ప్రజాశక్తి-గుంతకల్లు పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరిచి ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వి.మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ విస్తీర్ణంతోపాటు జనాభా పెరిగినా అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్య మాత్రం పెరగడం లేదాన్నరు. అంతేగాకుండా రోజురోజుకూ కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. దీంతో పారిశుధ్యం పడకేసి దోమలు పెరిగి ప్రజలకు విషజ్వరాలు సంభవిస్తున్నాయన్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగీ వంటి విషజ్వరాలతో పెద్దలతో ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందక ప్రాణభయంతో మెరుగైన వైద్యం కోసం ప్రయివేట్ ఆసుపత్రులకి వెళ్లి అప్పుల పాలవుతున్నారన్నారు. కావున అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ప్రత్యేక శ్రద్ధతో పట్టణంలో దోమల నివారణ కోసం ఫాగింగ్, పిచికారి, బ్లీచింగ్ పౌడర్ వంటివాటిని చల్లాలని కోరారు. అదేవిధంగా స్పెషల్ డ్రైవ్ కింద మురికి కాలువలు, చెత్తాచెదారాలు, పిచ్చి మొక్కలను తొలగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కసాపురం రమేష్, సాకే నాగరాజు, పట్టణ కమిటీ సభ్యులు చొక్కా సునీల్‌కుమార్, చంద్ర, తిమ్మప్ప, జాకీర్, అబ్దుల్లా, ఓబులేసు, నాయకులు వెంకీ, చెర్రీ, ప్రతాప్, సూరి, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ మల్లికార్జునకు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు










