనిదే రోజు గడవదు. టెలిఫోన్, టెలిగ్రాఫ్, రేడియో, సినిమా వంటి సాంకేతిక పరికరాలు లేనిదే పూట గడవదు. ఒకప్పుడు పాశ్చాత్య సామ్రాజ్యాల స్థానంలో ప్రస్తుతం ఎన్నో స్వతంత్ర దేశాలు అవతరించాయి. దేశాల మధ్య, జాతుల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. ఈ సంబంధాల ప్రభావం మన నిత్యజీవితంపై పడుతోంది. శాఖోపశాఖలుగా విస్తరించిన విజ్ఞానశాస్త్రాలు అపారవేగంతో పురోగమిస్తున్నాయి. మానవులు చంద్రమండలంలోకి వెళ్లి తిరిగివచ్చారు. దూరగ్రహాలనూ చేరే తరుణంలో ఉన్నాము. ఈ విధంగా, మన కళ్ళ ముందు ఎన్నెన్నో అపూర్వ సంఘటనలు జరిగిపోతున్నాయి. వీటిని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి చిన్నారికీ సహజంగా ఉంటుంది. ఈ కుతూహలాన్ని తీర్చగల ప్రాథమిక సాహిత్యాన్ని మనం అందించాల్సి ఉంది.

కరోనా వేళ.. కథలే నేస్తాలు..
కరోనా మరోమారు పిల్లల్ని ఇంటికి పరిమితం చేయబోతుంది. ఈ పరిస్థితుల్లో స్నేహితులకు దూరమైన చిన్నారులకు బాలసాహిత్యమే గొప్ప నేస్తం. పిల్లలకు ఏదో ఒక వ్యాపకం లేకుండా ఖాళీగా ఉంచితే ఇల్లంతా గోల చేస్తారు. వారికి అల్లరి అదుపులోకి రావడమే కాదు.. బాలసాహిత్యంతో వారి మేధోశక్తి మెరుగుపడుతుంది. వారికి నచ్చే పుస్తకాలను వాళ్లనే కొనుక్కునేలా ప్రోత్సహించండి.
పిల్లల రచనలకు ప్రోత్సాహం..
ప్రస్తుత యుగంలో బాలసాహిత్యాన్ని బాలలూ రాసేలా అనేక శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక స్వచ్ఛంద, సాహిత్య సంస్థలు పిల్లల్ని సాహిత్య రంగంవైపు ప్రోత్సహిస్తున్నాయి. పిల్లలు రాసిన పుస్తకాలూ విరివిగా వస్తున్నాయి. బాలసాహిత్య రచయితలకు, పిల్లల రచనల పుస్తకాలకు అవార్డులు ఇస్తున్నారు. బాలల అకాడమీలు, వివిధ సాహిత్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కొందరు రచయితలు పిల్లల సాహిత్యాన్ని వివిధ రూపాల్లో ప్రోత్సహిస్తున్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు పిల్లలు రాసిన రచనల ప్రచురణకూ ఆర్థిక తోడ్పాటునందిస్తున్నారు. సాహిత్య అకాడమీలు, సాక్షర భారత్, సర్వశిక్షా అభియాన్ వంటి వాటి నుంచి పిల్లలకు, విద్యార్థులకు అవసరమైన అనేక పుస్తకాలు ముద్రితమయ్యాయి. మైసూరులోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ వారు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కలిపి ఉండే బైలింగ్వల్ పిల్లల పుస్తకాలు అందంగా అచ్చువేసి, పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. పాశ్చాత్య బాల సాహిత్యంలో అత్యంత ఆదరణ పొందినవి సోవియట్ కథలు. నేటి అనేకమంది రచనకారులకు, మేధావులకు అవే ప్రేరణలు. 'హారిపోటర్', 'ఆలీస' వంటి పుస్తకాలూ తెలుగులోకి అనువాద రూపంలో వచ్చాయి. పీకాక్ క్లాసిక్స్ పాశ్చాత్య దేశాల ప్రసిద్ధ రచయితల అమూల్యమైన పుస్తకాలను, క్లాసిక్స్‌ను పిల్లలకూ ఉపయోగపడేలా సరళమైన భాషలో ఎన్నో అనువాద రచనలను ప్రచురించారు.

