అమ్మ కడుపులో పిండంగా వున్నప్పటి నుండే దాడి మొదలవుతుంది. పుట్టేది అమ్మాయి అయితే అబార్షన్లు, అమ్మలకి తన్నులు. అది దాటుకొని బయటకు వచ్చాక ప్రతి చోటా ఆంక్షలే. అదే అబ్బాయిలకైతే ఏం చేసినా 'ఆడు మగాడ్రా బుజ్జి' అంటారు. అందుకే నేడు అసమానతలకు తోడు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చేసిన అత్యాచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు డ్రస్సుల మీద నెపం వేస్తున్నారు. 6 రోజుల పాప నుండి అరవై ఏళ్ల అవ్వ వరకూ అత్యాచార బాధితులే. ప్రేమించలేదని గుంటూర్లో నడిరోడ్డుపై ఒక అమ్మాయి గొంతు కోశాడు ఓ ఉన్మాది. విశాఖలో 13 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్యాచారానికి తెగబడ్డారు దుర్మార్గులు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) రిపోర్టులు పరిశీలిస్తే సగటున రోజుకి 98 మందిపై అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఎన్‌సిఆర్‌బి ప్రకారం 2019-20లో 3,71,503 అత్యాచార కేసులు నమోదు కాగా అందులో 49,385 కేసులతో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ, ఆంధ్రా 8,9 స్థానాల్లో ఉన్నాయి. అత్యాచార కేంద్రాలుగా బిజెపి పాలిత ప్రాంతాలైన అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్ నిలిచాయి. అమ్మాయిలపై ఇటువంటి అత్యాచారాలు జరిగినప్పుడల్లా నిందుతుడిని ఉరి తీయాలనో, ఇంకా కఠినమైన చట్టాలు రావాలనో పౌర సమాజం నుండి స్పందనలు రావడం సహజం. ప్రభుత్వాలు కూడా ఆయా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని హడవుడిగా కొత్త చట్టాలు తీసుకురావడం, ఉరి తీయడం లేదా ఎన్‌కౌంటర్ చేసి తమ ఓటు బ్యాంకును కాపాడుకొంటూ చేతులు దులుపుకుంటున్నాయి. శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించడం లేదు. స్త్రీని కేవలం ఒక వ్యాపార వస్తువుగా, బానిసగా, వంటింటికే పరిమితం చేయాలనే ఫ్యూడల్, పురుషాధిక్య, మను వాద భావజాలమే ఇందుకు ప్రధాన కారణం. అసమానత, వివక్ష, అణచివేత ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించాలి. ఆడపిల్లలు లేకపోతే సమాజ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని చెప్పాలి.
విద్య లోనూ అసమానతే
'బాలికా విద్యే మా ప్రాధాన్యత' అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ ఆచరణ లేదు. బడిలో చేరుతున్న అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది. ఫలితాల్లో మాత్రం అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. అఖిల భారత ఉన్నత విద్యా సర్వే 2019-20 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పిహెచ్‌డి, ఎం.ఫిల్, పీజీ, పీజీ-డిప్లొమా, యూజీ, ఇంటిగ్రేటెడ్ వంటి కోర్సుల్లో చేరిన మొత్తం విద్యార్థులలో అబ్బాయిల సంఖ్య 10,21,126 వుండగా అమ్మాయిల సంఖ్య 8,70,023 ఉంది. గత 5 సంవత్సరాల నుండి అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. దీనికి తోడు ఓవైపు విద్య వ్యాపారీకరణను మరింత పెంచే నూతన విద్యా విధానం 2019 (ఎన్‌ఇపి). మరోవైపు కరోనా విపత్కర పరిస్థితుల వలన తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోవడం లేదా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడం వల్ల కూడా అమ్మాయిల మీదే ప్రభావం పడింది. ఎన్‌ఇపి ని మొదటగా మన రాష్ట్రంలో అమలు చేయడంలో భాగంగా ఈపాటికే 12 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను, వేలాది ఉపాధ్యాయులను కుదిస్తున్నారు. ప్రయివేటు సంస్థల్లో చదివే పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన వర్తించదంటూ జీవో నెం.77 తీసుకు వచ్చి ఏడాదికి 1,96,372 మందికి స్కాలర్‌షిప్ ఎగ్గొట్టారు. గ్రామీణ, గిరిజన, దళిత విద్యార్థులకు ఉపయోగపడుతున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసి ఏడాదికి 32,000 మందికి అన్యాయం చేశారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రయివేటికరిస్తూ (2,203 పాఠశాలలు, 182 జూనియర్ కాలేజీలు, 124 డిగ్రీ కాలేజీలు) 3,40,468 మందిని విద్యకు దూరం చేస్తున్నారు. వీటి వలన మొదట విద్యకు దూరమయ్యేది ఆడపిల్లలే. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 10 శాతం కేటాయించాలంటుంటే... జగన్ ప్రభుత్వం నిధులు తగ్గించుకునేందుకు ఆడపిల్లలను బలిచేస్తున్నది.
