May 29,2022 09:28

ములగకాయ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే వంటకం సాంబార్‌, పులుసు.. వీటితోపాటు ఎక్కువగా శాఖాహార వంటకాలతో కలిపి వండేవే అనేకం తెలుసు.. అయితే వీటితో స్వీట్లు, మాంసాహార వంటకాలూ చేయొచ్చు.. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ములగ కాయలతో రోటిపచ్చడి, రొయ్యలతో కలగలుపు, పెరుగుకూర, స్వీటు చేస్తే ఆ రుచే వేరు. మరి ఆ టేస్టీ రెసిపీలు ఎలా తయారుచేయాలో తెలుకుందాం..

పచ్చడి


రోటి పచ్చడి
కావాల్సిన పదార్థాలు : 
ములగకాయ గుజ్జు- కప్పు, టమాటాలు- రెండు పెద్దవి, ఎండుమిర్చి - 15, నూనె- తగినంత, ఆవాలు, మెంతులు- కొద్దిగా, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత, చింతపండు- నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు -10, జీలకర్ర -స్పూన్‌, పసుపు - చిటికెడు.
తయారీ విధానం : ముందుగా ములగకాయ ముక్కల్లో గుజ్జును స్పూన్‌తో తీయాలి. 
పాన్‌లో నూనె వేడిచేసి ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపాలి.
వేగాక ములగకాయ గుజ్జు, కొద్దిగా పసుపు వేయాలి. అది మగ్గాక టమాటా ముక్కలు వేయాలి. చివరిలో కర్వేపాకు, చింతపండు వేసి, కాసేపు వేపాలి. తర్వాత చల్లారనివ్వాలి.
చల్లారిన మిశ్రమాన్ని, వెల్లుల్లి రెబ్బలను, ఉప్పు, జీలకర్ర మిక్సీలో వేసుకోవాలి. అంతే ములగకాయ రోటిపచ్చడి రెడీ!

పెరుగు కూర



పెరుగు కూర
కావాల్సిన పదార్థాలు : ములగకాయ ముక్కలు-కప్పు, పెరుగు-రెండున్నర కప్పులు, ఆవాలు-పావు టీ స్పూన్‌, ఎండుమిర్చి-నాలుగైదు, జీలకర్ర- పావు టీ స్పూన్‌, మినపగుండ్లు-టీ స్పూన్‌, పసుపు-చిటికెడు, పచ్చిమిర్చి (నిలువుగా చీల్చి) - రెండుమూడు, కరివేపాకు-కొద్దిగా, ఇంగువ-పావు టీ స్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు-నాలుగైదు, చిన్న ఉల్లిగడ్డలు- ఆరు, కారం, ఉప్పు-తగినంత, మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడి-ఒక్కోటి పావు టీ స్పూన్‌ చొప్పున, కొత్తిమీర- రెండు టీ స్పూన్‌లు, నూనె-సరిపడా.
తయారీ విధానం :  పాన్‌లో కొంచెం నూనె వేడి చేసి, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేగించాలి.
ఇందులో మినపగుండ్లు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దగ్గరపడ్డాక స్టవ్‌ ఆపేయాలి.
ఆ మిశ్రమం పూర్తిగా చల్లారాక పెరుగులో పోసి బాగా కలపాలి.
మరొక పాన్‌లో నూనె వేడిచేసి వెల్లుల్లి రెబ్బలు, పీచు తీసిన ములగకాయ ముక్కలు, చిన్న ఉల్లిగడ్డలు వేసి వేగించాలి.
ఇవి కాస్త మగ్గాక ఉప్పు, కారం, మెంతి, ధనియా, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కొన్ని నీళ్లు పోయాలి.
ముక్కలు పూర్తిగా ఉడికాక స్టవ్‌ ఆపి.. ఆ మిశ్రమం చల్లారాక పెరుగు మిశ్రమంలో కలిపితే మునగ పెరుగు పచ్చడి రెడీ.

స్వీటు


స్వీటు

కావాల్సిన పదార్థాలు : ములక్కాడలు- నాలుగు / ఐదు, బియ్యం- 100 గ్రా, బెల్లం-కప్పు (సన్నగా తరిగి), కొబ్బరి తురుము-కప్పు, యాలకులు-2 (పొడి చేసి).
తయారీ విధానం :  ములగకాయలను రెండు అంగుళాల పొడువు ముక్కలుగా తరుక్కోవాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని, గ్లాసు నీళ్లు పోసి స్టవ్‌పై సన్న సెగన ఉడికించాలి.
బియ్యాన్ని చక్కగా కడిగి, తగినంత నీరు పోసి అరగంట నానబెట్టాలి.
తరువాత నీరు వడబోసి, నానిన బియ్యాన్ని, కొబ్బరి తురుమును కలిపి మిక్సీలో వేసి, కాసిని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
దానిలోనే తరిగిన బెల్లం పొడిని కలిపి మరి కొంచెం తిప్పాలి.
ఈ మిశ్రమాన్ని తీసి, ఉడుకుతున్న ములగకాయ ముక్కల్లో వేసి, కొంచెం సేపు కలియ తిప్పాలి.
యాలకుల పొడి పైన జల్లాలి. బెల్లం పాకం వచ్చి ములగకాయ ముక్కలకు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మన రుచికరమైన ములక్కాడ- బియ్యంపిండి తీపి వంటకం తయార్‌!
 

రొయ్యలు

రొయ్యలు
కావాల్సిన పదార్థాలు : 
రొయ్యలు- పావు కేజీ, ములగకాయ ముక్కలు- అర కప్పు, టమాట తరుగు-పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు -అర కప్పు, చింతపండు రసం- పావు కప్పు, కారం, ఉప్పు- తగినంత, పసుపు-పావు టీ స్పూన్‌, నూనె- తగినంత, ధనియాల పొడి-అర టీ స్పూన్‌, గరం మసాలా- పావు టీ స్పూన్‌, కొత్తిమీర తరుగు-పావు కప్పు.
తయారీ విధానం :  పాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా తరుగు వేసి వేగించాలి.
ఇందులో రొయ్యలు, ములగకాయ ముక్కలు, ధనియాల పొడి, కారం, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి, సన్న మంట మీద మగ్గనివ్వాలి.
ఆ తర్వాత ఉప్పు, చింతపండు రసం వేసి, ఇరవై నిమిషాలు ఉడికించాలి.
చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేస్తే నోరూరించే ములగకాయ రొయ్యల కూర రెడీ.