ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ ఎఎస్‌ఐ జగత్ రారు శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో స్థానిక పోలీసులలో విషాదఛాయలు అలముకున్నాయి. జగత్‌రారు మండలంలోని దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో పని చేసి, బదిలీపై సీలేరు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆరు నెలలు అయింది. 1984 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికై వివిధ పోలీస్ స్టేషన్లో సేవలు అందించారు. రెండు రోజుల నుంచి ఆయన అనారోగ్యానికి గురి కావడంతో వైద్య సేవలు అందించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగులేకపోవడంతో స్థానిక ఎస్సై రామకృష్ణ వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం సీలేరు చేరుకున్నారు. జగత్ రారుకు స్థానిక పిహెచ్‌సిలో వైద్య సేవలు అందించి, మెరుగైన వైద్య సేవ నిమిత్తం శనివారం తెల్లవారుజాము 4.30 గంటలకు అంబులెన్స్‌లో చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందారు. జగత్ రారు మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని ఎస్‌ఐ రామకృష్ణ అన్నారు. ఎస్‌ఐతో పాటు సిఆర్పిఎఫ్ పార్టీ టు బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సురేష్, సివిల్ పోలీసులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతదేహాన్ని అరకు సమీపంలో పద్మాపురం గ్రామానికి కుటుంబ సభ్యులు తరలించారు.
25వేలు ఆర్థిక సాయం అందజేత
జగత్ రారు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, చింతపల్లి ఎఎస్‌పి శివ కిషోర్ సంతాపాన్ని తెలియజేశారు. అంత్యక్రియలు నిమిత్తం ఆర్థిక సహాయంగా పోలీస్ శాఖ నుంచి రూ.25వేలు చెక్కును చింతపల్లి ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు అందజేసినట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు.










