దళిత హక్కులకై జాతీయ స్ధాయిలో ఉద్యమ నిర్మాణానికి అలుపెరగని ఉద్యమకారుడు కందుల ఆనందరావు. ఢిల్లీ ఆనందరావుగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, జాతీయ స్ధాయిలోనూ గుర్తింపు కలిగిన ఆనందరావు అన్న గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధికి గురై డిసెంబరు 31న అమరుడైనాడు.
ఆనందరావు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టాడు. కావలిలో చదువుతున్న కాలంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడియస్‌యు)లో చురుగ్గా పనిచేశాడు. ఈ క్రమంలోనే కారుమంచి గ్రామంలో పని చేస్తున్న అంబేద్కర్ యూత్ ఆర్ట్స్ అసోసియేషన్ (ఎవైఎఎ)ను పటిష్టం చేయడానికి, యువకులను కూడగట్టాడు. ప్రజా కళలను ప్రోత్సహించాడు.
ఆంధ్రభవన్‌లో ఉద్యోగ రీత్యా ఢిల్లీకి చేరినప్పటికీ, పుట్టిన గడ్డను మరిచిపోకుండా, తన గ్రామంలో సామాజిక ఉద్యమాలనూ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను చేపట్టేవాడు. అంబేద్కర్ గోల్డ్ కప్ జాతీయ స్ధాయి వాలీబాల్ పోటీలను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించాడు. ఆరధ్రా భవన్‌ను కేంద్రంగా చేసుకొని, ఆల్ ఇండియా దళిత హక్కుల వేదిక (ఎఐడిఆర్‌ఎఫ్)ను స్థాపించాడు. తాను ప్రభుత్వ ఉద్యోగిగా వుండి కూడా, భయపడకుండా, రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి ఉద్యమించాడు. కేంద్రం లోని మోడీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించినందు వలన, యస్.సి, యస్.టి అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చుతూ, సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును నిరసిస్తూ, అట్రాసిటి చట్టం పరిరక్షణకై వివిధ దళిత సంఘాలతో కలిసి జాతీయ స్ధాయి ఉద్యమానికి కృషి చేశాడు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అణగారిన కులాల హక్కు అని చాటి, వాటి అమలు కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. దళితులపై ఎక్కడ ఏ రూపంలో దాడి జరిగినా, క్షణాల్లో ఢిల్లీ నుండి ఆ ప్రాంతంలో వాలిపోయేవాడు. మనువాదుల వేధింపులకూ, కుట్రలకూ బలైన వేముల రోహిత్ సంఘటన పైనా, గరగపర్రు, రాపూరు, పెదగొట్టిపాడు సంఘటనల సందర్భంగా దళితులనూ, వివిధ సంస్ధలనూ కూడగట్టడానికి కృషిచేశాడు. అణగారిన హక్కులను కాపాడడంలో ఏమాత్రం రాజీ పడకుండా, దళితుల హక్కుల పరిరక్షణకు నిలబడ్డ ఆనందరావు అన్నకు జోహార్లు.
- డా|| శ్రీనివాసరావు చొప్పర,
సెల్ : 86396 07755










