Apr 21,2023 00:22

కుమార్తె మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి చిన్నమ్మి

-తల్లిదండ్రులను పరామర్శించిన గిరిజన సంఘం నేతలు
- వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందినట్లు వెల్లడి
ప్రజాశక్తి-మారేడుమిల్లి

వై.రామవరం మండలం కోట ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న కోట గ్రామం అద్దరివీధికి చెందిన బట్ట లక్ష్మి (13) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. వారం రోజుల పాటు జ్వరంతో బాధపడుతుండగా ఎటువంటి వైద్యం అందకపోవడంతో ఫిట్స్‌ వచ్చి మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోత రామారావు, జిల్లా అధ్యక్షుడు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి బాలిక తల్లిదండ్రులను పరామర్శించి, ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు బట్ట దేవి రెడ్డి, చిన్నమ్మి మాట్లాడుతూ వారం రోజుల నుండి జ్వరంతో పాటు పాఠశాల మెట్ల మీద పడి తలనొప్పితో బాధ పడినట్లు తెలిపారు. దీనిపై పాఠశాల సిబ్బందిని వివరణ కోరగా రెగ్యులర్‌గా పాఠశాలకు హాజరైందని, ఒక్క రోజు మాత్రమే పాఠశాలకు రాలేదని, ఏం జరిగిందో అర్ధం కావడం లేదని తెలిపారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం నేతలు రామారావు, సిరిమల్లిరెడ్డి మాట్లాడుతూ సదరు విద్యార్థిని లక్ష్మిది పాఠశాల ఉన్న గ్రామమే కావడంతో ఆమె ఇంటికి వెళ్లిపోవడంతో పాఠశాల సిబ్బంది ఆమె బాగోగులు పట్టించుకోలేదని అర్థమవుతుందని తెలిపారు. సకాలంలో వైద్యం అంది ఉంటే లక్ష్మి బతికేదని పేర్కొన్నారు. పివిటిజి కొండ రెడ్డి తెగకు చెందిన అత్యంత వెనుకబడిన పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు అమాయకత్వం వల్ల వైద్యం చేయించలేకపోయారని, పాఠశాల అధికారులు కూడా పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, గిరిజనుల అవగహన రాహిత్యం, అమాయకత్వం వల్ల ఇటువంటి అనేక మరణాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వైద్యం అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, వారం రోజుల పాటు అనారోగ్యంతో బాధపడుతుంటే ఎందుకు వైద్యం అందించలేదని ప్రశ్నించారు. అనేక గిరిజన కుటుంబాలు డబ్బుల్లేక వైద్య సేవలు పొందకపోవడం వల్ల మరణిస్తున్నారని, ఇలాంటి కుటుంబాలను ప్రభుత్వం, ఐటిడిఎలు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించాలని, గిరిజనుల మరణాలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కె.రమణ, గ్రామస్తులు సిహెచ్‌.చిన్నారెడ్డి, బి.రామిరెడ్డి పాల్గొన్నారు.