Mar 13,2022 13:40

ఆమె ట్రాన్స్‌జెండర్‌ అని తెలియగానే కుటుంబం వదిలేసింది. భిక్షాటన, సెక్స్‌వర్క్‌ చేసుకుంటూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారామె. తనలాంటి ఎందరో అనాథలకు అండగా నిలవాలనుకున్నారు. కొందరి స్నేహితుల సాయంతో ''నమ్మనే సమ్మనే ఎన్జీవో'' ను ప్రారంభించారు. అనాథలు, నిరాశ్రయులు, హెచ్‌ఐవి రోగులకు అందులో ఆశ్రయం కల్పిస్తూ, వారికి అమ్మగా మారారు. ఆమే బెంగళూరుకు చెందిన నక్షత్ర. భారతదేశంలో మొట్టమొదటిగా నమోదు చేయబడిన చట్టబద్ధమైన అనాథాశ్రమం నడుపుతున్న ఆమె గురించి..

'మాది గుల్బర్గా. నాన్న పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. నేను వారికి ఒక్కగానొక్క సంతానాన్ని. పుట్టుకతో అబ్బాయిగా పుట్టాను. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మాయిగా ఉండటం అంటేనే ఇష్టముండేది. నా తల్లిదండ్రుల దగ్గర నిజాయితీగా ఉండాలి అనుకున్నా. అందుకే ఒకరోజు నా అంతరంగిక భావాలను వారితో పంచుకున్నా. వారు నన్ను అంగీకరించలేదు. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో 18 సంవత్సరాల వయస్సులోనే ఇంటినుంచి బయటకు వచ్చేశాను. బెంగళూరు వెళ్లాను. కానీ బతకడానికి పనిలేదు. ఉండటానికి ఇల్లు లేదు. ఏ ఒక్కరూ నా మీద జాలి చూపలేదు. దాంతో పగటిపూట భిక్షాటన చేస్తూ, రాత్రులు బస్టాండ్‌లోనే పడుకున్నాను. అలా ఆరునెలలు కొనసాగింది. కొందరు ట్రాన్స్‌ ఉమెన్స్‌ నన్ను రక్షించడానికి ముందుకు వచ్చారు. వారితో కలిసి భిక్షాటన, సెక్స్‌వర్క్‌ చేస్తూ డబ్బు సంపాదించడం మొదలుబెట్టా. అలా సంపాదించిన డబ్బుతోనే ఢిల్లీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశా' అంటున్నారు నక్షత్ర.

అనాథలకు అమ్మగా..
నమ్మనే సమ్మనే ఎన్జీవో ప్రారంభం..
        ఢిల్లీలో బిటెక్‌ పూర్తిచేసిన తర్వాత నక్షత్ర బెంగళూరుకు తిరిగి వచ్చారు. స్థానిక స్వచ్ఛంధ సంస్థతో కలిసి పనిచేశారు. అప్పుడే మానవత్వం కలిగిన మనుషులతో పరిచయాలయ్యాయి. 'ఇకపై గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నా. సెక్స్‌వర్క్‌ మానేశా. ఒకరోజు వీధిలో వెళుతున్నప్పుడు కొందరు అనాథ పిల్లలను చూశా. చాలా జాలేసింది. వాళ్లూ నాలాగే అనాథలు. ఎలాగైనా అలాంటివారిని ఆదుకోవాలి అనుకున్నా. వారికి ఆశ్రయం కల్పించడం నా ఒక్కదానివల్ల కాదు. అందుకే నా స్నేహితులు సిల్క్‌, రేష్మ, మిలానా, సౌందర్యను సాయం అడిగా. వారందరూ సాయం చేయడానికి ముందుకొచ్చారు. మేమంతా కలిసి 2019లో 'నమ్మనే సమ్మనే' అనే ఎన్జీవోను ప్రారంభించాం. ఇందులో నిరాశ్రయులు, హెచ్‌ఐవి రోగులు, అనాథలకు ఆశ్రయం కల్పిస్తాం. దీనిని ప్రారంభించడం కోసం నా నగలను అమ్మేశాను. ప్రస్తుతానికి మేం ఐదుగురమే అన్ని ఖర్చులనూ భరిస్తున్నాం. రేష్మ టైలరింగ్‌, మిలానా బ్యూటీషియన్‌గా, సౌందర్య ఒక ఎన్జీవోలో ఉద్యోగినిగా పనిచేస్తారు. సిల్క్‌, నేనూ నమ్మనే సమ్మనే పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాం. మా కష్టాన్ని ఈ ఎన్జీవో కోసమే ఖర్చు చేస్తాం. గౌరవప్రదమైన పనిచేస్తున్నా.. నేటికీ మేం వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాం. మా ఎన్జీవోను నడపడానికి భవనం ఎవరూ అద్దెకివ్వలేదు. పేదలు నివాసముంటున్న గంగొండనహళ్లిలో అతికష్టం మీద మూడంతస్తుల భవనం అద్దెకు దొరికింది. ఇందులో పిల్లలకు ఉచిత సంరక్షణను అందిస్తాం. ఇక్కడ లింగ, సామాజిక వర్గ బేధాలు ఉండవు. నెలకు రూ.50 వేల నిర్వహణ ఖర్చు వస్తుంది. అందరిలాగే కోవిడ్‌ మా జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఆ సమయంలో మా ఎన్జీవోను ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. ఇప్పటివరకూ మేం దాచిన మొత్తాన్ని వాడేశాం. దాతలెవరైనా ముందుకొచ్చి, మాకు సహాయం చేయాలని మేం కోరుకుంటున్నాం' అంటున్నారు నక్షత్ర. 'పిల్లలు పుట్టలేదని, నా భర్త నన్ను వదిలేశాడు. దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను పోలీసులు ఇక్కడకు పంపారు. ఇక్కడే వాలంటీర్‌గా పనిచేస్తున్నాను. సంతోషంగా ఉన్నాను' అంటున్నారు 58 ఏళ్ల శాంతమ్మ.
           'మా దగ్గర ఆశ్రయం పొందే పిల్లలు, పెద్దల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలనేదే మా లక్ష్యం. మేము మదర్‌ థెరాసాలు కాలేమని మాకు తెలుసు. కానీ ఇతరులకు సహాయం చేయడానికి మా వంతు కృషి చేయగలం కదా?' అంటున్నారు నక్షత్ర.

అనాథలకు అమ్మగా..