ప్రజాశక్తి - చిలకలూరిపేట : బతకడానికి సరైన పనులు దొరకవు.. శుభ్రంగా ఉందామన్నా అందుకు కావాల్సిన వాతావరణం, ఆర్థిక వనరులూ ఉండవు.. ఈ పూట గడిస్తే చాలు.. అందరికీ కడుపు నిండితే చాలు.. అని దినదిన గండంగా సాగే జీవితాలు.. వెలివేయకుండానే వేలివేసినట్టు దుర్భర దారిద్య్రంలో రెడ్డి యానాది సామాజిక తరగతికి చెందిన వారు జీవిస్తున్నారు.
పట్టణంలోని 25వ వార్డు జాగుపాలెంలో వాగు కరకట్ట దిగువన రెడ్డి యానాది సామాజిక తరగతికి చెందిన 40 కుటుంబాలు 70 ఏళ్లుగా పూరిగుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. స్త్రీలు అయితే సమీప ఇళ్లల్లో ఇంటి పనులకు వెళ్తుంటారు. ఇందుకుగాను నెలకు రూ.రెండు వేల నుండి రూ.2500 వరకూ వస్తాయి. పురుషులైతే ఓగేరు వాగులో చేపలు పట్టుకుని వాటిని పట్టణంలో ఎక్కడో ఒకచోట రోడ్డు పక్కన పెట్టుకుని అమ్ముకుంటారు. అన్నీ అమ్ముడైతే రూ.300-400 వరకూ వస్తాయి. ఈ పనీ నెలలో సగం రోజులకు మించి ఉండదు. మార్కెట్ ఉన్నా అందులో వీరికి అమ్ముకునే అవకాశం ఇవ్వడం లేదు. మహిళల ఆదాయమే కుటుంబ జీవనానికి ప్రధానం. దీంతోపాటు ఇళ్లల్లో పని చేసి వచ్చేటప్పుడు యజమానులు ఏదైనా తినడానికి ఇస్తే దానితో కడుపు నింపుకుంటారు. ఇతరుల మాదిరే వేరే పనులు చేసుకుందామంటే తమనెవరూ పనులకు పిలవరని, తామే వెళ్లి అడిగినా పనిలో పెట్టుకోరని ఇక్కడి వారు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో సుమారు 40 మందికిపైగా చిన్నపిల్లలున్నారు. వీరిలో కొంతమందికి వేద అనే సంస్థ పాఠశాల నిర్వహిస్తుండగా మరికొందరు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. సుమారు 15 మంది మాత్రం చదువుకు నోచడం లేదు. ఈ ప్రాంతంలో అపారిశుధ్యం రాజ్యమేలుతోంది. రోడ్లు, నీరు, వీధి దీపాలు, సరైన డ్రెయినేజీ సదుపాయం ఏమీ లేదు. వర్షం వస్తే బురదలోనే రాకపోకలు సాగించాలి. నిత్యం దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది. విషపురుగులు సంచరిస్తుంటాయి. ఈ ప్రాంతానికి నీటి సదుపాయమూ లేదు. స్థానికంగా కొద్ది దూరంలో ఉన్న ఒక బోరింగే అన్ని కుటుంబాల నీటి అవసరాలకూ ఆధారం. తాగు నీటికి ఒక మున్సిపల్ ట్యాపు ఉంది.
వీరిలో కొంతమందికి జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఆ స్థలాలు ఎక్కడున్నాయో కూడా వీరికి తెలియదు. ఇళ్లు నిర్మించుకునే స్తోమత అసలే లేదు. పెరిగిన ధరలు, తమ ఆదాయాలను చూసుకుంటే రూ.10 రూపాయలు పెట్టి తలకు కొబ్బరి నూనె కొనుక్కోవడానికీ తాము వెనకాడాల్సి వస్తోందని, ఇక ఇంటి నిర్మాణం అంటే సాధ్యం కానిపని అని ఇక్కడి వారు చెబుతున్నారు. పైగా ఆ స్థలాల్లోకి వెళ్లి ఉంటే ఇప్పుడున్న కొద్దిపాటి పనులు కూడా దొరకవని, ఒకవేళ పనికి వచ్చి వెళ్లాలన్నా ఏడెనిమిది కిలోమీటర్లపాటు ఛార్జీలు పెట్టుకుని తిరగడానికి తమకు వచ్చే ఆదాయం కూడా చాలదని వాపోతున్నారు. తాము ఇప్పుడు ఉంటున్న ప్రాంతంలోనే మెరకలు తోలించి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, తాము వాగులో పట్టిన చేపలను మార్కెట్‌లో అమ్ముకునే వీలు కల్పించాలని వీరు కోరుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా వీరిని అభ్యున్నతి దిశగా నడిపించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. మౌలిక వసతుల కల్పన, చిన్నారులకు చదువులపై శ్రద్ధ అవసరం. అదే జరిగితే తమకు అంతకంటే కావాల్సింది ఏముంటుందని ఇక్కడివారు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా సరైన ఇళ్లే లేని తమకు ఏడు కరెంటు మీటర్లు ఉన్నాయంటూ అమ్మఒడి, పింఛను తదితర పథకాలకు అనర్హులను చేశారని, అధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు.










