సరైన వైద్యం అందకపోవడమే కారణం?
ప్రజాశక్తి- మోతుగూడెం
చింతూరు మండలం, మోతుగూడెం పరిధిలో ఉన్న రాజ్ క్యాంప్‌లో మంగళవారం గిరిజన బాలిక గోలారీ అనిత అనారోగ్యంతో మృతి చెందింది. రాజ్ క్యాంపులో నివాసముంటున్న గోలారీ సోమార, గోలారీ డోంబై మూడో కుమార్తె అయిన అనిత రాజ్ క్యాంపు గ్రామానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఫార్బరు స్కూల్‌లో ఐదో తరగతి చదువుతుంది. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికను చిత్రకొండ ఆసుపత్రిలో చేర్చారు. అయితే అక్కడ సరైన వైద్యం అందలేదని బంధువులు తెలిపారు. సోమవారం రాజ్ క్యాంపులోని ఇంటికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించి సోమవారం రాత్రి అనిత మరణించింది. సమాజనికి దూరంగా విసిరేసినట్టు ఉండే ఈ రాజ్ క్యాంపు గ్రామంలో 12 కుటుంబలు, 40 మంది జనాభా ఉన్నారు. మోతుగూడెంకు 16 కిలోమీటర్లు దూరంలో ఫార్బరుకి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంటున్న ఈ గ్రామానికి కాలినడక బాటలో వెళ్ళాలి. రోడ్డు సౌకర్యం, కరెంట్ సౌకర్యం, నీళ్ల సౌకర్యం కూడా లేవు. ప్రతి రోజూ ఐదుగురు పిల్లలు కాలినడకన ఫార్బరు స్కూల్‌కి చదవడానికి వెళ్తున్నారు. అనారోగ్యం చేసినా, గర్భిణుల ప్రసవ సమయంలోనూ, ఏ సమస్య వచ్చినా రెండు కిలోమీటర్లు అడవి కొండల నడుమ నాలికడకన ప్రయాణించాలి. వర్ష కాలంలో వీరి బాధలు వర్ణించలేనివి. చాలాసార్లు అధికారులకు వీరి గోడు విలిపించినా కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పటికైనా అధికారలు తమ గ్రామానికి రోడ్డు, కరెంట్, వైద్య సౌకర్యాలు కల్పించాలని వారు కోరుకుంటున్నారు.










