ప్రజాశక్తి-పెందుర్తి : సింహాచలం దేవస్థానం స్థలంలో అనధికారికంగా నిర్మించిన షెడ్‌ను సోమవారం దేవస్థానం అధికారులు తొలగించారు. 95వ వార్డు కృష్ణరాయపురం వద్ద ఒక టింబర్ డిపోలో అనధికారంగా రాత్రికిరాత్రే షెడ్ వేశారని సమాచారం అందిందని, ఈ మేరకు పరీశీలించి తొలగిస్తున్నట్లు ఎఇఒ ఆనందకుమార్ వెల్లడించారు. దేవస్థాన స్థలాలను ఎవరు ఆక్రమించి ఉపేక్షించబోమని, ఎంతటి వారైనా అక్రమ నిర్మాణాలను తొలగించడంతోపాటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా సర్వే నెంబరు 20లోని స్థలాన్ని తాము కొనుగోలు చేశామని, ఇపుడు దాన్ని దేవస్తానం స్థలమంటూ తొలగించడం దారుణమని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఈ స్థలానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అంటున్నారు.
లెక్క కుదరనందువల్లే...
టింబర్ డిపో వద్ద మూడేళ్ల క్రితమే షెడ్ నిర్మాణానికి పూనుకున్నారని, ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన దేవస్థానం అధికారులు హఠాత్తుగా షెడ్ తొలగించడం వెనుక లెక్కకుదరకే ఇదంతా అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవస్థానం స్థలాల్లో అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు ఎన్నో వెలిశాయని, వాటన్నింటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అంటున్నారు. దేవస్థానం అధికారులను ప్రసన్నం చేసుకుంటే అక్రమమైనా, సక్రమమైపోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.










