Oct 08,2023 00:06

తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడుతున్న పాదయాత్ర బృందం

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : దళితులెవరైనా చనిపోతే ఖననం చేసేందుకు శ్మశాన స్థలాలూ లేవని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో కాల్వ కట్టల వెంట ఖననం చేయాల్సిన దుస్థితి నెలకొందని, ఆ సందర్భంలోనూ అధికారులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర ఐదో రోజైన శనివారం తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికి తమ సమస్యలపై వినతిపత్రాలను పాదయాత్ర బృందానికి ఇచ్చారు. శనివారం పాదయాత్ర తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ప్రారంభం గ్రామంలోని మసీదు సెంటర్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులతో పాశం రామారావు మాట్లాడి వారి సమస్యలు తెసుకున్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 4 లేబర్‌ కోడ్‌లుగా కుదించిందని, అనేకసార్లు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. దీనిఫలితంగా నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజలపై అదనపు బారాలు పడ్డాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఇసుక విధానం వల్ల ఇసుక కొరత ఏర్పడి కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. తాడేపల్లి మండలంలోని పలు గ్రామాలు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చేసి పన్నుల భారాన్ని మోపారని అన్నారు. రాష్ట్రంలోని అధికార వైపితోపాటు ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలో మోడీ జపం చేస్తున్నారేగాని వారికి ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. ఇదిలా ఉండగా పాదయాత్ర బృందానికి వడ్డేశ్వరంలోని భూ పోరాట కేంద్రంలో అసైన్డ్‌ భూముల్లో నివసిస్తున్న పేదలు తమకు నివసించే చోటే ఇళ్ల స్థలాలను రెగ్యులర్‌ చేసి, పట్టాలివ్వాలని మహిళలు వినతి పత్రాన్ని ఇచ్చారు.
అనంతరం ఇప్పటం గ్రామానికి చేరుకున్న పాదయాత్రలో సిపిఎం జిల్లా నాయకులు కె.అజరు కుమార్‌ మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం పూనుకుందని మండిపడ్డారు. వ్యవసాయంలో నష్టాలతో రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాటిని నివారించడంలో, మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ : మండలంలోని ఆత్మకూరు, పెడవడ్లపూడిలో పాదయాత్ర జరిగింది. గ్రామస్తులు స్వాగతం పలికి పలు సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తెచ్చారు. ఆత్మకూరు నిమ్మగడ్డనగర్‌ మొసలి పకీరయ్య అధ్యక్షతన సభ నిర్వహించగా రామారావు మాట్లాడుతూ గ్రామాల్లోని పేదలు ఎక్కడ నివాసం ఉంటుంటే అక్కడే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రోడ్డు విస్తరణ పేరుతో గ్రామంలో తొలగించిన పేదల ఇళ్లకు ప్రత్యామ్నాయంగా నేటికీ స్థలాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో నిమ్మగడ్డ రామ్మోహనరావు నగర్‌, వైఎస్సార్‌ కాలనీ, వడ్డెర కాలనీ ప్రజలు ఇళ్ల పట్టాలు లేక అవస్థలు పడుతున్నారని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలోని 200 దళిత కుటుంబాలకు స్మశాన స్థలం లేక అవస్థలు పడుతున్నారని, కాల్వ గట్టుల వద్ద ఖననం చేస్తుంటే ఇరిగేషన్‌ అధికారులు ఆడుకుంటున్నారని అన్నారు. ఆత్మకూరు రోడ్డు విస్తరణ బాధితులు 80 మందికి ఇప్పటికీ స్థలాలు కేటాయించలేదన్నారు.
అనంతరం పాదయాత్ర పెడవడ్లపూడికి చేరింది. హై లెవెల్‌ ఛానల్‌ పనులు పూర్తయినా విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో ఐదు మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాలకు నీరు అందడం లేదని స్థానికులు వాపోయారు. అనంతరం రామారావు మాట్లాడుతూ పేదలు నివాసం ఉన్నచోటే వాటిని క్రమబద్ధీకరించాలనే ప్రభుత్వ జీవోలున్నా అమలకు నోచుకోవడం లేదన్నారు. కాల్వ కట్టల సుందరీకిరణ పేరుతో కాల్వకట్లపై నివసించే పేదల ఇళ్లను తొలగించేందుకు పూనుకున్నారని విమర్శించారు. పిడబ్ల్యూడి కట్టలపై, చెరువు పోరంబోకు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి కూలి నాలి చేసుకునే పేదలు తమ ఇళ్లను తొలగిస్తారంటూ నోటీసులు ఇవ్వడంతో వారు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. పేదల వద్ద చెత్త పన్నును బలవంతంగా వసూలు చేస్తున్నారని, చెల్లించని వారికి సంక్షేమ పథకాల్లో కోత పెడతామంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా పాదయాత్రలో భాగంగా ఆయా గ్రామాల్లోని డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌, పుచ్చలపల్లి సుందరయ్య, భగత్‌సింగ్‌, నిమ్మగడ్డ రామ్మోహనరావు, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు.
ప్రజాశక్తి దుగ్గిరాల : అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాలు చర్చించడం లేదని పాశం రామారావు విమర్శించారు. మండలంలోని రేవేంద్రపాడు, పెదపాఎలంలో పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్థానికులు వితిపత్రాలు ఇచ్చారు. కాల్వ గట్టు మీద ఉన్న ఇళ్లను తొలగించరాదని, ఎస్సీలకు శ్మశాన స్థలాలు కేటాయించాలని, కాలం చెల్లిన వంతెన స్థానంలో కొత్తవంతెన నిర్మించాలని అర్జీల్లో ప్రజలు కోరారు. ఇదిలా ఉండగా పాదయాత్రకు ముందు ప్రజానాట్య మండలి కళాకారులు డి.శ్రీనివాసరావు, పి.ప్రసాద్‌ తదితరులు గేయాలు ఆలపిస్తూ ఉత్సాహ పరుస్తున్నారు. పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి, ఎస్‌ఎస్‌ చెంగయ్య, ఇ.అప్పారావు, సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు, జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, తాడేపల్లి మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, మంగళగిరి పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, నాయకులు ఎస్‌.బాలాజీ, వి.వెంకటేశ్వరరావు, ఎం.భాగ్యరాజు, జె.నవీన్‌ప్రకాష్‌, పి.కృష్ణ, బి.సంసోను, వి.పున్నయ్య, వి.దుర్గారావు, యు.దుర్గారావు, ఎం.బాగ్యరాజు, ఎం.బాలాజీ, జి.నాగేశ్వరరావు, క్రాంతి, కృష్ణకాంత్‌, ఎం.రాజముని, జె.బాలరాజు, వై.స్టాలిన్‌, ఎస్‌.గౌరి, వై.బ్రహ్మేశ్వరరావు, ఎం.నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.