పిల్లల ప్రపంచం..!
ఆటలు.. పాటలు.. పెద్దలు చెప్పే కథలు.. ఒక్కప్పటి పిల్లలకు ఇవే తెలుసు. అయితే నేటి తరానికి అవన్నీ దూరమయ్యాయి. ఆధునిక యుగంగా భావించే కాంక్రీట్ జంగిల్లో చదువు.. మార్కులు.. వీడియో గేమ్‌లు.. ఇవే.. ప్రపంచమయ్యాయి. పాత ఉమ్మడి కుటుంబంలో పిల్లల కోసం పెద్దలు ప్రత్యేకంగా సమయం కేటాయించేవారు. వారితో పాటే తల్లిదండ్రులూ వారి భావాలను పిల్లలకూ పంచేవారు. నేటి వేగవంతమైన జీవనంలో ఇంటిల్లిపాదీ వివిధ వృత్తుల్లో మునిగితేలుతున్నారు. పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో కొంతమేర మార్పు కనిపిస్తున్నప్పటికీ ఇంకా మారాల్సి ఉంది. లేదంటే పిల్లలు సృజనాత్మక శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక మంది పిల్లలు వీడియోగేమ్స్‌కి విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా ఆ వీడియోల్లోని నేర స్వభావం వారిపై చెడు ప్రభావం కలిగిస్తుంది. దీని నుంచి వారిని రక్షించాలంటే బాలసాహిత్యమే చక్కటి పరిష్కారం!
నేటి తరం రచనలు..
పిల్లల పుస్తకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తున్న కాలం. అన్ని ఖండాల పిల్లల పుస్తకాలు అనువాదాల రూపంలో ఈనాటి పిల్లలకు అంతర్జాలంలో అందుతున్న సౌలభ్యం. అంతేకాకుండా ఎదిగిన పిల్లలకోసమూ ఉపయోగపడే గోర్కి, టాల్‌స్టాయి, ఆస్కార్ వైల్డ్, జాక్ లండన్, గిజూబాయి, రవీంద్రనాథ్ టాగూర్, ప్రేమ్‌చంద్, మహాశ్వేతా దేవి, నీల్, కష్ణమూర్తి, ఆర్.కె. నారాయణ్, టెట్సుకో కొరియానాగి, జోనాథన్ స్విఫ్ట్, డేనియల్ డెఫో, గుగి వా థియాంగో, రోమన్ కిమ్, అన్నా ఫ్రాంక్, జె.కె.రౌలింగ్, మలాల, విలియం మార్టిన్, ధన్‌గోపాల్ ముఖర్జీ, మాధురి పురందరే, కమలా భాసిన్, రస్కిన్ బాండ్ వంటి పాత, కొత్త ప్రసిద్ధ రచయితల పుస్తకాలు తెలుగులో అందుబాటులోకి వచ్చాయి. ఈ తరం బాలసాహిత్య రచయితలు మారుతున్న బాల్యాన్ని, అది ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ నాటి పిల్లల అవసరాలకు తగిన విధంగా బాలసాహిత్యాన్ని సష్టించాలి. అలాగే పాశ్చాత్య ప్రపంచంలో గతంలో వచ్చిన, ప్రస్తుతం వస్తున్న బాలసాహిత్యాన్ని అధ్యయనం చేయాలి.

ఎందుకు చెప్పాలి?
'జ్ఞానం కంటే ఊహాశక్తి చాలా గొప్పది' అన్నాడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్! ఈ మాట అక్షరాలా నిజం! పిల్లల్లో ఆ ఊహాశక్తిని పెంపొందించడానికి కథ చెప్పడం ఓ చక్కని మార్గం! అనగనగా.. అనగానే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కథలోని పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. దృశ్యాన్ని చూస్తే అనుభూతి లభిస్తుంది. కానీ ఆలోచించే అవసరం ఎక్కువ ఉండదు. కానీ కథ చెప్పడం, చదవడం, వినడం వల్ల పిల్లల కాల్పనిక, ఆలోచనా శక్తి విస్తృతమవుతుంది. సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. కథతోబాటు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు? ఇలా ఎందుకు? అని అడుగుతుంటారు. దీంతో వారి ఆలోచనా విస్తృతి పెరుగుతుంది. ప్రశ్నించే తత్త్వంతోబాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడుతుంది. అన్నింటికీ మించి వివిధ పదాలను పరిచయం చేస్తూ భాషా సంపత్తిని పెంపొందించేది బాలసాహిత్యమే.
