Mar 10,2023 00:07

పలు సూచనలిస్తున్న జివిఎంసి కమిషనర్‌ రాజాబాబు

ప్రజాశక్తి -మధురవాడ : బీచ్‌ రోడ్డులోని అనధికారిక బోర్డులను తొలగించాలని పట్టణ ప్రణాళికాధికారులను జివిఎంసి కమిషనర్‌ రాజాబాబు ఆదేశించారు. జివిఎంసి 8, 9 వార్డుల్లో గురువారం ఆయన పర్యటించారు. సీతకొండ ''వ్యూ'' పాయింట్‌, గుడ్లవానిపాలెం అమ్మవార్ల గుడి ప్రాంగణం, సాగర్‌నగర్‌ బీచ్‌, రాడిసన్‌ బ్లూ హోటల్‌ తదితర బీచ్‌ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, నగరంలో జి-20 సదస్సు జరగబోతున్న దృష్ట్యా బీచ్‌ రోడ్డులో ఉన్న అనధికార బోర్డులు తొలగించాలని, సీతకొండ ''వ్యూ'' పాయింట్‌ వద్ద సుందరీకరణ, విద్యుత్‌ అలంకరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, బీచ్‌ రోడ్డు ''వ్యూ'' పాయింట్‌ల వద్ద వెండింగ్‌, పార్కింగ్‌, ప్లాంటేషన్‌, లైటింగ్‌ పనులు ఒక పద్ధతిలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ ప్రాంతంలో చెట్లను ఆకర్షణీయంగా ట్రిమ్మింగ్‌ చేయించాలని, సాగర్‌ నగర్‌ పరిసర ప్రాంతాలలో సెంటర్‌ మీడియన్లలో, పారిశుధ్యం, పచ్చదనం, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు తదితర పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. బ్లూమూన్‌ హోటల్‌ వద్ద కొండపై సూచించిన ప్రదేశంలో ఆకర్షణీయంగా సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. సీతకొండ నుంచి ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ వరకు ఫుట్‌పాత్‌లు, పార్కింగ్‌ రోడ్లలో ఆకర్షణీయమైన పెయింటింగులు, విద్యుత్‌ దీపాలంకరణ, ప్లాంటేషన్‌ పనులు వారం రోజులలో పూర్తిచేయాలని పర్యవేక్షక ఇంజినీర్‌ శ్యాంసన్‌ రాజును, రెండవ జోనల్‌ కమిషనర్‌ కనక మహాలక్ష్మిని ఆదేశించారు. ఈ పర్యటనలో పట్టణ ప్రణాళికాధికారి బి.సురేష్‌కుమార్‌, డీడీ (హార్టికల్చర్‌) ఎం.దామోదరరావు, జి- 20 సందస్సు లైజనింగ్‌ ఆర్గనైజర్‌ చక్రవర్తి, కార్యనిర్వాహక ఇంజినీర్‌ మత్స్యరాజు, ఎఎంఒహెచ్‌ డాక్టర్‌ ఎన్‌.కిశోర్‌, డిసిపి పద్మజ తదితరులు పాల్గొన్నారు.