వారి హక్కులు వారికిద్దాం
కంప్యూటర్ కాలంలో కూడా ఆడపిల్లలను సమానంగా చూడలేకపోతున్నాం. మహిళాభివృద్ధి కోసం, సమానత్వ సాధన కోసం రాజ్యాంగం మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్ బిల్లు నేటికీ చట్టం కాలేకపోయింది. పార్లమెంటులో మెజారిటీ ఉందని విర్రవీగుతున్న బిజెపి... ప్రజలకు నష్టం కలిగించే అనేక బిల్లులను పాస్ చేసింది. కార్మిక చట్టాలను కాలరాసి ప్రయివేట్ సంస్థల్లో ప్రసూతి సెలవు పెట్టిన వారిని ఇంటికే పరిమితం చేసింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారు. రాత్రికి రాత్రి 360 ఆర్టికల్ రద్దు, నోట్ల రద్దు చేసిన ప్రభుత్వం... 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఎందుకు చట్టం చేయడం లేదు. ఈ రోజు 33 శాతం రిజర్వేషన్‌ని అంగీకరించని వారు రేపు 50 శాతం రిజర్వేషన్‌ని అంగీకరిస్తారా? ఓటింగ్‌లో 51 శాతం పాల్గంటున్న మహిళలను పాలనలో కేవలం 14 శాతానికి పరిమితం చేశారు. సమాజం లోని మహిళల స్థానాన్ని బట్టి ఆ సమాజపు అభివృద్ధి కొలవబడు తుందంటారు జ్యోతిబా ఫూలే. కానీ మోడీ గారికి అభివృద్ధి అంటే ఎత్తైన విగ్రహాలు, అద్దాల మేడలు, అంబానీ, అదానీ ఆస్తుల పెరుగుదల తప్ప...బడుగు బలహీనుల జీవితాలు, మహిళా, కార్మిక, గిరిజన హక్కులు కనబడడం లేదు.
వేలాది మంది పోరాడితేనే మహిళలకు ఓటు హక్కు, సమాన పనికి సమాన వేతన చట్టాలు వచ్చాయి. ఇవే కాదు. నేడు మనం అనుభవిస్తున్న చట్టాలన్నీ పోరాటాల ద్వారా సాధించినవే. కథువా, ఉన్నావో ఘటనల్లో నిందితులను రక్షించేందుకు బిజెపి చేసిన విశ్వప్రయత్నాలను చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటిపై పోరు సల్పాలి. అంతేగాక, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఎగసిన 'మీ టూ' ఉద్యమంలో, సిఎఎ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో ముందు వరుసలో ఉన్న మహిళల్లాగా చురుగ్గా కదలాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జైళ్లకు వెళ్ళడానికి సైతం వెనుకాడం అంటున్న జెఎన్‌యు విద్యార్థులు అయిషీ ఘోష్, దేవాంగన, నటాషా లాగా ప్రశ్నించాలి. పోరాడాలి. మహిళల హక్కులు, సమానత్వాన్ని సాధించుకోవాలి.
ఎల్. చిన్నారి
/ వ్యాసకర్త - ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్,
సెల్ : 7382004271