మంచి చెడులు నేర్పేవి..
మన చుట్టూ ఉన్నవారిలో చాలామంది చిన్న వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారే. అయితే కొందరు పిల్లలు అసలు వాటిని వేధింపులుగా గుర్తించ లేకపోవచ్చు. అందుకే చిన్నారులకు కాస్త ఊహ తెలిసినప్పటి నుంచే గుడ్‌టచ్, బ్యాడ్ టచ్ వంటివాటి గురించి వివరించాలి. వీటిని విడమరిచి చెప్పలేని వారికి అలాంటివి తెలియజేసే విషయాలతో, పిల్లలూ చదివి తెలుసుకునేలా కథలు వస్తున్నాయి. అవి పిలల్లో ధైర్యాన్ని కలిగించడమే కాదు.. ఆపదను తప్పించుకునేందుకు తోడ్పడేవే.

అంతర్జాలం కథలు..
తాతయ్య, బామ్మలు చెప్పే కథలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగాల్లో బిజీగా ఉండే తల్లిదండ్రులకు పిల్లలకు కథలు చెప్పే తీరిక ఉండదు. అలాంటివారికి ఓ రకంగా అంతర్జాలం తోడ్పడుతుంది. నేటి తరం పిల్లలు పుట్టగానే మొబైల్ ఫోన్లకు, ఇంటర్నెట్‌కు బానిసలైపోతున్నారు. అలాంటివారిని సైతం కథలవైపు మళ్లించేందుకు కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానళ్లు కృషి చేస్తున్నాయి. దీంతోపాటు పిల్లలకు కథలు చెప్పే యాప్‌లూ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బొమ్మల రామాయణం దగ్గర్నుంచి పంచతంత్రం కథల వరకూ కార్టూన్ల రూపంలో అలరిస్తున్నాయి. బొమ్మరిల్లు, గీతాంజలి, నట్‌కట్ టీవీ ఛానల్, తెలుగు ఫెయిరీ టేల్స్ ఛానల్స్‌లో వందలాది నీతి కథలు, యానిమేటెడ్ కథలు చిన్నారులకు ఆహ్వానం పలుకుతున్నాయి. అయితే వాటికే పరిమితం కావడం అంత మంచిదికాదు. కాబట్టి నెమ్మదిగా వారి దృష్టిని పుస్తకాల వైపు మళ్లిస్తే, క్రమంగా వారి ఆలోచనా శక్తి పెరుగుదలకు దోహదం చేస్తుంది.
ఆసక్తిని పెంచేలా..
- కథలు వినే పిల్లలకు ఆ కథల్లో వారినే పాత్రధారుల్ని చేయండి.
- వాళ్లతోనూ కొన్ని వస్తువులు ఇచ్చి.. కథ అల్లి చెప్పమనండి.. బాగా చెప్పినందుకు ఏదో ఒక కథల పుస్తకం బహుమతిగా ఇవ్వండి.
- కథ చదివాక, తిరిగి చెప్పమని మీరూ వినండి.
- మరీ చిన్నపిల్లలకి కథల పుస్తకం ఇచ్చేసి ఊరుకోకండి.. వీలయితే వాళ్లతో పాటే ఉండి చదవడానికి సహాయపడండి.
- పుస్తకం పూర్తయ్యాక.. ఆ పుస్తకంలో బాగా నచ్చిందేమిటో.. ఎందుకు నచ్చిందో.. నచ్చనది ఏమిటో.. ఎందుకు నచ్చలేదో.. ఇలా చర్చకు పెట్టండి.
- వీలయితే పుస్తకం చదివాక ఆ కథను వాళ్లయితే ఎలా రాయగలరో.. లేకపోతే ఎలా రాయొచ్చో చెప్పి ప్రోత్సహించండి.
- ఎవరికైనా పుస్తకాలు బహుమతులు ఇవ్వడం, తీసుకోవడం ఇప్పటి నుండే పిల్లలకీ నేర్పండి.