
ప్రజాశక్తి-అచ్యుతాపురం
అభిజిత్ పరిశ్రమలో పనిచేస్తున్న రెడ్డి అప్పలరాజు (30) అనారోగ్యంతో అకాలంగా గురువారం రాత్రి మృతి చెందాడు. మండలంలో తాళ్లదిబ్బ గ్రామానికి చెందిన రెడ్డి అప్పలరాజు అభిజిత్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం విధులకు హాజరయ్యాడు. అక్కడ పనిచేస్తుండగా అప్పలరాజుకు వాంతులు విరోచనాలు ప్రారంభమయ్యాయి. వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా నామ మాత్రంగా టాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. గురువారం నాటికి అప్పలరాజు పరిస్థితి సీరియస్ కావడంతో మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి తరలిస్తుండగా, మార్గమధ్యలో ప్రాణం విడిచాడు.
అయితే పరిశ్రమ యాజమాన్యం కనీస మానవతా దృక్పథంతో వ్యవహరించలేదు. దీంతో అప్పలరాజు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు గురువారం రాత్రి అభిజిత్ పరిశ్రమ ప్రధాన గేటు వద్దకు అప్పలరాజు మృతదేహాన్ని తీసుకెళ్లి పరిశ్రమ యాజమాన్యానికి విషయం తెలిపారు. అప్పలరాజు కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించారు. అయినా యాజమాన్యం కనీసం పట్టించుకోలేదు. యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా మృతుని బంధువులు పరిశ్రమ గేట్ ముందు ఆందోళనకు దిగారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.రాము, టిడిపి ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు తదితరులు వారికి సంఘీభావంగా నిలిచారు. యాజమాన్యంతో చర్చలు జరిపారు. అప్పలరాజు కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చివరికి యాజమాన్యం దిగొచ్చి అప్పలరాజు కుటుంబానికి రూ.7.50 లక్షలు పరిహారం ఇవ్వడానికి అంగీకరించింది. దీంతో అప్పలరాజు మృతదేహాన్ని బంధువులు తమ గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము, చిప్పాడ గ్రామ సర్పంచ్ రాజాన నాయుడు బాబు, టిడిపి మండల నాయకుడు రాజాన రామునాయుడు, ఎండ్ర అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంతో కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువు
ఈ సందర్భంగా టిడిపి ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎస్‌ఇజెడ్‌లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు కనీస భద్రత కరువైందని ఆరోపించారు. ఇక్కడి పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికుల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రులు నిర్మించకపోవడం విచారకరమన్నారు. అనేకమార్లు పలు పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు.